Mark Taylor on India Pitches: ఇండియా వాళ్ల ఆటకు తగినట్లుగా పిచ్‌లను తయారు చేస్తోంది: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్
Mark Taylor on India Pitches: ఇండియా వాళ్ల ఆటకు తగినట్లుగా పిచ్‌లను తయారు చేస్తోంది అని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్. ఇండియాలోని పిచ్ లు ప్రత్యేకమైనవని అతడు చెప్పాడు.
Mark Taylor on India Pitches: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభం కాక ముందు నుంచే పిచ్ లపై చర్చ మొదలైంది. ఇండియా కచ్చితంగా స్పిన్ పిచ్ లతో ఆస్ట్రేలియాను కొడుతుందని మాజీలు అంచనా వేశారు. అందుకు తగినట్లే తొలి రెండు టెస్టులు జరిగిన నాగ్‌పూర్, ఢిల్లీలలో స్పిన్ పిచ్ లు మూడు రోజుల్లోపే ఆస్ట్రేలియా పని పట్టాయి.
దీంతో పిచ్ లపై చర్చ మరింత ఎక్కువైంది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ టేలర్ కూడా ఇండియన్ పిచ్ లపై స్పందించాడు. ఇక్కడి పిచ్ లు ప్రత్యేకమైనవని, ఇండియన్ టీమ్ తమ ఆటతీరుకు తగినట్లు స్లో, టర్నింగ్ పిచ్ లను తయారు చేస్తోందని టేలర్ అనడం గమనార్హం.
"ఆస్ట్రేలియాలో కండిషన్స్ భిన్నంగా ఉంటాయి. ఈ మధ్య ఐపీఎల్ కోసమంటూ ఆస్ట్రేలియా టీమ్ తరచూ ఇండియాకు వెళ్తోంది. కానీ అక్కడి పిచ్ లు ప్రత్యేకమైనవి. అందులో సందేహం లేదు. వాళ్లు స్లో టర్నింగ్ పిచ్ లను తయారు చేస్తున్నారు. అవి వాళ్ల ఆటతీరుకు సరిపడే పిచ్ లు. అలాంటి పిచ్ లపై ఆడే అలవాటు మనకు లేదు" అని టేలర్ అన్నాడు.
ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియా దూకుడైన ఆట వైపు మొగ్గు చూపిందని, అయితే దానిని సరిగా అమలు చేయలేకపోయిందని టేలర్ అభిప్రాయపడ్డాడు. "అక్కడికి సానుకూలంగా, దూకుడుగా వెళ్లారు. ఇది సరైనదే. కానీ దానికోసం మీకు ఓ టెక్నిక్ అవసరం. రెండో టెస్టులో దాని అమలు మరీ దారుణంగా ఉంది" అని టేలర్ స్పష్టం చేశాడు.
ఇండియాలో ఆస్ట్రేలియా గతంలోనూ దారుణంగా ఓడిన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా టేలర్ గుర్తు చేశాడు. "ఇండియాలో నేను ఎక్కువ టెస్టు మ్యాచ్ లు ఆడలేదు. 1998లో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో మేము ఓడిపోయాం. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన రెండో టెస్టులో అయితే మరీ చెత్తగా ఓడిపోయాం. ఆస్ట్రేలియాకు ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ జరిగింది. ఈడెన్ గార్డెన్స్ లో ఇన్నింగ్స్ 220 పరుగుల తేడాతో ఓడిపోయాం. ఈసారి కూడా అలాగే జరిగింది. ఇండియాలో హఠాత్తుగా మ్యాచ్ లు మలుపు తిరుగుతాయి" అని టేలర్ అన్నాడు.
సంబంధిత కథనం