Hafeez on Rohit Sharma: రోహిత్ ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉండలేడు: పాక్ మాజీ కెప్టెన్
02 September 2022, 9:44 IST
- Hafeez on Rohit Sharma: రోహిత్ ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగలేడని అంటున్నాడు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్. టీమిండియాకు వరుస విజయాలు అందిస్తున్న రోహిత్‌పై అతను ఎందుకిలాంటి కామెంట్స్ చేశాడు?
విరాట్ కోహ్లితో రోహిత్ శర్మ
Hafeez on Rohit Sharma: రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా దూసుకెళ్తోంది. టీ20ల్లో ఇప్పుడు ఇండియా సెకండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ అతడు. 37 మ్యాచ్‌లలో 31 విజయాలతో కోహ్లిని వెనక్కి నెట్టాడు. ధోనీ (41) ఒక్కడే అతడి కంటే ముందున్నాడు. ఇక ఆసియా కప్‌లోనూ ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఇండియా గెలిచింది. కానీ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ మాత్రం రోహిత్‌పై విచిత్రమైన కామెంట్స్ చేశాడు.
అతని బాడీ లాంగ్వేజ్ చాలా బలహీనంగా ఉన్నదని, అతడు ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగడం కష్టమని హఫీజ్ అనడం విశేషం. ఇండియా, హాంకాంగ్ మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ టీవీ పానెల్‌లో ఒకడిగా ఉన్న హఫీజ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. "టాస్ సందర్భంగా రోహిత్ బాడీ లాంగ్వేజ్ పరిశీలించాను. చాలా బలహీనంగా అనిపించింది. ఏదో అయోమయంలో ఉన్నట్లు కనిపించాడు. నేను నేరుగా ఎన్నో మ్యాచ్‌లలో రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటం చూశాను. ఆ రోహిత్ ఇప్పుడు కనిపించలేదు" అని హఫీజ్ అన్నాడు.
"రోహిత్‌పై కెప్టెన్సీ ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తోంది. అతడు చాలా సమస్యలను డీల్ చేయాల్సి ఉంటుంది. అతని ఫామ్ కూడా సరిగా లేదు. ఐపీఎల్‌లో విఫలమయ్యాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు తిరిగి వచ్చిన తర్వాత ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో మాత్రం మునుపటి రోహిత్ కనిపించడం లేదు" అని హఫీజ్ స్పష్టం చేశాడు.
"రోహిత్ చాలా చెబుతాడు. బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అని, సానుకూలంగా ఆడతామని. కానీ అది టీమ్‌లో కనిపించడం లేదు. అతని బాడీ లాంగ్వేజ్‌లోనే అది లేదు" అని కూడా హఫీజ్ అన్నాడు. అతడు కెప్టెన్‌గా ఎక్కువ కాలం కొనసాగడం కష్టమని, దీనిపై రోహిత్ తానే సొంతంగా నిర్ణయం తీసుకోవడమో లేక ఇండియన్ మేనేజ్‌మెంట్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూడా హఫీజ్ అనడం గమనార్హం.
"రోహిత్ ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉంటాడని అనుకోవడం లేదు. అతడు తన ఫామ్ కోసం తంటాలు పడుతున్నాడు. నేనూ కెప్టెన్‌గా ఉన్నాను కాబట్టి ఆ విషయం నాకు తెలుసు. రోహిత్ ఎప్పుడూ ఎంత ఎంజాయ్ చేస్తాడో, తనను తాను ఎలా వ్యక్తపరుస్తాడో నాకు తెలుసు. కానీ ఇప్పుడలా లేడు. ఏదో కోల్పోయినట్లు ఉంటున్నాడు. చాలా ఒత్తిడిలో ఉన్నాడు. అతన్ని చూస్తే జాలేస్తోంది" అని హఫీజ్ అన్నాడు.
ఇండియాకు మరింత కాలం ఆడాలంటే అతడో లేక టీమ్ మేనేజ్‌మెంటో నిర్ణయం తీసుకోవాలని, అతడు కెప్టెన్ అయినప్పటి నుంచీ పూర్తిగా డౌన్ అయినట్లు కనిపిస్తున్నాడని కూడా అభిప్రాయపడ్డాడు.