Sandeep Sharma Catch: ఐపీఎల్ గ్రేటెస్ట్ క్యాచ్‌లలో ఇదీ ఒకటి.. సందీప్ స్టన్నింగ్ క్యాచ్ చూశారా?
Sandeep Sharma Catch: ఐపీఎల్ హిస్టరీలోని గ్రేటెస్ట్ క్యాచ్‌లలో ఇదీ ఒకటి. సందీప్ స్టన్నింగ్ క్యాచ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆదివారం ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో సందీప్ ఈ క్యాచ్ అందుకున్నాడు.
Sandeep Sharma Catch: ఐపీఎల్ హిస్టరీలో ఎన్నో కళ్లు చెదిరే క్యాచ్ లు నమోదయ్యాయి. ప్రతి సీజన్ లోనూ అలాంటి కనీసం ఒక్క క్యాచైనా అభిమానులను అలరిస్తుంది. తాజాగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లోనూ అలాంటి క్యాచే ఒకటి అందుకున్నాడు సందీప్ శర్మ. ఐపీఎల్ హిస్టరీలో ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం.
ఈ చారిత్రక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గెలిచినా.. ఆ క్యాచ్ పట్టింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఫీల్డర్ సందీప్ శర్మ. అది కూడా కీలకమైన సమయంలో, టాప్ ఫామ్ లో ఉన్న ఎంఐ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ను ఆ క్యాచ్ ద్వారా పెవిలియన్ కు పంపించాడు. సూర్య అప్పటికే 28 బంతుల్లో 55 పరుగులు చేసి ఊపు మీదున్నాడు.
ఆ 29వ బంతికి కూడా మరో భారీ షాట్ ఆడబోయాడు. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ లో వికెట్లకు అడ్డంగా వెళ్లి.. వికెట్ కీపర్ మీదుగా పుల్ షాట్ ఆడాడు. అది కాస్త 30 గజాల సర్కిల్ ను దాటి బౌండరీ వెళ్లడం ఖాయం అనుకున్నారు. కానీ ఫైన్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సందీప్ శర్మ.. వెనక్కి 19 మీటర్ల దూరం పరుగెత్తుకుంటూ వెళ్లి డైవ్ చేస్తూ ఆ క్యాచ్ అందుకున్నాడు.
అంత ఒత్తిడిలోనూ అంత అద్భుతమైన క్యాచ్ అందుకోవడం నిజంగా అద్భుతమే. ఆ సమయంలో కామెంట్రీ ఇస్తున్న హర్షా భోగ్లే.. దీనిని క్యాచ్ ఆఫ్ ద సీజన్ గా అభివర్ణించాడు. ఈ క్యాచ్ వీడియోను ఐపీఎల్ ట్వీట్ చేసింది. అయితే సందీప్ స్టన్నింగ్ క్యాచ్ కూడా రాయల్స్ ను గట్టెక్కించలేకపోయింది. చివర్లో టిమ్ డేవిడ్ విధ్వంసంతో ముంబై ఇండియన్స్ 213 పరుగుల లక్ష్యాన్ని మరో 3 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది.
చివరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. హోల్డర్ వేసిన తొలి మూడు బంతులనూ సిక్స్ లుగా మలచి ముంబైని గెలిపించాడు టిమ్ డేవిడ్. దీంతో సందీప్ క్యాచ్ తోపాటు అంతకుముందు యశస్వి జైస్వాల్ సెంచరీ కూడా వేస్ట్ అయిపోయింది. ఐపీఎల్ 1000వ మ్యాచ్ కు మంచి ముగింపు దొరకడంతోపాటు తమ కెప్టెన్ రోహిత్ శర్మకు 36వ బర్త్ డే గిఫ్ట్ గా ఈ విజయాన్ని ఆ టీమ్ ప్లేయర్స్ అందించారు.
సంబంధిత కథనం