Football | ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌లో ప్లేయర్స్‌ పొజిషన్లు ఏవి? ఏ స్థానాన్నిఏమంటారు?-do you know football positions numbers and their importance in the field ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Do You Know Football Positions Numbers And Their Importance In The Field

Football | ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌లో ప్లేయర్స్‌ పొజిషన్లు ఏవి? ఏ స్థానాన్నిఏమంటారు?

Hari Prasad S HT Telugu
Dec 21, 2021 02:09 PM IST

ఫుట్‌బాల్‌ టీమ్‌లో కూడా 11 మంది ప్లేయర్స్ ఉంటారు కదా. తమ గోల్‌ పోస్ట్‌ నుంచి ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌ వరకూ ఈ 11 మంది ప్లేయర్స్‌ ఒక్కో స్థానంలో ఉంటారు. వీళ్లలో ఒక్కో స్థానానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. మరి ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌లో ఉండే మొత్తం పొజిషన్లు ఎన్ని? ఏ పొజిషన్‌ను ఏమంటారు? దాని ప్రాధాన్యత ఏంటి?

ఫుట్‌బాల్‌లో రెండు కీలకమైన పొజిషన్లయిన గోల్‌కీపర్‌, స్ట్రైకర్‌
ఫుట్‌బాల్‌లో రెండు కీలకమైన పొజిషన్లయిన గోల్‌కీపర్‌, స్ట్రైకర్‌ (PTI)

Football Positions ఫుట్‌బాల్‌ను ఇప్పుడిప్పుడే ఫాలో అవుతున్న వారు అందులోని పొజిషన్లు ఏవో తెలుసుకుంటే.. గేమ్‌ తేలిగ్గా అర్థమవుతుంది. క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి ఆ గేమ్‌లో ఫీల్డింగ్‌ పొజిషన్లు ఏవో బాగా తెలుస్తుంది. గ్రౌండ్‌ మొత్తం ఫీల్డర్లు ఉంటారన్న విషయం తెలుసు కదా. ఈ ఫీల్డర్లను వాళ్ల పొజిషన్‌ను బట్టి ఒక్కో పేరుతో పిలుస్తారు. అలాగే ఫుట్‌బాల్‌లోని ఒక టీమ్‌లో కూడా 11 మంది ప్లేయర్స్ ఉంటారు కదా. తమ గోల్‌ పోస్ట్‌ నుంచి ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌ వరకూ ఈ 11 మంది ప్లేయర్స్‌ ఒక్కో స్థానంలో ఉంటారు. 

ట్రెండింగ్ వార్తలు

వీళ్లలో ఒక్కో స్థానానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుంది. ఫుట్‌బాల్‌ చూస్తున్న సమయంలో, దానికి సంబంధించిన వార్తలు చదువుతున్నప్పుడు గోల్‌కీపర్‌, స్ట్రైకర్‌, ఫార్వర్డ్‌ అనే పదాలను మీరు తరచూ వినే ఉంటారు. మరి ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌లో ఉండే మొత్తం పొజిషన్లు ఎన్ని? ఏ పొజిషన్‌ను ఏమంటారు? దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఏ పొజిషన్‌కు ఏ నంబర్‌ ఉంటుంది అన్న విషయాలు మీరూ తెలుసుకోండి.

ప్లేయర్స్‌-నంబర్స్‌

ఫుట్‌బాల్‌లో ప్లేయర్‌ పొజిషన్‌ను బట్టి నంబర్లు ఉంటాయి. ఒక్కో పొజిషన్‌కు ఓ ప్రత్యేక నంబర్‌ ఇవ్వడం 1920 నుంచి ప్రారంభమైంది. అయితే ఫుట్‌బాల్‌లో ప్రతి కోచ్‌ కచ్చితంగా ఆ పొజిషన్‌లో ఉన్న ప్లేయర్‌కు అదే నంబర్‌ ఇవ్వాలని లేదు కానీ.. ఈ నంబర్లను తెలుసుకుంటే సులువుగా వాళ్ల పొజిషన్‌ ఏంటో అర్థమవుతుంది.

