India vs Hong Kong Preview: సూపర్-4పై కన్నేసిన టీమిండియా.. మరి పసికూన పనిపడుతుందా?
31 August 2022, 7:49 IST
- India vs Hong Kong Asia Cup 2022: పాకిస్థాన్‌పై విజయం సాధించిన టీమిండియా మరో మ్యాచ్‌కు సన్నద్ధమైంది. హాంకాంగ్‌తో బుధవారం నాడు మ్యాచ్ ఆడనుంది. ఇందులో నెగ్గి సూపర్ 4 దశకు దూసుకెళ్లాలని ఆశిస్తోంది.
భారత్-హాంకాంగ్ ప్రివ్యూ
India vs Hong Kong Asia Cup 2022: పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆసియా కప్‌ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. గతేడాది టీ20 వరల్డ్ కప్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్.. చిరకాల ప్రత్యర్థిపై అద్బుత ప్రదర్శన చేసింది. దీంతో తర్వాత మ్యాచ్‌పై ఫోకస్ పెట్టింది టీమిండియా. బుధవారం నాడు పసికూన హాంకాంగ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సూపర్-4లోకి దూసుకెళ్లాలని రోహిత్ సేన భావిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సాయంత్రం 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఆగస్టు 28న పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఆ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ నేతృత్వంలోని పేస్ దళం అదిరిపోయే ప్రదర్శన చేసింది. భువి నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. మరోపక్క హార్దిక్ పాండ్య అటు బౌలింగ్‌తో ఇటు బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు. దీంతో మరోసారి వీరిద్దరూ చక్కటి ప్రదర్శన చేయాలని జట్టు భావిస్తోంది. ఆ మ్యాచ్‌లో లక్ష్యం 148 చిన్నదే అయినప్పటికీ.. ఛేదించడానికి చివరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. ముఖ్యంగా టాపార్డర్ విఫలమైంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో టాపార్డర్ ఆటగాళ్లు పుంజుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
ఓపెనర్లు పుంజుకుంటారా?
కోహ్లీ 35 పరుగులతో ప్రశాంతంగా ఆడినప్పటికీ.. మునుపటి ఆటతీరు కనబర్చలేకపోయాడు. మరోపక్క ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. కాబట్టి ఈ రోజు జరగనున్న మ్యాచ్‌లోనైనా వీరు బ్యాట్ ఝుళిపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. భారత కెప్టెన్ 18 బంతుల్లో 12 పరుగులే చేయగా.. కేఎల్ రాహుల్ మాత్రం డకౌట్‌గా వెనుదిరిగాడు. వీరిద్దరూ తమ ఫామ్‌ను పొంది సూపర్-4 దశకు చేరుకోవాలంటే హాంకాంగ్‌తో జరగనున్న ఈ మ్యాచ్ చాలా కీలకం. ఇది వారికి దొరికిన చక్కటి అవకాశంగా చూడాలి.
ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ చూస్తే.. రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నారు. ఈ ఆల్‌రౌండర్ ద్వయం గత మ్యాచ్‌లో పాక్‌పై ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడి ఆకట్టుకున్నారు. బంతితోనూ హార్దిక్, జడేజా తమ సామర్థ్యాన్ని నిరూపించారు.
పసికూనే కదా అని తక్కువ అంచనా వేయడానికి లేదు..
మరోపక్క హాంకాంగ్ జట్టు.. భారత్‌కు పోటీనిచ్చే అవకాశం ఉంది. ఆ జట్టు చూపులకు కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ తక్కువ అంచనా వేయడానికి మాత్రం లేదు. బుధవారం నాడు గట్టి పరీక్షే ఎదురుకానుంది. చివరి సారిగా భారత్.. ఈ జట్టుతో 2018లో ఆసియా కప్‌లోనే తలపడింది. ఆ మ్యాచ్‌లో ధోనీ విఫలం కావడంతో టీమిండియా ఆరంభంలో అదిరపోయే ఆరంభం ఇచ్చినప్పటికీ.. చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 287 పరుగులకే పరిమితమైంది. అనంతరం లక్ష్య ఛేదనలో హాంకాంగ్ 8 వికెట్లు నష్టపోయి 259 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు నిజకత్ ఖాన్(92), అన్షుమాన్ రత్(73) 174 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయంపై ఆశలు రేపారు. అయితే అనంతరం భారత బౌలర్లు మెరుగైన ప్రదర్శన చేయడంతో 8 వికెట్ల నష్టానికి 259 పరుగులకే పరిమితమయ్యారు.
ఈ మ్యాచ్‌పై హాంకాంగ్ కెప్టెన్ నిజకత్ ఖాన్ కూడా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఏదైనా జరగొచ్చని స్పష్టం చేశాడు. "అసోసియేట్ జట్లపై అగ్రజట్లు ఎలా ఓడిపోయాయో గతంలో మనం కొన్ని చూశాం. మేము సానుకూల మైండ్‌సెట్‌తో మైదానంలోకి అడుగుపెట్టబోతున్నాం. మా విధానానికి మేము కట్టుబడి ఉంటాం." అని అన్నాడు.
అయితే ఈ రోజు జరగనున్న మ్యాచ్ ఫేవరెట్ మాత్రం టీమిండియానే. సూపర్ ఫోర్ దశలో తమ స్థానాన్ని ఖాయం చేసుకోవాలని చూస్తున్నందున హాంకాంగ్ జట్టును టీమిండియా అంత తేలికగా తీసుకోవాలని అనుకోవడం లేదు.