Cricket Leagues | ఐపీఎల్‌లాంటి క్రికెట్ లీగ్స్ ఇంకా ఎన్ని ఉన్నాయో తెలుసా?
క్రికెట్‌లో షార్టెస్ట్ ఫార్మాట్ అయిన టీ20ల్లో ఐపీఎల్ సూపర్‌హిట్ కావడంతో చాలా క్రికెట్ దేశాలు అలాంటి లీగ్స్‌ను తమ దేశాల్లోనూ ప్రారంభించాయి. యూరప్‌లో ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్స్ ఎంత ఫేమసో తెలుసు కదా. ఐపీఎల్ అంత పాపులర్ కాకపోయినా.. కొన్ని లీగ్స్ తమ ఉనికిని చాటుకుంటున్నాయి.
భారత అభిమానుల వరకు Cricket League అంటే ఐపీఎలే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చిన తర్వాత ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కున్న క్రేజ్ మరో స్థాయికి చేరింది. క్రికెట్‌లో షార్టెస్ట్ ఫార్మాట్ అయిన టీ20ల్లో ఐపీఎల్ సూపర్‌హిట్ కావడంతో చాలా క్రికెట్ దేశాలు అలాంటి లీగ్స్‌ను తమ దేశాల్లోనూ ప్రారంభించాయి. యూరప్‌లో ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్స్ ఎంత ఫేమసో తెలుసు కదా. అలాగే క్రికెట్‌లో ఐపీఎల్ అంత పాపులర్ కాకపోయినా.. కొన్ని లీగ్స్ తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అలాంటి లీగ్స్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నవి ఏవో ఇప్పుడు చూద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. సింపుల్‌గా ఐపీఎల్. దీనిగురించి ఇండియాలోనే కాదు ప్రపంచంలోని క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న అన్ని లీగ్స్‌లో టాప్ ఈ ఐపీఎలే. క్రికెట్‌లో ఇంత డబ్బు ఉందా అని ప్రపంచమంతా ముక్కున వేలేసుకునేలా చేసింది ఈ లీగ్. బాదుడు నేర్చిన కుర్ర క్రికెటర్లను కూడా కోటీశ్వరులను చేసింది. 2008లో తొలి ఐపీఎల్ జరగగా.. ప్రతి ఏటా దాని బ్రాండ్ వాల్యూ పెరుగుతూనే ఉంది.
ప్రస్తుతం ఈ లీగ్ బ్రాండ్ వాల్యూ 416 కోట్ల డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 31 వేల కోట్లు. మరే ఇతర క్రికెట్ లీగ్ కూడా దీనికి దరిదాపుల్లో లేకపోవడం విశేషం. బీసీసీఐ తనకున్న మనీ పవర్‌తో ఈ ఐపీఎల్ కోసం క్రికెట్ కేలండర్‌లో ప్రత్యేక విండో సాధించింది. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టార్లంతా ఈ లీగ్‌లో పాల్గొంటారు. క్రికెట్ లీగ్స్‌లో ప్రత్యేకంగా కేలండర్‌లో విండో ఉన్నది కేవలం ఐపీఎల్‌కు మాత్రమే. ఇక ఈ మధ్యే మరో రెండు కొత్త టీమ్స్ కూడా రావడంతో 2022 సీజన్ నుంచి మరిన్ని మ్యాచ్‌లు, మరింత వినోదం, అన్నింటికీ మించి మన క్రికెట్ బోర్డు బీసీసీఐ, క్రికెటర్లపై మరింత కాసుల వర్షం కురవడం గ్యారెంటీ.
బిగ్‌బ్యాష్ లీగ్ (బీబీఎల్)
ఐపీఎల్‌ను చూసి ఆస్ట్రేలియా ప్రారంభించిన ప్రొఫెషనల్ టీ20 లీగ్ ఈ బిగ్‌బ్యాష్. 2011లో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ లీగ్‌ను ప్రారంభించింది. ఐపీఎల్ తర్వాత పాపులర్ లీగ్స్ జాబితాలో ఈ బీబీఎల్ రెండోస్థానంలో నిలుస్తుంది. ఐపీఎల్ సాధారణంగా మార్చి నుంచి మే మధ్యలో జరిగితే.. బీబీఎల్ మాత్రం డిసెంబర్, జనవరిల్లో జరుగుతుంది. ఈ లీగ్‌లో 8 టీమ్స్ ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువ మంది ప్రత్యక్షంగా స్టేడియానికి వచ్చి చూస్తున్న స్పోర్ట్స్ లీగ్స్‌లో బీబీఎల్ 8వ స్థానంలో ఉంది.
టీ20 బ్లాస్ట్ లీగ్
నిజానికి క్రికెట్‌కు పుట్టినిల్లయిన ఇంగ్లండ్‌లోనే తొలిసారి ఓ ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్ కూడా జరిగింది. దాని పేరు టీ20 బ్లాస్ట్ లీగ్. అయితే క్రేజ్ విషయంలో మాత్రం ఐపీఎల్, బీబీఎల్ తర్వాతే ఈ టీ20 బ్లాస్ట్ లీగ్ నిలుస్తుంది. ఈ లీగ్‌లో మొత్తం 18 టీమ్స్ పాల్గొంటాయి.
కరీబియన్ ప్రిమియర్ లీగ్
క్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే కరీబియన్ దీవుల్లో ఈ కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2013 నుంచి జరుగుతోంది. అంతకుముందు వరకూ అక్కడ కరీబియన్ ట్వంటీ20 జరుగుతుండగా.. దానిని వెనక్కి నెట్టి సీపీఎల్ పాపులర్‌గా నిలిచింది. క్రికెట్‌ను బాగా ఎంజాయ్ చేసే అక్కడి అభిమానులు.. సీపీఎల్‌ను బాగానే ఆదరిస్తున్నారు. సీపీఎల్‌లో 6 టీమ్స్ పాల్గొంటున్నాయి.
పాకిస్థాన్ సూపర్ లీగ్
ఇక మన దాయాది పాకిస్థాన్ కూడా ఐపీఎల్‌ను చూసి తమ దేశంలో పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)ను ప్రారంభించింది. 2016లో యూఏఈలో ప్రారంభమైన ఈ లీగ్.. ప్రతి ఏటా జరుగుతోంది. అయితే ఐపీఎల్ ఆదరణతో పోలిస్తే.. పీఎస్‌ఎల్ చాలా చాలా దూరంలోనే నిలిచిపోయింది.
ఈ లీగ్సే కాకుండా సౌతాఫ్రికాలో 6 టీమ్స్‌తో రామ్ స్లామ్ టీ20 లీగ్, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్, యూఏఈలో మాజీ అంతర్జాతీయ క్రికెటర్ల మధ్య జరిగే మాస్టర్స్ ఛాంపియన్స్ లీగ్, శ్రీలంక ప్రీమియర్ లీగ్, నేపాల్ ప్రీమియర్ లీగ్ కూడా జరుగుతున్నాయి.
సంబంధిత కథనం