Hardik Pandya meets Dhoni: షోలే 2 త్వరలోనే వస్తోంది.. రాంచీలో హార్దిక్, ధోనీ ఫొటో వైరల్
26 January 2023, 10:58 IST
- Hardik Pandya meets Dhoni: షోలే 2 త్వరలోనే వస్తోంది అంటూ రాంచీలో ధోనీతో కలిసి దిగిన ఫొటోను హార్దిక్ పాండ్యా షేర్ చేశాడు. న్యూజిలాండ్ తో తొలి టీ20కి ముందు మిస్టర్ కూల్ ను కలిశాడు టీమిండియా స్టాండిన్ కెప్టెన్.
ఎమ్మెస్ ధోనీ, హార్దిక్ పాండ్యా
Hardik Pandya meets Dhoni: న్యూజిలాండ్ పై వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇక టీ20 సిరీస్ కు సిద్ధమవుతోంది. తొలి టీ20 శుక్రవారం (జనవరి 27) రాంచీలో జరగనుంది. ఈ టీ20 టీమ్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. అయితే రాంచీలో ఈ తొలి మ్యాచ్ ఆడటానికి ముందు హార్దిక్ తన ఫేవరెట్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీని కలిశాడు.
రాంచీ ధోనీ సొంతూరు అన్న విషయం తెలుసు కదా. దీంతో ప్రత్యేకంగా అతన్ని కలవడానికి ధోనీ ఇంటికి వెళ్లాడు పాండ్యా. ఈ సందర్భంగా ట్విటర్ లో అతడు షేర్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. షోలేలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్రలాగా ఓ బైక్ పై హార్దిక్, ధోనీ కూర్చున్న ఫొటో అది. ఈ ఫొటోకు షోలే 2 త్వరలోనే వస్తోంది అనే క్యాప్షన్ ఉంచాడు హర్దిక్.
ధోనీకి ఖరీదైన బైకులు అంటే ఎంతో ఇష్టం. అతని ఇంట్లో ఎన్నో బైకులు, కార్లు కొలువుదీరాయి. వాటిలో ఈ బైక్ కూడా ఒకటిగా కనిపిస్తోంది. సైడ్ కారుతో ఉన్న ఈ బైక్ కూడా చాలా ఖరీదైనదే. మోడర్న్ బైక్ లతోపాటు వింటేజ్ బైక్ లను సేకరించడం కూడా ధోనీకి అలవాటు.
ఇక హార్దిక్ విషయానికి వస్తే 2016లో ధోనీ కెప్టెన్ గా ఉన్న సమయంలోనే అతడు టీమిండియాలోకి వచ్చాడు. ఏడాది పాటు అతని కెప్టెన్సీలోనే రాటుదేలాడు. ఆ తర్వాత 2017లో కెప్టెన్సీ విరాట్ కోహ్లి చేతికి వెళ్లింది. ఇప్పుడు ఇండియాకు భవిష్యత్తు టీ20 కెప్టెన్ గా అందరూ భావిస్తున్న సమయంలో ఈ ఫార్మాట్ లో అప్పుడప్పుడూ వస్తున్న కెప్టెన్సీ అవకాశాలను పాండ్యా సద్వినియోగం చేసుకుంటున్నాడు.
గతేడాది కూడా ఓ బర్త్ డే పార్టీలో ధోనీతో కలిసి హార్దిక్ స్టెప్పులేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. ధోనీ ఇచ్చిన చిన్న సలహా వల్లే తన కెరీర్ మారిపోయిందని గతంలో హార్దిక్ ఒకసారి చెప్పాడు. "నేను టీమ్ లోకి వచ్చిన కొత్తలో మహీ భాయ్ నాకు ఓ విషయం నేర్పించాడు. నువ్వు ఒత్తిడి నుంచి ఎలా బయటపడతావు అని నేను అతన్ని అడిగాను.
అప్పుడు అతడు చెప్పింది ఒక్కటే.. నీ స్కోరు గురించి ఆలోచిండం మానేసి.. టీమ్ కు ఏది అవసరమో ఆలోచించు అని చెప్పాడు. ధోనీ చెప్పిన ఆ మాట నా మెదడులో అలా నిలిచిపోయింది. ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆడగలిగే స్థాయికి నేను చేరుకున్నాను" అని పాండ్యా చెప్పాడు.