FIFA World Cup 2022: ఒక రోజు ముందుగానే ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ ప్రారంభం.. ఇదీ కారణం
FIFA World Cup 2022: ఈ ఏడాది జరగబోతున్న గ్లోబల్ మెగా టోర్నీ ఫిఫా వరల్డ్‌కప్ ఒక రోజు ముందుగానే ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని గురువారం (ఆగస్ట్ 11) ఫిఫా అధికారికంగా ప్రకటించింది.
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక మంది చూసే ఆట ఫుట్‌బాల్. ఇందులో నాలుగేళ్లకోసారి జరిగే వరల్డ్‌కప్‌కు 2022లో ఖతార్ ఆతిథ్యమిస్తోంది. అయితే ఈ వరల్డ్‌కప్ ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది నవంబర్ 21న ప్రారంభం కావాల్సి ఉంది. కానీ తాజాగా ఫిఫా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒక రోజు ముందుగానే అంటే నవంబర్ 20నే టోర్నీ ప్రారంభం కానుంది.
తొలి రోజు ఆతిథ్య ఖతార్, ఈక్వెడార్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీని కారణంగా ఎంతో ముఖ్యమైన, ఆదరణ లభించే ఆదివారం సాయంత్రం స్లాట్ ఈ మ్యాచ్‌కు దక్కనుంది. ఇలా ఒక రోజు ముందు ప్రారంభించాలన్న నిర్ణయం కారణంగా వరల్డ్‌కప్ 28 రోజులకు బదులుగా 29 రోజులు జరగనుంది. నిజానికి ఈ టోర్నీ జూన్-జులైలోనే జరగాల్సి ఉన్నా.. ఖతార్‌లో ఎండాకాలం కారణంగా దీనిని నవంబర్-డిసెంబర్‌లకు వాయిదా వేశారు.
గురువారం ఫిఫా కమిటీలోని సభ్యులైన అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో, ఇతర ఆరు ఖండాల సాకర్ సంఘాల అధ్యక్షులు సమావేశమై ఒక రోజు ముందే టోర్నీ ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఫిఫా వెల్లడించింది. ఈ నిర్ణయం కారణంగా ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరిస్తామని చెప్పింది.
ఫిఫా తీసుకున్న ఈ నిర్ణయంపై హోస్ట్ టీమ్ ఖతార్ ఆనందం వ్యక్తం చేసింది. ఖతార్ వరల్డ్‌కప్‌లో ఆడటం ఇదే తొలిసారి. అది కూడా ఆతిథ్య జట్టు హోదాలో. నవంబర్ 20న స్థానిక ఖతార్ కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఆ టీమ్ ఈక్వెడార్‌తో మ్యాచ్ ఆడుతుంది. 60 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న అల్ బేయత్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.