Kapil Dev: కోహ్లిని రెస్ట్ పేరుతో పక్కనపెట్టినా సరే.. అతడు ఫామ్‌లోకి రావాల్సిందే: కపిల్
Kapil Dev: విరాట్ కోహ్లి ఫామ్‌పై మరోసారి ఆసక్తికర కామెంట్స్ చేశాడు లెజెండరీ ప్లేయర్ కపిల్ దేవ్. అశ్విన్‌ను టెస్టుల నుంచి తీసేసినప్పుడు కోహ్లిని టీ20ల నుంచి ఎందుకు తీసేయకూడదు అని అతడు ఈ మధ్య చేసిన కామెంట్స్ దుమారం రేపిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: టీమిండియాను తొలిసారి విశ్వవిజేతగా నిలిపిన గ్రేట్ కెప్టెన్ కపిల్ దేవ్. అతడు ఈ మధ్య విరాట్ కోహ్లి విషయంలో కాస్త కఠినంగానే ఉంటున్నాడు. కోహ్లి ఫ్యాన్స్‌కు మింగుడుపడని కామెంట్స్ చేస్తున్నాడు. ఫామ్‌లో లేని అతన్ని ఎందుకు తీసేయకూడదు అని ఈ మధ్య చేసిన కామెంట్స్‌తో చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా విభేదించారు. అయినా కపిల్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
తాజాగా మరోసారి కోహ్లి ఫామ్, టీమ్‌లో అతని స్థానంపై స్పందించాడు. "విరాట్ కోహ్లిలాంటి పెద్ద ప్లేయర్‌ను పక్కనపెట్టాలని నేను చెప్పను. అతడు చాలా పెద్ద ప్లేయర్. అతన్ని గౌరవించడానికి సెలక్టర్లు రెస్ట్ అని చెప్పడంలో తప్పేమీ లేదు" అని కపిల్ ఏబీపీ న్యూస్‌తో అన్నాడు. టీ20ల్లో కోహ్లి కంటే పెద్ద ప్లేయర్ లేకపోవచ్చు కానీ.. ఫామ్‌లో లేనప్పుడు సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు.
"అలాంటి ప్లేయర్‌ను తిరిగి ఫామ్‌లోకి ఎలా తీసుకురావాలన్నదే ముఖ్యమైన విషయం. అతడు సాధారణ క్రికెటర్ కాదు. తిరిగి ఫామ్‌లోకి రావడానికి కోహ్లి మరింత ప్రాక్టీస్ చేయాలి. మరిన్ని మ్యాచ్‌లు ఆడాలి. టీ20ల్లో విరాట్ కోహ్లిని మించిన ప్లేయర్ ప్రపంచంలో ఎవరూ లేకపోవచ్చు కానీ అతడు బాగా ఆడలేకపోతే సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకోవచ్చు. ఏ ప్లేయర్ అయినా సరిగా ఆడకపోతే అతన్ని పక్కన పెట్టొచ్చు లేదంటే రెస్ట్ ఇవ్వొచ్చు అన్నది నా అభిప్రాయం" అని కపిల్ స్పష్టం చేశాడు.
కోహ్లిలాంటి గ్రేట్ ప్లేయర్ తిరిగి ఫామ్‌లోకి రావడానికి మరీ ఇంతకాలం పట్టడం ఆందోళన కలిగించే విషయమని కూడా కపిల్ అన్నాడు. "విరాట్ లేకుండా గత ఐదారేళ్లుగా ఇండియా ఆడలేదు అని కాదు. కానీ అలాంటి ప్లేయర్ తిరిగి ఫామ్‌లోకి రావాలి. అతన్ని డ్రాప్ చేసినా, రెస్ట్ ఇచ్చిన విరాట్‌లో ఇంకా చాలా క్రికెట్ మిగిలే ఉంది. దానికి అతడు ఓ దారి కనుక్కోవాలి. రంజీ ట్రోఫీలోనూ, మరెక్కడైనా రన్స్ చేయాలి. అతని కాన్ఫిడెన్స్ తిరిగి రావాలి. గొప్ప ప్లేయర్, మంచి ప్లేయర్ మధ్య ఇదే తేడా. అతనిలాంటి గొప్ప ప్లేయర్ ఫామ్‌లోకి రావడానికి ఇంత సమయం తీసుకోకూడదు. అతడు తనతోతాను పోరాడి తిరిగి గాడిలో పడాలి. ఫామ్‌లోకి రావడానికి అతడు ఇంతకాలం తీసుకోవడం ఆందోళన కలిగించేదే" అని కపిల్ దేవ్ అన్నాడు.
అతన్ని తీసేసినా, రెస్ట్ ఇచ్చినా తనకు సమస్య లేదని, అయితే కోహ్లి తిరిగి ఫామ్‌లోకి రావడమే తనకు కావాలని స్పష్టం చేశాడు. ఓ గొప్ప ప్లేయర్ ఫామ్‌ను ఒక్క ఇన్నింగ్స్ మార్చేస్తుందని, అయితే అది వస్తుందా, రాదా తెలియదని అన్నాడు. ఆ ఇన్నింగ్స్ కోసమే రెండేళ్లుగా వేచి చూస్తున్నట్లు కపిల్ చెప్పాడు.
సంబంధిత కథనం