PBKS vs MI: రోహిత్‌ను వెక్కిరిస్తూ పంజాబ్ కింగ్స్ ట్వీట్.. మర్యాద ఇవ్వడం నేర్చుకోండంటూ ఎంఐ రిప్లై
04 May 2023, 15:38 IST
- PBKS vs MI: రోహిత్‌ను వెక్కిరిస్తూ పంజాబ్ కింగ్స్ ట్వీట్ చేసింది. దీనికి మర్యాద ఇవ్వడం నేర్చుకోండంటూ ఎంఐ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. బుధవారం (మే 3) మ్యాచ్ తర్వాత రెండు టీమ్స్ మధ్య ట్వీట్ల యుద్ధం నడిచింది.
ఐపీఎల్లో 15వసారి డకౌటైన రోహిత్ శర్మ
PBKS vs MI: రోహిత్ శర్మను వెక్కిరిస్తూ పంజాబ్ కింగ్స్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. ఈ ట్వీట్ ను చూసిన ముంబై ఇండియన్స్ తీవ్రంగా స్పందించింది. అదే స్థాయిలో పంజాబ్ కింగ్స్ కు రిప్లై ఇచ్చింది. బుధవారం (మే 3) జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్సే గెలిచింది. 215 పరుగుల భారీ టార్గెట్ ను ఆ టీమ్ 7 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది.
అయితే కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం ఈ మ్యాచ్ అస్సలు కలిసి రాలేదు. అతడు మరోసారి డకౌటయ్యాడు. దీంతో ఐపీఎల్లో ఓ చెత్త రికార్డును కూడా అతడు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో ఇప్పటి వరకూ అతడు 15సార్లు డకౌటయ్యాడు. ఎక్కువసార్లు డకౌటైన ప్లేయర్ గా రోహిత్.. దినేష్ కార్తీక్, సునీల్ నరైన్ సరసన నిలిచాడు.
ఈ డకౌట్ పైనే పంజాబ్ కింగ్స్ ట్వీట్ చేసింది. అతడు ఔటైన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఆర్0 (R0) అని క్యాప్షన్ పెట్టింది. రోహిత్ ను ఆర్ఓ (RO)గా పిలుస్తుంటారు. కానీ ఆ ఓ స్థానంలో పంజాబ్ కింగ్స్ జీరో పెట్టి అతన్ని వెక్కిరించింది. ఈ పోస్టుపై ముంబై ఇండియన్స్ తీవ్రంగా స్పందించింది. పంజాబ్ కింగ్స్ కు ట్వీట్ ద్వారానే దిమ్మదిరిగే రిప్లై ఇచ్చింది.
రోహిత్ శర్మ ఆరు ట్రోఫీలు గెలిచాడు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కానీ, పంజాబ్ కింగ్స్ కానీ ఒక్కటీ గెలవలేదంటూ అదే జీరోతో తిప్పికొట్టింది. హ్యాష్‌ట్యాగ్ రెస్పెక్ట్ అని రాసి మర్యాద ఇవ్వడం నేర్చుకోండంటూ పరోక్షంగా పంజాబ్ కింగ్స్ కు చెప్పింది. దీంతో పంజాబ్ కింగ్స్ తాము చేసిన ట్వీట్ ను డిలీట్ చేయడం విశేషం. అయితే ముంబై ఇండియన్స్ ట్వీట్ మాత్రం అలాగే ఉంది.