Dhoni Stumps Gill: దటీజ్ ధోనీ.. కళ్లు మూసి తెరిచేలోపే గిల్ స్టంపౌట్.. వీడియో
29 May 2023, 21:07 IST
- Dhoni Stumps Gill: దటీజ్ ధోనీ.. కళ్లు మూసి తెరిచేలోపే గిల్ ను స్టంపౌట్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. గుజరాత్ టైటన్స్ తో జరుగుతున్న ఫైనల్లో మిస్టర్ కూల్ ఈ మ్యాజిక్ చేశాడు.
గిల్ ను స్టంపౌట్ చేస్తున్న ధోనీ
Dhoni Stumps Gill: ఈ వీడియో చూసిన తర్వాత దటీజ్ ధోనీ అనకుండా ఉండలేరు. అతడు క్రికెట్ లో ఎందుకంత స్పెషలో చెప్పడానికి ఈ స్టంపౌటే నిదర్శనం. 41 ఏళ్ల వయసులోనూ వికెట్ కీపింగ్ లో అతని మెరుపు వేగం ఏమాత్రం తగ్గలేదు. గుజరాత్ టైటన్స్ తో సోమవారం (మే 29) జరుగుతున్న ఐపీఎల్ 2023 ఫైనల్లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ను ధోనీ కళ్లు మూసి తెరిచేలోపు స్టంపౌట్ గా వెనక్కి పంపాడు.
ఫైనల్లో అప్పటికే గిల్ ఇచ్చిన సులువైన క్యాచ్ ను దీపక్ చహర్ డ్రాప్ చేశాడు. దానిని సద్వినియోగం చేసుకుంటూ గిల్ తనదైన స్టైల్లో చెలరేగుతున్నాడు. ఈ సమయంలో జడేజా బౌలింగ్ లో ధోనీ అతన్ని స్టంపౌట్ చేశాడు. జడ్డూ వేసిన ఓ కళ్లు చెదిరే బాల్ కాస్త స్పిన్ అయి గిల్ బ్యాట్ కు అందకుండా ధోనీ చేతుల్లో పడింది. బంతి కోసం కాస్త ముందుకెళ్లిన గిల్.. తేరుకొని క్రీజులోకి వచ్చేలోపే ధోనీ స్టంపౌట్ చేశాడు.
రియల్ టైమ్ లో ఈ వీడియో చూస్తే ఒక సెకనులోపు టైమ్ లోనే ధోనీ ఇదంతా చేసేశాడు. అతడు ఔటైనట్లు అప్పటికే ధోనీకి తెలుసు. అయితే లెగ్ అంపైర్ మాత్రం దానిని థర్డ్ అంపైర్ కు అప్పీల్ చేశాడు. ధోనీ వికెట్లను గిరాటేసే సమయానికి గిల్ క్రీజు బయటే ఉన్నట్లు తేలింది. అతని స్పీడు చూసి గిల్ బిత్తరపోయాడు. ఆ సమయంలో కామెంట్రీ ఇస్తున్న కెవిన్ పీటర్సన్, సైమన్ డౌల్ కూడా ఆశ్చర్యపోయారు.
"ధోనీ.. అతడో అద్భుతం. ఏమంటావ్" అని పీటర్సన్ తన పక్కనే ఉన్న డౌల్ ను అడిగాడు. దానికి డౌల్ స్పందిస్తూ.. చెన్నై స్కిప్పర్ నుంచి అద్భుతమైన స్టంపౌట్ అని అన్నాడు. అదే సమయంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న గవాస్కర్ స్పందిస్తూ.. నానో సెకండ్ లోనే ధోనీ తన పని పూర్తి చేశాడు.. ఔట్‌స్టాండింగ్ అని అన్నాడు.
ఈ మ్యాచ్ లో గిల్ 20 బంతుల్లో 39 పరుగులు చేశాడు. దీంతో ఈ సీజన్ ను గిల్ 890 పరుగులతో ముగించాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్ లో అత్యధిక పరుగుల లిస్టులో గిల్ రెండోస్థానంలో నిలిచాడు. 2016లో కోహ్లి 973 రన్స్ చేశాడు. ఇక గతేడాది బట్లర్ 863 రన్స్ చేయగా.. ఆ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు.