Amit Mishra Record: ఐపీఎల్లో మలింగను మించిపోయిన అమిత్ మిశ్రా
Amit Mishra Record: ఐపీఎల్లో మలింగను మించిపోయాడు ఇండియన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న అతడు.. సోమవారం (మే 1) ఆర్సీబీతో మ్యాచ్ లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
Amit Mishra Record: ఇండియన్ టీమ్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ల లిస్టులో మూడోస్థానానికి దూసుకెళ్లాడు. ఈ క్రమంలో అతడు శ్రీలంక మాజీ పేస్ బౌలర్ లసిత్ మలింగను వెనక్కి నెట్టాడు. సోమవారం (మే 1) ఆర్సీబీతో మ్యాచ్ లో మిశ్రా ఈ రికార్డు సాధించాడు. ఆర్సీబీ బ్యాటర్ సుయశ్ ప్రభుదేశాయ్ వికెట్ తీయడం ద్వారా అమిత్ మిశ్రా అత్యధిక వికెట్లు తీసుకున్న వాళ్లలో మూడోస్థానానికి వెళ్లాడు.
2008లో తొలి సీజన్ ఐపీఎల్ నుంచి ఆడుతున్న అమిత్ మిశ్రా.. ఇప్పటి వరకూ 160 మ్యాచ్ లు ఆడి 171 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో డ్వేన్ బ్రావో 183 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. అతని తర్వాత రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యుజువేంద్ర చహల్ 178 వికెట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు మిశ్రా 171 వికెట్లతో మూడో స్థానానికి వెళ్లాడు.
చహల్ ఈ సీజన్ ఐపీఎల్లోనే బ్రావోను మించిపోయే అవకాశం ఉంది. అతడు కేవలం ఐదు వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇక అమిత్ మిశ్రా విషయానికి వస్తే ఐపీఎల్లో గతంలో అతడు ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు. 40 ఏళ్ల మిశ్రాకు బహుశా ఇదే చివరి ఐపీఎల్ కావచ్చు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తో ఉన్నా కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఐపీఎల్లో మిశ్రా బెస్ట్ సీజన్ 2013. ఆ ఏడాది అతడు 17 మ్యాచ్ లలో 21 వికెట్లు తీశాడు. అంతకుముందు ఐదేళ్ల పాటు అతడు వరుసగా 11, 14, 17, 19 వికెట్లు తీసుకున్నాడు. 2020, 2021లలో అతడు ఆడలేదు. ఈ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ఆర్సీబీతో మ్యాచ్ లో 3 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.
సంబంధిత కథనం