RCB Captain | కెప్టెన్సీలో కోహ్లీ కంటే డుప్లెసిస్ బెస్ట్.. మాజీ సంచలన వ్యాఖ్యలు-sanjay manjrekar says faf du plessis has a better leader than virat kohli ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Rcb Captain | కెప్టెన్సీలో కోహ్లీ కంటే డుప్లెసిస్ బెస్ట్.. మాజీ సంచలన వ్యాఖ్యలు

RCB Captain | కెప్టెన్సీలో కోహ్లీ కంటే డుప్లెసిస్ బెస్ట్.. మాజీ సంచలన వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
May 28, 2022 07:32 PM IST

భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.. కోహ్లీ కంటే డుప్లెసిస్ కెప్టెన్సీనే బాగుందని అభిప్రాయపడ్డారు. ఈ సీజన్‌లో డుప్లీ కెప్టెన్సీలో ఆర్సీబీ బాగా రాణించిందని కితాబిచ్చారు.

కోహ్లీ కెప్టెన్సీపై సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు
కోహ్లీ కెప్టెన్సీపై సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు (Instagram,)

రాజస్థాన్ రాయల్స్ చేతిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పరాజయం చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆర్సీబీ అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు. ఐపీఎల్ టైటిల్ గెలవాలనే చిరకాల స్వప్నం ఇంకా కలలాగే మిగిలిపోవడంతో ఆటగాళ్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ప్రదర్శనపై మాజీలు సైతం విమర్శలు గుప్పించారు. అయితే కోహ్లీ గురించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విరాట్ కంటే ఫాఫ్ డుప్లెసిసే ఆర్సీబీకి మెరుగైన కెప్టెన్‌గా ఉన్నాడని అభిప్రాయపడ్డారు.

"గత సీజన్‌తో పోలిస్తే ఆర్సీబీ ఈ సీజన్‌లో కాస్త మెరుగైన ప్రదర్శన చేసింది. విరాట్ కోహ్లీ కంటే ఫాఫ్ డుప్లెసిస్ నాయకత్వంలో మెరుగ్గా రాణించింది. అయితే చాలా వరకు ముందుగానే ఊహించినట్లుగానే జరిగింది. ఇంత దూరమొచ్చారంటే తప్పకుండా గెలవాల్సింది. అయితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎక్కడ తప్పు జరిగిందో, ఏం నిరోధించాలో ముందురోజుల్లో తెలుసుకుంటారు. బౌలింగ్ యూనిట్‌కు వచ్చే క్రెడిట్ అంతా డుప్లెసిస్‌కే వెళ్లాలి. ఇక్కడే అతడి బెస్ట్ కెప్టెన్సీని చూశాం. చాలాసార్లు సరిగ్గా అర్థం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో అత్యుత్తమంగా ఆడాడు. నా అభిప్రాయం ప్రకారం డుప్లెసిస్సే కెప్టెన్‌గా ఉండటం మంచి ఆప్షన్." అని సంజయ్ మంజ్రేకర్ అన్నారు.

ఈ సీజన్‌లో ఆర్సీబీ డుప్లెసిస్ కెప్టెన్సీలో మెరుగ్గా రాణించింది. 8 మ్యాచ్‌ల్లో నెగ్గి 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోను ఓడించి క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. కానీ రెండో క్వాలిఫయర్‌లో రాజస్థాన్ చేతిలో పరాజయం చెంది ఫైనల్‌కు చేరకుండానే ఇంటిముఖం పట్టింది. అయితే ఈ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ అనుకున్న స్థాయిలో మెరుగైన ప్రదర్శన చేయలేదు. దినేశ్ కార్తీక్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్ లాంటి ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు.

బెంగళూరుతో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 157 పరుగులే చేయగలిగింది. ఓబెడ్ మెకాయ్ కేవలం 23 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో మెకాయ్‌తో పాటు ప్రసిధ్ కృష్ణ కూడా 3 వికెట్లు తీయగా.. బౌల్ట్, అశ్విన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యాన్ని రాజస్థాన్ సునాయసంగా ఛేదించింది. బట్లర్ అద్భుతమైన శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ సీజన్‌లో అతడికి ఇది నాలుగో సెంచరీ. బట్లర్ 60 బంతుల్లో 106 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా రాజస్థాన్ మరో 11 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్