ICC Women's FTP: క్రికెట్ చరిత్రలో తొలిసారి మహిళల ఎఫ్‌టీపీ.. ఇండియా సిరీస్‌లు ఇవే
ICC Women's FTP: క్రికెట్ చరిత్రలో తొలిసారి మహిళల కోసం కూడా ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)ని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. ఇందులో ఇండియన్ టీమ్ షెడ్యూల్ కూడా ఉంది.
దుబాయ్: మహిళల క్రికెట్‌కు క్రమంగా ప్రాధాన్యత పెంచుతోంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఈ మధ్యే కామన్వెల్త్ గేమ్స్‌లో వుమెన్స్ టీ20 క్రికెట్‌ను పరిచయం చేసిన ఐసీసీ.. ఇప్పుడు తొలిసారి మహిళల కోసం ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్(ఎఫ్‌టీపీ)ను కూడా ప్రకటించింది. ఇందులో భాగంగా ఇండియన్ వుమెన్స్ టీమ్ ఆగస్ట్ 2022 నుంచి జనవరి 2025 వరకూ ఆడబోయే సిరీస్‌ల వివరాలు వెల్లడించింది.
ఇండియన్ వుమెన్స్ టీమ్ ఈ రెండున్నరేళ్ల కాలంలో మొత్తంగా 2 టెస్ట్‌లు, 24 వన్డేలు, 36 టీ20లు ఆడనుంది. ఇక 2023-24లలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో సొంతగడ్డపై టెస్ట్‌లు ఆడనుంది. ఈ ఎఫ్‌టీపీ పది టీమ్స్‌కు సంబంధించిన ద్వైపాక్షిక సిరీస్‌ల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ తొలి ఎఫ్‌టీపీలో భాగంగా అన్ని టీమ్స్ కలిపి మొత్తంగా 300 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
వుమెన్స్ క్రికెట్‌లో ఇది చెప్పుకోదగిన మార్పు అని ఐసీసీ జనరల్ మేనేజర్ ఆఫ్ క్రికెట్ వసీం ఖాన్ అన్నారు. ఈ ఎఫ్‌టీపీ భవిష్యత్తు క్రికెట్ టూర్లపై మహిళా క్రికెటర్లకు ఓ భరోసా ఇస్తుందని ఆయన చెప్పారు. భవిష్యత్తులో ఇది మరింత మెరుగవుతుందని కూడా తెలిపారు. ఐసీసీ వుమెన్స్ ఛాంపియన్‌షిప్‌ను ఈ ఎఫ్‌టీపీ ద్వారా ప్రవేశపెడుతున్నారు. ఈ ఎఫ్‌టీపీని రూపొందించడానికి అన్ని సభ్య దేశాలు సహకరించినట్లు ఐసీసీ తెలిపింది.