MI vs RR: టిమ్ డేవిడ్ విశ్వరూపం - భారీ టార్గెట్‌ను ఛేదించిన ముంబై - రోహిత్ బర్త్‌డే గిఫ్ట్ అదిరిందిగా
MI vs RR: ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబై బ్యాట్స్‌మెన్స్ అద్భుతం చేశారు. 212 పరుగుల టార్గెట్‌ను ఛేదించి చరిత్రను సృష్టించారు.
MI vs RR: 213 పరుగుల టార్గెట్...రెండో ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ, ఎనిమిది ఓవర్లలో చేసింది 70 పరుగులే...ఈ ఆట చూసి ముంబై గెలవడం అందరూ అసాధ్యమే అనుకున్నారు. కానీ ముంబై బ్యాట్స్‌మెన్స్ అద్భుతమే చేశారు. గెలుపు ఆశలు లేని మ్యాచ్‌లో అసమాన పోరాటంతో ముంబైకి తిరుగులేని విజయాన్ని అందించారు.
ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో టీమ్ డేవిడ్ మెరుపులకు తోడు సూర్యకుమార్ యాదవ్, గ్రీన్, తిలక్ వర్మ రాణించడంతో ముంబై ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయాన్ని సాధించింది. రాజస్థాన్ విధించిన 213 పరుగుల భారీ టార్గెట్‌తో సెకండ్ బ్యాటింగ్ చేపట్టిన ముంబైకి ఆదిలోనే పెద్ద దెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
ఆ తర్వాత ఇషాన్ కిషన్, గ్రీన్ కలిసి ముంబైని ముందుకు నడిపించారు. ఇషాన్ నెమ్మదిగా ఆడినా గ్రీన్ మాత్రం సిక్సర్లు, ఫోర్లతో రెచ్చిపోయాడు. ఇషాన్ 23 బాల్స్‌లో 28 రన్స్ చేయగా...గ్రీన్ 26 బాల్స్‌లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 44 పరుగులు చేశాడు.
సూర్యకుమార్ హాఫ్ సెంచరీ…
సూర్యకుమార్ వచ్చి రావడంతోనే రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 29 బాల్స్‌లోనే ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 55 రన్స్ చేశాడు. ఆ జోరును తిలక్ వర్మ (21 బాల్స్‌లో 29 రన్స్), టిమ్ డేవిడ్ కొనసాగించారు. ముంబై గెలుపుకు చివరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన తరుణంలో వరుసగా మూడు బాల్స్‌లో మూడు సిక్స్‌లు కొట్టి టిమ్ డేవిడ్ తమ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
లాస్ట్ ఓవర్ లో మూడు సిక్స్‌లు
టిమ్ డేవిడ్ 14 బాల్స్‌లోనే ఐదు సిక్స్‌లు, రెండు ఫోర్లతో 45 రన్స్ చేశాడు. వాంఖడే స్టేడియంలో ముంబైకి ఇదే అతి పెద్ద ఛేదన కావడం గమనార్హం. అంతే కాకుండా రోహిత్ శర్మ బర్త్‌డే రోజు జరిగిన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్‌లో విజయాన్ని సాధించి అతడికి స్పెషల్ గిఫ్ట్‌ను ఇచ్చారు. రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీసుకున్నాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ యసశ్వి జైస్వాల్ సెంచరీ (124 రన్స్)తో రాణించడంతో ఇరవై ఓవర్లలో 212 పరుగులు చేసింది.