Rohit Sharma Out Controversy: రోహిత్ ఔట్‌లో సంజూ తప్పేమీ లేదా.. ఈ వీడియోతో తేలిపోయింది
Rohit Sharma Out Controversy: రోహిత్ ఔట్‌లో సంజూ తప్పేమీ లేదా? ఈ తాజా వీడియోతో అదే విషయం స్పష్టమవుతోంది. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో రోహిత్ ఔటైన తీరుపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
Rohit Sharma Out Controversy: కొన్నిసార్లు మన కళ్లు కూడా మనల్ని మోసం చేస్తాయి. దీనికి తాజాగా ఐపీఎల్లో చెలరేగిన వివాదమే నిదర్శనం. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో 1000వ మ్యాచ్. అయితే ఈ చారిత్రక మ్యాచ్ లో ఓ వివాదం చెలరేగింది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఔటైన తీరుపై ఆ టీమ్ అభిమానులు మండిపడ్డారు.
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, వికెట్ కీపర్ సంజూ శాంసన్ ను తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అసలేం జరిగిందంటే.. సందీప్ శర్మ బౌలింగ్ లో రోహిత్ క్లీన్ బౌల్డయ్యాడు. అయితే ఈ వీడియోను ముందు నుంచి చూసినప్పుడు బాల్ అసలు స్టంప్స్ కి తగిలినట్లు అనిపించలేదు. సంజూ గ్లోవ్స్ తగలడం వల్లే బెయిల్ కింద పడిపోయిందని ముంబై ఫ్యాన్స్ బలంగా నమ్మారు.
అతడు చాలా అన్యాయంగా వ్యవహరించాడంటూ ఆ వీడియోలతో విమర్శలు గుప్పించారు. కానీ తాజాగా వచ్చిన మరో వీడియో మాత్రం ఇందులో సంజూ తప్పేమీ లేదని తేల్చింది. ఈ వీడియో సైడ్ యాంగిల్ నుంచి వచ్చింది. అందులో చూసినప్పుడు సంజూ గ్లోవ్స్ స్టంప్స్ కి చాలా దూరంగా ఉన్నట్లు తేలింది. బాల్ బెయిల్ కు తగిలిన తర్వాత సంజూ చేతుల్లో పడినట్లు స్పష్టంగా ఉంది.
ఈ వీడియోతో ముంబై అభిమానులకు రాయల్స్ అభిమానులు కౌంటర్ వేశారు. చేయని తప్పుకు సంజూని ఎందుకు నిందిస్తున్నారని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. ఒక్కోసారి మన కళ్లు కూడా మనల్ని మోసం చేస్తాయని ముందు నుంచి ఉన్న వీడియో చూస్తే అనిపిస్తోంది. కానీ సైడ్ యాంగిల్ వీడియోతో అసలు నిజమేంటో తేలిపోయింది. నిజానికి ఈ వివాదంపై రోహిత్ గానీ, ముంబై ఇండియన్స్ గానీ స్పందించలేదు.
ఔటైన తర్వాత రోహిత్ ఎలాంటి అప్పీల్ చేయకుండా పెవిలియన్ కు వెళ్లిపోయాడు. అయితే తర్వాత ముందు నుంచి వచ్చిన రీప్లేలు చూసి ఫ్యాన్స్ తప్పుగా అర్థం చేసుకోనున్నారు. ఈ మ్యాచ్ లో చివరికి ముంబై ఇండియన్సే గెలిచింది. 213 పరుగుల లక్ష్యాన్ని మరో 3 బంతులు మిగిలి ఉండగానే ముంబై చేజ్ చేసింది. వాంఖెడే స్టేడియంలో 200కుపైగా టార్గెట్ చేజ్ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.
సంబంధిత కథనం