David Warner in Pushpa Style: పుష్ప స్టైల్లో ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లోకి వార్నర్.. వీడియో వైరల్
24 March 2023, 15:08 IST
David Warner in Pushpa Style: పుష్ప స్టైల్లో ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు డేవిడ్ వార్నర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. పంత్ లేకపోవడంతో ఈసారి ఢిల్లీకి వార్నర్ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే.
పుష్ప స్టైల్లో ఎంట్రీ ఇస్తున్న డేవిడ్ వార్నర్
David Warner in Pushpa Style: ఐపీఎల్ 2023కు టైమ్ దగ్గర పడుతుండటంతో ఒక్కో విదేశీ ప్లేయర్ ఆయా టీమ్స్ తో చేరుతున్నారు. ఇప్పటికే అన్ని టీమ్స్ తమ హోమ్ గ్రౌండ్స్ లో ట్రైనింగ్ క్యాంప్స్ ఏర్పాటు చేశాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా క్యాంప్ ఏర్పాటు చేయగా.. ఆ టీమ్ స్టాండిన్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పుష్ప స్టైల్లో ఎంట్రీ ఇచ్చాడు.
శుక్రవారం (మార్చి 24) వార్నర్ ఢిల్లీ టీమ్ తో చేరాడు. కారు దిగినప్పటి నుంచీ హోటల్ రూమ్ వరకూ వార్నర్ ఎంట్రీకి బ్యాక్‌గ్రౌండ్ లో పుష్ప మ్యూజిక్ ఇవ్వడం విశేషం. వార్నర్ కూడా తగ్గేదే లే అంటూ హోటల్లో అడుగుపెట్టాడు. "ఢిల్లీ నేను వచ్చేశాను.. ట్రైనింగ్ మొదలుపెడదామా" అని వార్నర్ అన్నాడు. ఈ డైలాగ్ ను అతడు హిందీలో చెప్పడం విశేషం.
అల్లు అర్జున్ పుష్ప స్టైల్ ను వార్నర్ ఇప్పటికే చాలాసార్లు ఇమిటేట్ చేసిన విషయం తెలిసిందే. 2021 సీజన్ వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున ఆడిన వార్నర్.. చాలా మంది తెలుగు సినిమా హీరోలను ఇమిటేట్ చేశాడు. ముఖ్యంగా పుష్ప స్టైల్ ను అతడు చాలాసార్లు గ్రౌండ్ లోనూ, తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లోనూ అనుకరించాడు.
ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కు డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ 30న రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈ సీజన్ కు దూరమయ్యాడు. దీంతో జట్టులో సీనియర్ అయిన వార్నర్ కు కెప్టెన్సీ ఇచ్చి.. అక్షర్ పటేల్ ను వైస్ కెప్టెన్ ను చేశారు. 2016లో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఆ జట్టుకు టైటిల్ సాధించిపెట్టాడు వార్నర్.
గత సీజన్ లో ఢిల్లీ తరఫున ఆడిన అతడు 432 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని గతేడాది మెగా వేలంలో రూ.6.25 కోట్లకు దక్కించుకుంది. పంత్ లేకపోయినా సమయానికి ఐపీఎల్ టైటిల్ గెలిచిన వార్నర్ అందుబాటులో ఉండటం ఢిల్లీకి కలిసొచ్చింది. మరి అతని కెప్టెన్సీలో ఈ సీజన్ లో క్యాపిటల్స్ ఏం చేస్తారో చూడాలి.