India vs Hong Kong: హాంకాంగ్‌ చిత్తు.. ఆసియా కప్‌ సూపర్‌ ఫోర్‌లోకి టీమిండియా-india beat hong kong to reach the super four of asia cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  India Beat Hong Kong To Reach The Super Four Of Asia Cup 2022

India vs Hong Kong: హాంకాంగ్‌ చిత్తు.. ఆసియా కప్‌ సూపర్‌ ఫోర్‌లోకి టీమిండియా

Hari Prasad S HT Telugu
Aug 31, 2022 10:57 PM IST

India vs Hong Kong: హాంకాంగ్ చిత్తయింది. ఆసియా కప్‌ 2022లో టీమిండియా సూపర్‌ ఫోర్‌ స్టేజ్‌కు చేరింది. అయితే పసికూనే అయినా హాంకాంగ్‌ మాత్రం ఇండియాలాంటి స్ట్రాంగ్‌ టీమ్‌పై బాగానే పోరాడింది.

ఆసియా కప్ సూపర్ ఫోర్ కు చేరుకున్న టీమిండియా
ఆసియా కప్ సూపర్ ఫోర్ కు చేరుకున్న టీమిండియా (ANI)

India vs Hong Kong: ఆసియా కప్‌ 2022లో సూపర్‌ ఫోర్‌కు చేరిన రెండో టీమ్‌గా నిలిచింది టీమిండియా. గ్రూప్‌ ఎ నుంచి రోహిత్‌ సేన తర్వాతి స్టేజ్‌కు వెళ్లింది. బుధవారం (ఆగస్ట్‌ 31) జరిగిన మ్యాచ్‌లో హాంకాంగ్‌ను చిత్తు చేసి ఇండియన్‌ టీమ్‌ తన బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన ఇండియా.. రెండో మ్యాచ్‌లో హాంకాంగ్‌ను 40 రన్స్‌తో ఓడించింది. మ్యాచ్‌ ఎలాగూ గెలుస్తామన్న కాన్ఫిడెన్స్‌తో విరాట్‌ కోహ్లితో 17వ ఓవర్‌ వేయించాడు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. అతడు తన ఓవర్లో 6 రన్స్‌ మాత్రమే ఇచ్చాడు.

ట్రెండింగ్ వార్తలు

193 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన హాంకాంగ్‌.. గెలవడం అసాధ్యమని ముందే అందరికీ తెలిసినా.. బాగానే పోరాడింది. ఇండియన్‌ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. చివరికి 20 ఓవర్లలో 5 వికెట్లకు 152 రన్స్‌ చేయడం విశేషం. హాంకాంగ్‌ బ్యాటర్లలో బాబర్‌ హయత్‌ 35 బాల్స్‌లో 41 రన్స్‌, కించిత్‌ షా 28 బాల్స్‌లో 30 రన్స్‌ చేశారు. ఇండియన్‌ బౌలర్లలో జడేజా 4 ఓవర్లలో కేవలం 15 రన్స్‌ ఇచ్చి ఒక వికెట్‌ తీసుకున్నాడు.

దారుణమైన ఫామ్ లో ఉన్న అవేష్ ఖాన్.. హాంకాంగ్ లాంటి టీమ్ పై కూడా తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 53 రన్స్ ఇచ్చాడు. తన చివరి ఓవర్లోనే అతడు 21 రన్స్ సమర్పించుకున్నాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా 4 ఓవర్లలో 44 రన్స్ ఇచ్చి నిరాశపరిచాడు.

సూర్య ప్రతాపం.. విరాట్ పర్వం

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోరు చేసింది. సూర్య, విరాట్‌ చెలరేగిపోయారు. దీంతో 20 ఓవర్లలో 2 వికెట్లకు 192 రన్స్‌ చేసింది. హాంకాంగ్‌ బౌలర్లను చితగ్గొట్టిన సూర్యకుమార్‌ కేవలం 26 బాల్స్‌లో 68 రన్స్‌ చేసి అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. చివరి ఓవర్లోనే సూర్య ఏకంగా 4 సిక్స్ లు బాదడం విశేషం.

మరోవైపు విరాట్‌ కోహ్లి కూడా 44 బాల్స్‌లో 59 రన్స్‌ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌ ఉన్నాయి. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 42 బాల్స్‌లోనే 98 రన్స్‌ జోడించారు. ఇన్నింగ్స్‌ మొత్తం సూర్యకుమార్‌ షోనే నడిచింది. అతడు క్రీజులోకి వచ్చే వరకూ నత్తనడకన సాగిన ఇండియా ఇన్నింగ్స్‌ అతని రాక తర్వాత ఒక్కసారిగా రాకెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లింది.

<p>హాంకాంగ్ బౌలర్లతో ఆడుకున్న సూర్యకుమార్, విరాట్ కోహ్లి</p>
హాంకాంగ్ బౌలర్లతో ఆడుకున్న సూర్యకుమార్, విరాట్ కోహ్లి (AFP)

మరోవైపు చాలా రోజుల తర్వాత విరాట్‌ కోహ్లి ఓ హాఫ్‌ సెంచరీ బాదడమే ఫ్యాన్స్‌కు చాలా థ్రిల్‌ను ఇచ్చింది. అతడు 40 బాల్స్‌లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. టీ20ల్లో అతనికిది 31వ హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. ఈ ఫిఫ్టీ ప్లస్‌ స్కోరుతో మరోసారి అతడు టీ20ల్లో 50కిపైగా సగటును సాధించాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇండియాకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ మంచి స్టార్టే ఇచ్చారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలో 38 రన్స్‌ జోడించారు. రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ కొట్టి మంచి ఊపు మీద కనిపించిన రోహిత్‌.. మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. రోహిత్‌ 13 బాల్స్‌లో 21 రన్స్‌ చేశాడు. ఆ తర్వాత రాహుల్‌తో జత కలిసిన కోహ్లి కూడా తన తొలి మ్యాచ్‌ ఫామ్‌ కొనసాగించాడు.

హాంకాంగ్‌లాంటి టీమ్‌పై ఈ ఇద్దరూ అనుకున్న స్థాయిలో వేగంగా పరుగులు చేయలేకపోయినా.. మెల్లగా పార్ట్‌నర్‌షిప్‌ బిల్డ్‌ చేశారు. చాలా రోజుల తర్వాత టీమ్‌లోకి తిరిగొచ్చి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తొలి బంతికే ఔటైన రాహుల్‌.. ఈ మ్యాచ్‌లో తడబడుతూనే బ్యాటింగ్‌ చేశాడు. రెండు కళ్లు చెదిరే సిక్స్‌లు కొట్టినా.. మునుపటి రాహుల్‌ను తలపించలేకపోయాడు. చివరికి 38 బాల్స్‌లో 36 రన్స్‌ చేసి ఔటయ్యాడు. కోహ్లితో కలిసి రాహుల్‌ రెండో వికెట్‌కు 56 రన్స్‌ జోడించాడు.

WhatsApp channel