1 - గోల్‌కీపర్‌

2 - రైట్‌ ఫుల్‌బ్యాక్‌

3 - లెఫ్ట్‌ ఫుల్‌బ్యాక్‌

4- సెంటర్‌ బ్యాక్‌

5- సెంటర్‌ బ్యాక్‌ (లేదా స్వీపర్‌)

6- డిఫెన్సివ్ మిడ్‌ఫీల్డర్‌

7- రైట్‌ మిడ్‌ఫీల్డర్‌/వింగర్

8- సెంట్రల్‌/బాక్స్‌-టు-బాక్స్‌ మిడ్‌ఫీల్డర్‌

9- స్ట్రైకర్‌

10- అటాకింగ్‌ మిడ్‌ఫీల్డర్‌

11- లెఫ్ట్‌ మిడ్‌ఫీల్డర్‌/వింగర్‌

ఈ 11 మంది ప్లేయర్స్ డిఫెన్సివ్‌, మిడ్‌ఫీల్డ్‌, అఫెన్సివ్‌ పొజిషన్లుగా విడిపోతారు. మరి వీళ్లలో ఏ పొజిషన్‌ ప్రాధాన్యత ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా డిఫెన్సివ్‌ పొజిషన్లు ఏంటో చూడండి.

గోల్‌కీపర్‌

ఫుట్‌బాల్‌లో ఇది చాలా కీలకమైన పొజిషన్‌. ప్రత్యర్థి గోల్స్‌ను అడ్డుకునే పని ఈ గోల్‌కీపర్‌దే. అతడు మ్యాచ్‌లో చాలా వరకూ తమ టీమ్‌ గోల్‌ పోస్ట్‌ దగ్గరే ఉంటాడు. డిఫెండర్లను సమన్వయం చేయడం కూడా గోల్‌కీపర్‌ పనే. ఈ గోల్‌కీపర్‌ టీమ్‌ మేట్స్‌ కంటే భిన్నమైన రంగు జెర్సీతో కనిపిస్తారు. చేతులకు గ్లోవ్స్‌ వేసుకుంటారు. ఫుట్‌బాల్‌ ఫీల్డ్‌లో బాల్‌ను చేతులతో అడ్డుకునే అవకాశం ఒక్క గోల్‌కీపర్‌కు మాత్రమే ఉంటుంది.

డిఫెండర్స్‌/బ్యాక్స్‌

ఈ పొజిషన్లు గోల్‌కీపర్‌కు దగ్గరగా ఉంటాయి. గోల్‌ చేయడానికి వస్తున్న ప్రత్యర్థిని గోల్‌పోస్ట్‌ వరకూ వెళ్లకుండా అడ్డుకోవడం ఈ డిఫెండర్ల పని. ఈ డిఫెండర్లలో సెంటర్‌ బ్యాక్స్‌, ఫుల్‌బ్యాక్స్‌, వింగ్‌బ్యాక్స్‌, స్వీపర్‌ పొజిషన్లు ఉంటాయి.

సెంటర్‌ బ్యాక్‌: ఈ పొజిషన్‌నే సెంట్రల్‌ డిఫెండర్‌, సెంటర్‌ ఫుల్‌బ్యాక్‌ లేదా స్టాపర్‌ అని కూడా అంటారు. వెనుక ఉన్న డిఫెన్సివ్‌ లైన్‌ మధ్యలో ఈ సెంటర్‌ బ్యాక్‌ ప్లేయర్‌ ఉంటాడు. అటాకింగ్‌ కంటే డిఫెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చే టీమ్స్‌ ఇద్దరు సెంటర్‌ బ్యాక్‌లను ఉంచుతారు.

ఫుల్‌బ్యాక్‌: సెంటర్‌ బ్యాక్‌కు కుడి, ఎడమ వైపు ఉండే డిఫెండర్లను ఫుల్‌బ్యాక్‌ అంటారు. వీళ్లు ఫీల్డ్‌కు ఇరువైపుల నుంచి వచ్చే ప్రత్యర్థి అఫెన్సివ్‌ ప్లేయర్స్‌ను అడ్డుకుంటారు. తమ టీమ్‌లోని అఫెన్సివ్‌ ప్లేయర్స్‌కు కూడా సాయం చేయడానికి వీళ్లు ఫీల్డ్‌లో అటూ, ఇటూ పరుగెత్తుతుంటారు.

స్వీపర్‌: డిఫెన్సివ్‌ బ్యాక్స్‌కు వెనుక, గోల్‌కీపర్‌.. ప్రధాన డిఫెన్స్‌ లైన్‌ మధ్యలో ఈ స్వీపర్‌ ఉంటాడు. ఈ కాలం ఫుట్‌బాల్‌లో పెద్దగా ఈ పొజిషన్‌ను ఎవరూ వాడటం లేదు. డిఫెండర్లను దాటి వచ్చిన బాల్‌ను మళ్లీ ఫీల్డ్‌లోకి పంపించడమే ఈ స్వీపర్‌ పని.

