Kapil Dev: ఇలా అయితే వరల్డ్‌కప్ తప్ప ఏవీ మిగలవు: కపిల్ దేవ్
16 August 2022, 19:49 IST
- Kapil Dev: క్రికెట్ ప్రపంచంలో పెరిగిపోతున్న లీగ్స్‌పై లెజెండరీ ప్లేయర్ కపిల్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. క్రికెట్ కూడా మెల్లగా ఫుట్‌బాల్‌లాగా మారిపోతోందని ఆందోళన వ్యక్తం చేశాడు.
కపిల్ దేవ్
న్యూఢిల్లీ: క్రికెట్‌లో అయితే తరచూ రెండు దేశాలు ఒకరి దగ్గరకి మరొకరు వెళ్లడం, ఆడటం చూస్తుంటాం. కానీ ఫుట్‌బాల్‌లో అలా కాదు. ఏడాది మొత్తం ఏదో ఒక లీగ్ జరుగుతూనే ఉంటుంది. ప్లేయర్స్ అంతా ఆ లీగ్స్‌తోనే గడుపుతారు. రెండు దేశాల మధ్య మ్యాచ్‌లు కేవలం నాలుగేళ్లకోసారి జరిగే వరల్డ్‌కప్‌లోనే చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్రికెట్ కూడా మెల్లగా అలాగే మారిపోతోందని అంటున్నాడు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్.
ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొస్తున్న టీ20 లీగ్స్ వల్ల వన్డే క్రికెట్ కేవలం వరల్డ్‌కప్‌కు మాత్రమే పరిమితమవుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. 1983లో ఇండియాను తొలిసారి విశ్వవిజేతగా నిలిపిన కపిల్ దేవ్.. వన్డే, టెస్ట్ క్రికెట్‌ను ఈ లీగ్‌ల నుంచి రక్షించాల్సిన బాధ్యత ఐసీసీపై ఉందని అంటున్నారు. "వన్డే క్రికెట్ మెల్లగా కనుమరుగవుతోంది. ఈ ఆటను ఎలా మేనేజ్ చేయాలన్నది ఐసీసీ చేతుల్లోనే ఉంది. యూరప్‌లో ఫుట్‌బాల్‌లాగే క్రికెట్ మారుతోంది. వాళ్లు ఒక దేశంతో మరొకరు ఆడరు. నాలుగేళ్లకోసారి జరిగే వరల్డ్‌కప్‌లోనే ఆడతారు. క్రికెట్‌లోనూ అదే జరుగుతుందా? ప్లేయర్స్ కేవలం వరల్డ్ కప్ ఆడి మిగతా సమయం మొత్తం క్లబ్ క్రికెట్ ఆడతారా" అని కపిల్ దేవ్ ప్రశ్నించాడు.
ఇప్పుడున్న లీగ్స్ చాలవన్నట్లు త్వరలోనే యూఏఈలో ఇంటర్నేషనల్ టీగ్ టీ20, సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ రాబోతున్నాయి. ముఖ్యంగా యూఏఈ లీగ్ అయితే ఐపీఎల్ తర్వాత ఆ స్థాయి ఆదరణ పొందనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కపిల్ ఈ కామెంట్స్ చేశాడు. తాను క్లబ్ క్రికెట్‌ను పూర్తిగా వ్యతిరేకించడం లేదని, అయితే దీనివల్ల జరగబోయే నష్టం గురించి మాట్లాడుతున్నట్లు చెప్పాడు.
"ఇక నుంచి క్రికెటర్లు కేవలం ఐపీఎల్ లేదా బిగ్‌బాష్ లేదా ఇతర లీగ్స్ మాత్రమే ఆడతారా? అలా అయితే వన్డే, టెస్ట్ క్రికెట్‌ను బతికించడానికి ఐసీసీ ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. కొంత వరకూ క్లబ్ క్రికెట్ సరైనదే. బిగ్‌బాష్ ఓకే. కానీ సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్ కూడా వస్తున్నాయి. అన్ని దేశాలు క్లబ్ క్రికెట్ ఆడుతుంటే.. ఇంటర్నేషనల్ క్రికెట్ కేవలం వరల్డ్‌కప్‌కే పరిమితమవుతుంది" అని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు.