తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Vs Saudi Arabia: ఐపీఎల్‌కు సౌదీ అరేబియా నుంచి ముప్పు తప్పదా.. ఆ గల్ఫ్ దేశం ఏం చేస్తోందో చూడండి

IPL vs Saudi Arabia: ఐపీఎల్‌కు సౌదీ అరేబియా నుంచి ముప్పు తప్పదా.. ఆ గల్ఫ్ దేశం ఏం చేస్తోందో చూడండి

Hari Prasad S HT Telugu

14 April 2023, 13:12 IST

google News
    • IPL vs Saudi Arabia: ఐపీఎల్‌కు సౌదీ అరేబియా నుంచి ముప్పు తప్పదా.. ఆ గల్ఫ్ దేశం తాజాగా చేస్తున్న పని చూస్తుంటే అదే అనిపిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ధనికవంతమైన క్రికెట్ లీగ్ ప్రారంభించాలని సౌదీ చూస్తోంది.
ఐపీఎల్ కు పోటీగా రిచెస్ట్ క్రికెట్ లీగ్ ప్లాన్ చేస్తున్న సౌదీ అరేబియా
ఐపీఎల్ కు పోటీగా రిచెస్ట్ క్రికెట్ లీగ్ ప్లాన్ చేస్తున్న సౌదీ అరేబియా

ఐపీఎల్ కు పోటీగా రిచెస్ట్ క్రికెట్ లీగ్ ప్లాన్ చేస్తున్న సౌదీ అరేబియా

IPL vs Saudi Arabia: ఐపీఎల్.. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద, ధనికవంతమైన క్రికెట్ లీగ్. ప్రపంచంలోనే రిచెస్ట్ బోర్డు బీసీసీఐ నిర్వహిస్తున్న ఈ మెగా లీగ్ ఆదరణ కూడా అదే స్థాయిలో ఉంది. అయితే ఈ రిచెస్ట్ లీగ్ ట్యాగ్ కు సౌదీ అరేబియా నుంచి ముప్పు వాటిల్లే ప్రమాదం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ గల్ఫ్ దేశం ప్రపంచంలోనే ధనికవంతమైన క్రికెట్ లీగ్ ప్రారంభించే ఆలోచనలో ఉంది.

ఇప్పటికే ఫార్ములా 1, ఫుట్‌బాల్ లాంటి వాటిపై భారీగా ఇన్వెస్ట్ చేసిన సౌదీ.. ఇప్పుడు క్రికెట్ వైపు చూస్తోంది. అంతేకాదు ఈ రిచెస్ట్ క్రికెట్ లీగ్ ప్రారంభించడానికి ఐపీఎల్ ఓనర్లతోనే సంప్రదింపులు జరుపుతోందని ది ఏజ్ ఒక రిపోర్ట్ ప్రచురించింది. ఏడాది కాలంగా ఈ చర్చలు నడుస్తున్నట్లు కూడా ఆ పత్రిక తెలిపింది. ప్రస్తుతం విదేశీ లీగ్ లలో ఇండియన్ ప్లేయర్స్ ఆడటంపై బీసీసీఐ నిషేధం విధించింది.

కానీ సౌదీ అరేబియా సొంతంగా టీ20 లీగ్ ప్రారంభిస్తే బోర్డు ఆ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి రావచ్చని కూడా ఆ రిపోర్టు వెల్లడించింది. ఈ మధ్యే ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్‌క్లే కూడా సౌదీకి క్రికెట్ పై ఉన్న ఆసక్తి గురించి చెప్పడం గమనార్హం. ప్రపంచంలోనే రిచెస్ట్ టీ20 లీగ్ ప్రారంభించాలని చూస్తున్న సౌదీ అరేబియా.. దీనికోసం ఐపీఎల్ ఓనర్లతోనే సంప్రదింపులు జరుపుతుండటం ఆసక్తి రేపుతోంది.

సౌదీ అరేబియాను గొప్ప క్రికెట్ డెస్టినేషన్ గా మార్చాలన్నదే తమ లక్ష్యమని అక్కడి క్రికెట్ ఫెడరేషన్ ఛైర్మన్ ప్రిన్స్ సౌద్ బిన్ మిషాల్ అల్ సౌద్ వెల్లడించారు. ఆర్థికంగా బలంగా ఉన్న సౌదీ క్రికెట్ లీగ్ లోకి అడుగు పెడితే అది కచ్చితంగా ఐపీఎల్ కు గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే సౌదీ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఇండియాలో జరుగుతున్న క్రికెట్ కార్యకలాపాలను జాగ్రత్తగా గమనిస్తున్నారు.

ఐపీఎల్ ఓనర్లతోపాటు బీసీసీఐని కూడా తమ టీ20 లీగ్ లో భాగం చేయాలని వాళ్లు భావిస్తున్నారు. సొంతంగా టీ20 లీగ్ అనే కాదు.. ప్రతి ఏడాది ఆసియా కప్ లేదంటే ఓ రౌండ్ ఐపీఎల్ మ్యాచ్ లకు సౌదీలో నిర్వహించడంలాంటి ప్రతిపాదనలను కూడా వీళ్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

తదుపరి వ్యాసం