తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gavaskar Slams Archer: ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి.. వచ్చి చేసిందేముంది: ఆర్చర్‌పై గవాస్కర్ సీరియస్

Gavaskar slams Archer: ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి.. వచ్చి చేసిందేముంది: ఆర్చర్‌పై గవాస్కర్ సీరియస్

Hari Prasad S HT Telugu

19 May 2023, 13:41 IST

google News
    • Gavaskar slams Archer: ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి.. అతడు వచ్చి చేసిందేముంది అంటూ ఆర్చర్‌పై గవాస్కర్ సీరియస్ అయ్యాడు. గత సీజన్ లో మొత్తానికే ఆడని ఆర్చర్.. ఈ ఏడాది మధ్యలోనే లీగ్ వదిలి వెళ్లిపోయాడు.
సునీల్ గవాస్కర్, జోఫ్రా ఆర్చర్
సునీల్ గవాస్కర్, జోఫ్రా ఆర్చర్ (BCCI/AP)

సునీల్ గవాస్కర్, జోఫ్రా ఆర్చర్

Gavaskar slams Archer: ముంబై ఇండియన్స్ పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ పై తీవ్రంగా మండిపడ్డాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. అతనికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతేడాది మెగా వేలంలోనే ఆర్చర్ ను తీసుకున్నా.. 2022 సీజన్ మొత్తానికీ గాయం వల్ల దూరమయ్యాడు. ఈ ఏడాది వచ్చినా కేవలం 5 మ్యాచ్ లే ఆడాడు.

మే 9వ తేదీన తిరిగి ఇంగ్లండ్ వెళ్లిపోయాడు. ఐపీఎల్ 2022 వేలంలో ఆర్చర్ ను రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్. మిడ్ డే పత్రికకు రాసిన కాలమ్ లో సన్నీ తన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించాడు. "జోఫ్రా ఆర్చర్.. ముంబై ఇండియన్స్ కు చేసింది ఏముంది? అతడు గాయంతో బాధపడుతున్నా.. ఈ సీజన్ కే అందుబాటులో ఉంటాడని తెలిసినా తీసుకున్నారు.

అతని కోసం భారీ ఖర్చు చేస్తే.. అతడు ఏం చేశాడు? ఆర్చర్ 100 శాతం ఫిట్ గా లేడు. ఆ విషయాన్ని ఫ్రాంఛైజీకి చెప్పాల్సింది. అతడు వచ్చిన తర్వాతే ఫ్రాంఛైజీకి ఈ విషయం తెలిసింది. లీగ్ జరుగుతుండగానే మధ్యలో చికిత్స కోసం విదేశాలకు వెళ్లాడు. ఎప్పుడూ ఫిట్ గా లేడు. అయినా వచ్చాడు. తనకు ఈసీబీ కంటే కూడా ఎక్కువ చెల్లిస్తున్న ఫ్రాంఛైజీకి ఆడకపోయినా కనీసం చివరి వరకూ ఉండాల్సింది. కానీ అతడు మాత్రం మధ్యలోనే వెళ్లిపోయాడు" అని గవాస్కర్ అన్నాడు.

ఇప్పుడు ఆర్చర్ కు ముంబై ఇండియన్స్ అసలు డబ్బులు ఇవ్వకూడదని సన్నీ స్పష్టం చేస్తున్నాడు. "ప్రపంచంలోని వివధ లీగ్స్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడేందుకు ఆర్చర్ పై కోట్లు కుమ్మరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి గుర్రంపై పందెం కాసేంత పిచ్చోళ్లు ముంబై ఇండియన్స్ కాదు. అతడు లేకపోయినా ముంబై బాగా ఆడుతూ ప్లేఆఫ్స్ రేసులో ఉంది. లక్కీగా ఆర్చర్ కు మొత్తం పేమెంట్ ఇస్తే మాత్రం అతడు అందులో సగం తన చారిటీకి ఇస్తాడు" అని గవాస్కర్ చెప్పాడు.

అయితే ఎంతటి ప్లేయర్ కు అయినా అందుబాటులో లేకపోతే రూపాయి కూడా ఇవ్వొద్దని స్పష్టం చేశాడు. "ఎంత పెద్ద ప్లేయర్ అయినా మొత్తం టోర్నమెంట్ కు అందుబాటులో లేకపోతే అతనికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. దేశానికి ఆడాలా, ఐపీఎల్లో ఆడాలా అన్నది ప్లేయర్ ఇష్టం. ఐపీఎల్ కాకుండా దేశాన్ని ఎంచుకుంటే మంచిదే. కానీ ఐపీఎల్ ఎంచుకుంటే మాత్రం తన బాధ్యతలను పూర్తి నెరవేర్చాల్సిందే" అని గవాస్కర్ అన్నాడు.

తదుపరి వ్యాసం