మిడ్‌ఫీల్డ్‌ పొజిషన్స్‌

పేరుకు తగినట్లే ఈ మిడ్‌ఫీల్డ్‌ పొజిషన్లలో ఉండే ప్లేయర్స్‌ ఫీల్డ్‌ మధ్యలో ఆడుతుంటారు. అంటే అటు టీమ్‌లోని డిఫెన్సివ్‌, అఫెన్సివ్‌ ప్లేయర్స్‌ మధ్య వీళ్లు ఉంటారు. నిజానికి ఫుట్‌బాల్‌లో ఎక్కువ భాగం బంతి వీళ్ల దగ్గరే ఉంటుంది. ఈ మిడ్‌ఫీల్డ్‌లో ఉన్న పొజిషన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

డిఫెన్సివ్‌ మిడ్‌ఫీల్డర్‌ : ఈ పొజిషన్‌నే హోల్డింగ్‌ మిడ్‌ఫీల్డర్‌ అని కూడా అంటారు. డిఫెండర్ల ముందు నిలబడేది ఈ డిఫెన్సివ్‌ మిడ్‌ఫీల్డరే. తమ జోన్‌లోకి బాల్‌ రాకుండా అడ్డుకోవడం ఈ డిఫెన్సివ్‌ మిడ్‌ఫీల్డర్‌ పని. ప్రత్యర్థి ప్లేయర్స్‌ పాస్‌లను అడ్డుకొని, బంతిని తిరిగి ప్రత్యర్థి జోన్‌లోకి పంపడంలో వీళ్లు కీలకపాత్ర పోషిస్తారు.

సెంట్రల్‌ మిడ్‌ఫీల్డర్‌: ఫుట్‌బాల్‌లో పని ఎక్కువగా ఉండేది ఈ సెంట్రల్‌ మిడ్‌ఫీల్డర్‌కే. ఈ ప్లేయర్‌ ఇటు డిఫెన్సివ్‌గా, అటు అఫెన్సివ్‌గా ఆడటానికి సిద్ధంగా ఉండాలి. ఈ పొజిషన్‌లో ఉండే ప్లేయర్‌కు బాల్‌ను అద్భుతంగా హ్యాండిల్‌ చేసే, పాస్‌ చేసే స్కిల్స్‌ ఉండాలి. టీమ్‌ వ్యూహాన్ని బట్టి ఇటు డిఫెండర్లతో, అటు అటాకర్లతో ఆడటానికి సిద్ధంగా ఉండాలి.

అటాకింగ్ మిడ్‌ఫీల్డర్‌ : పేరులో ఉన్నట్లే ఈ అటాకింగ్‌ మిడ్‌ఫీల్డర్‌ ఇటు మిడ్‌ఫీల్డ్‌, అటు అఫెన్సివ్‌ లైన్‌కు మధ్యలో ఉంటాడు. ప్రత్యర్థి డిఫెండర్లను తప్పించుకుంటూ గోల్స్‌ చేసే సామర్థ్యం ఈ అటాకింగ్‌ మిడ్‌ఫీల్డర్‌కు ఉండాలి. ఈ అటాకింగ్‌ మిడ్‌ఫీల్డర్‌.. ప్రత్యర్థి దగ్గర బాల్‌ ఉన్నప్పుడు చాలా దూకుడుగా ఆడుతూ.. వాళ్ల నుంచి బంతిని తీసుకోవాలి. అఫెండర్లకు గోల్స్‌ చేయడంలో ఈ అటాకింగ్‌ మిడ్‌ఫీల్డర్‌దే కీలకపాత్ర.

లెఫ్ట్‌/రైట్‌ మిడ్‌ఫీల్డర్‌: వీళ్లనే వింగర్లు లేదా ఔట్‌సైడ్‌ మిడ్‌ఫీల్డర్లు అంటారు. వీళ్లు ఫీల్డ్‌కు అటు, ఇటూ దూరంగా ఉంటూ.. తమ అఫెండర్లకు గోల్‌ చేసే వీలు కల్పించేలా ప్రత్యర్థి డిఫెండర్లను గోల్ పోస్ట్‌కు దూరంగా తీసుకెళ్లడమే వీళ్ల పని. ప్రత్యర్థి డిఫెండర్‌ను బోల్తా కొట్టించేలా 1 vs 1 స్కిల్‌ ఈ లెఫ్ట్ / రైట్‌ మిడ్‌ఫీల్డర్లకు ఉండాలి. బాల్‌ను తమ అఫెండర్ల వరకూ తీసుకెళ్లడంలో వీళ్లు ప్రధాన పాత్ర పోషిస్తారు.

