Virat Kohli Bowling: ఆరేళ్ల గ్యాప్ తర్వాత కోహ్లీ బౌలింగ్.. టీమిండియాకు మరో బౌలింగ్ ఆప్షన్ దొరికినట్లేనా?
Virat Kohli Bowling: బుధవారం నాడు హాంకాంగ్-భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరేళ్ల గ్యాప్ తర్వాత బౌలింగ్ చేశాడు. 17వ ఓవర్లో బౌలింగ్ చేసిన అతడు కేవలం 6 పరుగులే ఇచ్చాడు.
Virat Kohli Bowling in India vs Hong Kong Match: దుబాయ్ వేదికగా బుధవారం నాడు హాంకాంగ్ జట్టుతో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ అర్ధశతకాలతో విజృంభించడంతో పసికూనపై 40 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత కోహ్లీ ఫామ్‌లోకి రావడం భారత అభిమానుల్లో ఆనందాన్ని నింపింది. బుధవారం నాటి మ్యాచ్‌లో కోహ్లీ ఆరంభంలో నిదానంగా ఆడినా.. అనంతరం పుంజుకుని పాత కోహ్లీని గుర్తుకు తెచ్చాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో బ్యాట్‌తోనే కాకుండా.. బంతితోనూ ఆకట్టుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత కోహ్లీ బౌలింగ్ చేశాడు.
17వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ చేతికి బంతినిచ్చాడు రోహిత్. ఆరేళ్ల విరామం తర్వాత టీ20ల్లో బౌలింగ్ చేసిన విరాట్.. ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. డెత్ ఓవర్లోనూ వికెట్ ఏమి తీయనప్పిటీక కేవలం ఆరు పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
అరుదైన దృశ్యాన్ని వీక్షిస్తున్నామంటూ ఓ వ్యక్తి ట్విటర్ వేదికగా తన స్పందనను తెలియజేశాడు. విరాట్ కోహ్లీ బౌలింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడని ఇంకో వ్యక్తి తెలిపాడు. ఆరేళ్ల విరామం తర్వాత టీ20ల్లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేశాడని మరో వ్యక్తి స్పష్టం చేశాడు. భారత్‌కు ఆరో బౌలింగ్ ఆప్షన్ దొరికిందని ఇంకో యూజర్ కోహ్లీపై ప్రశంసల వర్షాన్ని కురిపించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 2 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ లక్ష్యాన్ని హాంకాంగ్ ముందుంచింది. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 68 పరుగులు, విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 59 పరుగులతో అద్భుత అర్ధశతకాలు చేయడంతో హాంకాంగ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనంలో హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 152 పరుగులకే పరిమితమైంది. బాబర్ హయత్ ఒక్కడే 41 పరుగులతో ప్రత్యర్థి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
సంబంధిత కథనం