IPL Fantasy Sports: రూ.3 వేల కోట్ల సంపాదన.. ఐపీఎల్‌తో ఫ్యాంటసీ స్పోర్ట్స్ కంపెనీలకు పండగే
05 April 2023, 20:25 IST
- IPL Fantasy Sports: రూ.3 వేల కోట్ల సంపాదన.. ఐపీఎల్‌తో ఫ్యాంటసీ స్పోర్ట్స్ కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి. ఈ మెగా లీగ్ సమయంలో లక్షల మంది యూజర్లు ఫ్యాంటసీ క్రికెట్ ఆడుతుండటంతో వీళ్ల బిజినెస్ మూడు పువ్వులు, ఆరు కాయలుగా నడుస్తోంది.
ఫ్యాంటసీ స్పోర్ట్స్ సంస్థల ఆదాయం ఈ ఏడాది రూ.3 వేలు కోట్లు
IPL Fantasy Sports: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అటు బీసీసీఐపై, ఇటు ఫ్రాంఛైజీలపై, ప్లేయర్స్ పై కాసులు వర్షం కురిపిస్తోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మెగా లీగ్ ద్వారా కొన్ని సంస్థలు కూడా వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాయి. అవి ఫ్యాంటసీ స్పోర్ట్స్ కంపెనీలు. అంటే డ్రీమ్11, మై11సర్కిల్, ఎంపీఎల్‌లాంటివి.
ఈ సంస్థలు క్రికెట్ ఫ్యాన్స్ తో వర్చువల్ స్ట్రేటజీ క్రికెట్ ఆడించి డబ్బులు సంపాదిస్తున్నాయి. తాజాగా 2023 కేలండర్ ఏడాదిలో ఈ సంస్థలు ఏకంగా రూ.2900 నుంచి రూ.3100 కోట్ల వరకూ సంపాదించనున్నట్లు అంచనా. ముఖ్యంగా ఐపీఎల్ సమయంలో వీటి పంట పండుతుంది. సాధారణ సిరీస్ ల కంటే ఐపీఎల్ సమయంలో ఈ వర్చువల్ క్రికెట్ ఆడే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని రెడ్ సీర్ స్ట్రేటజీ కన్సల్టెంట్స్ సంస్థ వెల్లడించింది.
నిజానికి 2019లో ఈ ఆదాయం రూ.990 కోట్లు మాత్రమే. నాలుగేళ్లలో అది కాస్తా మూడింతలు కావడం విశేషం. ఈ ఫ్యాంటసీ క్రికెట్ ఆడేవాళ్లలో 50 శాతానికి పైగా యూజర్లు టైర్ 2 సిటీల నుంచి కాగా.. మరో 30 శాతం మంది మిగతా ప్రాంతాల నుంచి ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో ఈ ఫ్యాంటసీ క్రికెట్ ఆడేవాళ్ల సంఖ్య కూడా రోజురోజుకూ పెరిగిపోతోంది.
ఐపీఎల్ 2008లో ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పటి వరకూ 46 కోట్ల వ్యూయర్‌షిప్ ఐపీఎల్ సొంతం. ఈ క్రేజ్ కాస్తా ఫ్యాంటసీ లీగ్స్ కు కూడా పాకింది. ఐపీఎల్ మ్యాచ్ లకు సంబంధించిన ఆయా టీమ్స్ ను ముందుగానే వర్చువల్ గా ఎంపిక చేసే అవకాశం యూజర్లకు దక్కుతోంది. బెస్ట్ టీమ్ ఎంపిక చేసిన వాళ్లకు మెరుగైన పాయింట్లు వస్తాయి. దాంతో ప్రైజ్ మనీ కూడా ఉంటుంది.
ఒక్కో యూజర్ నుంచి ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ సంస్థలకు ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా రూ.440 ఆదాయం వస్తుందని రెడ్ సీర్ సంస్థకు చెందిన ఉజ్వల్ చౌదరీ చెబుతున్నారు. గతేడాది ఇది రూ.410గా ఉండగా.. 2019లో ఇది రూ.310గా ఉండేది.