Jasprit Bumrah: భువనేశ్వర్ రికార్డును బ్రేక్ చేసిన బుమ్రా...
ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదవ టెస్ట్ లో బుమ్రా పలు రికార్డులను బద్దలుకొట్టాడు. టెస్ట్ క్రికెట్ లో ఒకే ఓవర్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ గా నిలిచిన బుమ్రా తాజాగా మరో రికార్డును అధిగమించాడు. ఆ రికార్డ్ ఏదంటే...
ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్ట్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో కెప్టెన్ బుమ్రా అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్ లో పదో స్థానంలో బ్యాటింగ్ దిగిన బుమ్రా 16 బాల్స్ లోనే 31 పరుగులు చేశాడు. బ్రాడ్ వేసిన ఓవర్ లో 29 రన్స్ చేసి టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్ లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు. క్రికెట్ దిగ్గజం బ్రియన్ లారా రికార్డును అధిగమించాడు.
బ్యాటింగ్ లోనే కాకుండా బౌలింగ్ లో రాణించిన బుమ్రా మూడు కీలకమైన వికెట్లు తీశాడు. అతడి ప్రదర్శనపై క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ గత ఏడాది ప్రారంభమైంది. 2021లో నాలుగు టెస్ట్ లు పూర్తవ్వగా...కరోనా కారణంగా వాయిదా పడిన ఐదో టెస్ట్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు బుమ్రా 21 వికెట్లు తీశాడు. ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా బుమ్రా రికార్డును సృష్టించాడు.
2014 సిరీస్ లో భువనేశ్వర్ కుమార్ 19 వికెట్లు తీశాడు. అతడి రికార్డును బర్మింగ్ హమ్ టెస్ట్ ద్వారా బుమ్రా అధిగమించాడు. ఈ జాబితాలో జహీర్ ఖాన్ (18 వికెట్లు), ఇషాంత్ శర్మ (18 వికెట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. బర్మింగ్ హమ్ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 416 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 284 రన్స్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల నష్టానికి 125 రన్స్ తో మూడో రోజును టీమ్ ఇండియా ముగించింది. ఇప్పటివరకు టీమ్ ఇండియా 257 పరుగులు ఆధిక్యంలో ఉంది.
సంబంధిత కథనం