Ian Chappell on Shreyas Iyer: శ్రేయస్ భయపడతాడు.. స్పిన్ ఆడలేడు: ఇయాన్ ఛాపెల్
02 March 2023, 10:30 IST
- Ian Chappell on Shreyas Iyer: శ్రేయస్ భయపడతాడు.. స్పిన్ ఆడలేడు అని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో అతడు డకౌట్ అయిన విషయం తెలిసిందే.
తొలి ఇన్నింగ్స్ లో డకౌటైన శ్రేయస్ అయ్యర్
Ian Chappell on Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్.. గతేడాది ఇండియా తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి టాప్ స్కోరర్. మంచి ఫామ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుకు గాయం కారణంగా దూరమైనా.. తర్వాత రెండు, మూడు టెస్టుల్లో ఆడాడు. అయితే మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో అతడు డకౌటయ్యాడు.
దీంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ అతనిపై విమర్శలు గుప్పిస్తున్నాడు. అతడు స్పిన్ బాగా ఆడతాడని తాను విన్నానని, కానీ ఈ విషయం తాను అంగీకరించలేకపోతున్నానని అన్నాడు. అదే సమయంలో పుజారానూ తీవ్రంగా విమర్శించాడు.
"పుజారా చాలా అసౌకర్యంగా కనిపించాడు. ఈ సిరీస్ మొత్తం అతడు అలాగే ఉన్నాడు. శ్రేయస్ స్పిన్ బౌలింగ్ బాగా ఆడతాడని నేను వింటూ వచ్చాను. కానీ ఈ విషయాన్ని నేను అంగీకరించడం లేదు. నా వరకూ అతడు కాస్త భయపడే వ్యక్తి" అని ఛాపెల్ అనడం గమనార్హం. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత ఈఎస్పీఎన్ క్రికిన్ఫోతో అతడు మాట్లాడాడు.
మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో స్పిన్ కు అనుకూలించిన ఇండోర్ పిచ్ పై ఇండియన్ బ్యాటర్లు బోల్తా పడ్డారు కేవలం 109 పరుగులకే కుప్పకూలారు. ఇందులో శ్రేయస్ డకౌట్ కాగా.. పుజారా కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. ఆస్ట్రేలియా స్పిన్నర్ కునెమన్ 5 వికెట్లతో రాణించాడు. శ్రేయసే కాదు.. ఇండియన్ టీమ్ లో కొంత మంది ప్లేయర్స్ స్పిన్ ఆడలేరని తనకు అనిపించినట్లు ఛాపెల్ చెప్పాడు.
"ఇండియన్ టీమ లో కొంతమంది ప్లేయర్స్ స్పిన్ బౌలింగ్ లో మంచి ప్లేయర్స్ అని నాకు అనిపించలేదు. ఇండియాను ఆస్ట్రేలియన్లు ముందుగానే దెబ్బ కొట్టారు. పిచ్ కూడా కాస్త సహకరించింది. ఆస్ట్రేలియా స్పిన్నర్లు కచ్చితమైన లైన్ తో బౌలింగ్ చేశారు. కానీ ఇండియన్స్ మాత్రం ఆస్ట్రేలియన్లలా బ్యాటింగ్ చేశారు" అని ఛాపెల్ అనడం విశేషం.
"ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ఖవాజా చాలా బాగా ఆడాడు. లబుషేన్ అతనితో మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. తొలి టెస్టులో రోహిత్ శర్మ ఎలా ఆడాడో ఖవాజా అలా ఆడాడు. ఇండియాపై ఆస్ట్రేలియా పూర్తిగా డామినేట చేసింది. వాళ్లు మంచి ఆధిక్యానికి పూర్తి అర్హులు" అని ఛాపెల్ స్పష్టం చేశాడు.