అఫెన్సివ్‌ పొజిషన్స్‌

ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై దాడి చేసే ప్లేయర్స్‌ ఈ అఫెన్సివ్‌ పొజిషన్లలో ఉంటారు. ఫార్వర్డ్స్‌, స్ట్రైకర్స్‌ ఈ అఫెన్సివ్ పొజిషన్లలో భాగమే. సాధ్యమైనంత తరచుగా గోల్స్‌ చేయడమే ఈ పొజిషన్లలో ఉన్న వాళ్లు చేయాల్సిన పని. ఫీల్డ్‌లో చాలా వేగంగా ఉంటూ, బంతిని సమర్థంగా నియంత్రించే నైపుణ్యం వీళ్లు కలిగి ఉండాలి. ఇక గోల్‌ చేసినా గోల్‌గా పరిగణించని ఆఫ్‌సైడ్‌ నిబంధనను దృష్టిలో ఉంచుకొని వీళ్లు కదలాల్సి ఉంటుంది. ఈ అఫెన్సివ్‌ పొజిషన్లలో ఎవరెవరు ఉంటారో చూద్దాం.

సెంటర్‌ ఫార్వర్డ్‌: అఫెన్సివ్ లైన్‌కు మధ్యలో ఉండే పొజిషన్‌ ఇది. ఈ పొజిషన్‌లో ఉన్న ప్లేయర్‌ పని గోల్స్‌ చేయడమే. మెరుపు వేగంతో బంతిని అందుకొని, ప్రత్యర్థి డిఫెండర్లను బోల్తా కొట్టించి గోల్‌ పోస్ట్‌లోకి బంతిని నెట్టాల్సి ఉంటుంది. ఇక తలతో కచ్చితంగా గోల్‌ పోస్ట్‌లోకి బంతిని నెట్టగలిగే ప్రత్యేక నైపుణ్యం ఈ పొజిషన్‌లో ఉన్న ప్లేయర్‌కు అదనపు అర్హత.

స్ట్రైకర్‌: ప్రత్యర్థి గోల్‌ పోస్ట్‌కు అతి దగ్గరగా ఉండే ప్లేయర్‌ ఈ స్ట్రైకర్‌. సెంటర్‌ ఫార్వర్డ్‌ కంటే ముందు ఉంటాడు. స్ట్రైకర్‌ పని కూడా గోల్స్‌ చేయడమే. తమ టీమ్‌లోని ప్లేయర్స్‌ తరచూ స్ట్రైకర్‌కే గోల్‌ చేయడం కోసం బంతిని పాస్‌ చేస్తూ ఉంటారు. ప్రత్యర్థి డిఫెండర్లను తప్పించుకొని ఆ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించడం స్ట్రైకర్‌ చేయాల్సిన పని. మెరికల్లాంటి ప్లేయర్స్‌నే టీమ్స్ ఈ స్ట్రైకర్‌ పొజిషన్‌లో ఉంచుతాయి. వీళ్ల ఫుట్‌వర్క్‌ చాలా వేగంగా ఉండాలి. ప్రత్యర్థి డిఫెండర్ల దగ్గర బంతి ఉన్న సమయంలో వాళ్లపై ఒత్తిడి తీసుకొచ్చి, పొరపాటు చేసేలా చేయడం కూడా స్ట్రైకర్‌ చేయాల్సి ఉంటుంది.

సెకండ్‌ స్ట్రైకర్‌: కొన్ని టీమ్స్‌ ఒక్కోసారి రెండో స్ట్రైకర్‌ను కూడా ఉపయోగిస్తుంటాయి. ఈ పొజిషన్‌ను ఉంచినప్పుడు ఆ ప్లేయర్‌ సెంటర్‌ ఫార్వర్డ్‌ వెనుకాలే ఉంటాడు. అటాకర్లకు స్కోర్‌ చేసే అవకాశాలను సృష్టించడమే ఈ సెకండ్‌ స్ట్రైకర్‌ చేయాల్సిన పని. ప్రత్యర్థి టీమ్‌ నుంచి బంతిని రక్షిస్తూ.. తమ అటాకర్లు గోల్‌ చేసే పొజిషన్‌లోకి వచ్చే వరకూ కాచుకొని ఉండాలి.

WhatsApp channel

సంబంధిత కథనం