Sehwag on Gill: క్రికెట్ నిన్ను గట్టి దెబ్బ కొడుతుంది.. వ్యక్తిగత రికార్డులు చూసుకోకు: గిల్‌పై సెహ్వాగ్ సీరియస్
Sehwag on Gill: క్రికెట్ నిన్ను గట్టి దెబ్బ కొడుతుంది.. వ్యక్తిగత రికార్డులు చూసుకోకు అంటూ శుభ్‌మన్ గిల్‌పై సెహ్వాగ్ సీరియస్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ లో గిల్ ఆడిన తీరుపై అతడు తీవ్రంగా మండిపడ్డాడు.
Sehwag on Gill: పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ గెలవడానికి ఓపెనర్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ తోడ్పడింది. అయినా సరే ఈ ఇన్నింగ్స్ లో అతడు ఆడిన తీరుపై మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మండిపడుతున్నాడు. అతడు టీమ్ కంటే కూడా తన వ్యక్తిగత రికార్డుల కోసమే ఆడుతున్నట్లుగా ఉందని వీరూ అనడం గమనార్హం.
సులువుగా గెలవాల్సిన మ్యాచ్ ను చివరి ఓవర్ వరకూ తీసుకురావడానికి గిల్ ఆడిన తీరే కారణమన్నది సెహ్వాగ్ వాదన. పవర్ ప్లే తర్వాత గిల్ స్ట్రైక్ రేట్ ను వీరూ ప్రశ్నించాడు. "గిల్ 49 బంతుల్లో 67 రన్స్ చేశాడు. కానీ అతని ఫిఫ్టీ ఎప్పుడు పూర్తయింది? 41-42 బాల్స్ లోనే అయింది. అంటే తర్వాత 7-8 బంతుల్లో 17 రన్స్ చేశాడు. తాను హాఫ్ సెంచరీ చేసిన తర్వాతే అతడు వేగం పెంచాడు. అది చేయకపోయి ఉంటే చివరి ఓవర్లో గుజరాత్ 7 పరుగులకు బదులు 17 పరుగులు ఛేదించాల్సి వచ్చేది" అని క్రిక్‌బజ్ తో మాట్లాడుతూ సెహ్వాగ్ అన్నాడు.
నిజానికి సెహ్వాగ్ చెప్పింది వాస్తవమే. గిల్ ఒక దశలో 22 బంతుల్లోనే 35 పరుగులు చేశాడు. కానీ తర్వాత హాఫ్ సెంచరీ కోసం మరో 18 బంతులు తీసుకున్నాడు. "ఎలాగూ మ్యాచ్ గెలుస్తుమనుకుంటూ ఫిఫ్టీ కోసం ఆలోచించకూడదు. ఇది క్రికెట. నువ్వు టీమ్ ను పక్కన పెట్టి వ్యక్తిగత రికార్డుల కోసం చూసుకుంటే.. క్రికెట్ నిన్ను గట్టి దెబ్బ కొడుతుంది. మొదటి నుంచీ అతడు అదే స్ట్రైక్ రేట్ తో ఆడి ఉంటే తన ఫిఫ్టీని ఎప్పుడో పూర్తి చేసుకునేవాడు. టీమ్ కు కొన్ని బంతులు మిగిలేవి" అని సెహ్వాగ్ అన్నాడు.
చివరి ఓవర్లో ఓ భారీ షాట్ కు ప్రయత్నించి గిల్ ఔటయ్యాడు. ఒకవేళ రాహుల్ తెవాతియా ఆ ఫోర్ కొట్టకపోయి ఉంటే గుజరాత్ ఈ మ్యాచ్ లో ఓడిపోయేదే. ఈ విషయాన్ని గిల్ కూడా అంగీకరించాడు. చివరి వరకూ ఉండి మ్యాచ్ ను తానే ముగించాల్సిందని అభిప్రాయపడ్డాడు. అటు కెప్టెన హార్దిక్ కూడా మ్యాచ్ గెలిచినా.. తమ బ్యాటర్ల ఆటతీరును తప్పుబట్టాడు.
సంబంధిత కథనం