Imran Khan on BCCI: భారత్ నియంతలా వ్యవహరిస్తోంది.. ఐపీఎల్‌లో పాక్ ప్లేయర్లను ఆడనివ్వకపోవడంపై ఇమ్రాన్ ఘాటు వ్యాఖ్యలు
Imran Khan on BCCI: భారత క్రికెట్ బోర్డు నియంతలా వ్యవహరిస్తోందని పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పాక్ ప్లేయర్లను ఐపీఎల్‌లో అనుమతించకపోతే చింతించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
Imran Khan on BCCI: గత కొన్ని వారాలుగా భారత్-పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల మధ్య వాతావరణం వాడీ వేడీగా ఉంది. ఆసియా కప్, వరల్డ్ కప్ నిర్వహణ విషయంలో ఈ రెండు బోర్డుల తర్జన భర్జనలు పడుతున్నాయి. ఆసియా కప్‌ను పాక్‌లో ఇంకా షెడ్యూల్ చేయనప్పటికీ.. వరల్డ్ కప్ మాత్రం అక్టోబరు-నవంబరు మాసాల్లో భారత్‌లో జరగనుంది. ఈ నెల ప్రారంభంలో తటస్థ వేదికలో ఆసియా కప్‌లో ఆడతామని భారత్ చెప్పినట్లు సమాచారం. అయితే ప్రపంచకప్ విషయంలో మాత్రం దాయాది జట్టు భారత్‌కు వస్తుందా లేదా అనే విషయంలో ఎలాంటి నిర్ధారణ లేదు. ఈ విషయంలో ఇరు దేశాల బోర్డల మధ్య ఉద్రిక్తత నెలకొంది. తాజాగా ఈ విషయంపై పాక్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భారత క్రికెట్ బోర్డు అహంకారం ప్రదర్శిస్తుందని, నియంతలా వ్యవహరిస్తుందని తన అక్కసు వెళ్లగక్కారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో పాకిస్థాన్ ప్లేయర్లను ఆడనివ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. "భారత్-పాకిస్థాన్ మధ్య ఇలాంటి సంబంధం ఉండటం నిజంగా దురదృష్టకరం. ఇండియా క్రికెట్ ప్రపంచాన్ని సూపర్ పవర్‌లా శాసిస్తుంది. ఇది చాలా అహంకారపూరితమైన ప్రవర్తన. ఇతర దేశాల కంటే ఎక్కువ నిధులు ఉత్పత్తి చేస్తున్న కారణంగా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. ఎవరు ఆడాలి, ఎవరు ఆడకూడదనే నిర్దేశిస్తూ అహంకారంగా ప్రవర్తిస్తోంది." అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
ఐపీఎల్ లాంటి టోర్నీలో పాకిస్థాన్ ఆటగాళ్లను ఆడించకోవడంపై కూడా ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ఇలా చేయడం వింతగా ఉందని, కేవలం అహంకారంతో కూడుకుని ఉందని స్పష్టం చేశారు. ఐపీఎల్‌లో పాల్గొన్నందుకు పాకిస్థాన్ క్రికెటర్లు చింతించాల్సిన పనిలేదని, అక్కడ ఆడనంత మాత్రం తమకు నాణ్యమైన యువ క్రికెటర్లు ఉన్నారని తెలిపారు. ఈ విషయంలో పాక్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతోంది. అదే సమయంలో పాకిస్థాన్ సూపర్ లీగ్ ఈ నెల ప్రారంభంలో ముగిసింది. షాహీన్ ఖాన్ జట్టు లాహోర్ ఖలాండర్స్ వరుసగా రెండో సారి టైటిల్‌ను గెలుచుకుంది.