Amit Mishra Record: అమిత్ మిశ్రా అరుదైన ఘనత.. మలింగ రికార్డును సమం చేసిన స్పిన్నర్-amit mishra equals malinga to become third highest wicket taker in ipl ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Amit Mishra Record: అమిత్ మిశ్రా అరుదైన ఘనత.. మలింగ రికార్డును సమం చేసిన స్పిన్నర్

Amit Mishra Record: అమిత్ మిశ్రా అరుదైన ఘనత.. మలింగ రికార్డును సమం చేసిన స్పిన్నర్

Maragani Govardhan HT Telugu
Apr 22, 2023 05:57 PM IST

Amit Mishra Record: లక్నో స్పిన్నర్ అమిత్ మిశ్రా ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డు సాధించాడు. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అభినవ్ వికెట్‌లో ఈ ఘనతను సాధించాడు.

అమిత్ మిశ్రా
అమిత్ మిశ్రా (AP)

Amit Mishra Record: లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఫలితంగా శ్రీలంక లెజెండ్ పేసర్ లసిత్ మలింగ రికార్డును అమిత్ సమం చేశాడు. లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో 170 వికెట్లు తీసిన అమిత్ మిశ్రా.. మలింగ రికార్డును సమం చేశాడు.

గుజరాత్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో అభినవ్ మనోహర్ వికెట్ తీసిన అమిత్ మిశ్రా ఈ మైలు రాయి అందుకున్నాడు. మొత్తంగా 158 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన అమిత్ మిశ్రా 23.77 సగటుతో 7.35 ఎకానమీ రేటుతో 170 వికెట్లు తీశాడు. అత్యుత్తమంగా 17 పరుగులకే 5 వికెట్లు తీసి అదరగొట్టాడు. మలింగ కూడా 170 వికెట్లు తీయడం విశేషం.

మలింగ తన ఐపీఎల్ కెరీర్‌లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2009 నుంచి 2019 మధ్య కాలంలో 122 మ్యాచ్‌లు ఆడిన ఈ పేసర్ 19.79 సగటుతో 7.14 ఎకానమీ రేటుతో 170 వికెట్లు తీశాడు. ఇతడి అత్యుత్తమంగా 13 పరుగులిచ్చి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డ్వేన్ బ్రేవో అగ్రస్థానంలో ఉన్నాడు. చెన్నై తరఫున ఆడిన అతడు 161 మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీశాడు. 23.82 సగటుతో 8.38 ఎకానమీ రేటుతో వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 22 పరుగులకు 4 వికెట్లు పడగొట్టాడు. అతడి తర్వాత చాహల్(177), మలింగ(170), అమిత్ మిశ్రా(170), రవిచంద్రన్ అశ్విన్(159) ఉన్నారు.

లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య(66) అర్ధశతకంతో ఆకట్టుకోగా వృద్ధిమాన్ సాహా(47) రాణించాడు. వీరిద్దరూ మినహా మిగిలినవారంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టడంతో స్వల్ప పరుగులకే గుజరాత్ పరిమితమైంది. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్య, మార్కస్ స్టాయినీస్ చెరో 2 వికెట్లతో ఆకట్టుకున్నారు. అమిత్ మిశ్రా ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Whats_app_banner