Rohit Shrama Post Viral: రోహిత్ శర్మ సినిమాల్లో అరంగేట్రం చేయనున్నాడా? హిట్ మ్యాన్ పోస్ట్ వైరల్
Rohit Instagram Post Viral: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సినిమాల్లో అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా అతడి ఇన్‌స్టా పోస్ట్ చూస్తే ఈ విషయం అవగతమవుతుంది. సెప్టెంబరు 4న ట్రైలర్ విడుదల కానున్నట్లు ఆయన పేర్కొన్నాడు.
Rohit Instagram Post Viral: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో భారత జట్టు అద్భుత విజయాలు దక్కించుకుంటూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఆసియా కప్‌లోనూ టీమిండియాను సూపర్-4 దశకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ఓ పక్క క్రికెటర్‌గా వరుస విజయాలను అందుకుంటున్న మన హిట్ మ్యాన్.. సినిమాల్లోకి వెళ్లబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. అవును.. ఇందుకు సంబంధించి తాజాగా రోహిత్ శర్మ ఇన్‌స్టా పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ పోస్టుకు తోడు ఓ ఫొటోను కూడా జత చేశాడు మన హిట్ మ్యాన్. గళ్ల చొక్కాను ధరించి చేతులు కట్టుకుని నవ్వుతూ రోహిత్ శర్మ చూస్తున్నాడు. "ఉత్కంఠను తట్టుకోలేకపోతున్నాను. సినిమాల్లో అరంగేట్రం చేయబోతున్నాను. సెప్టెంబరు 4న ట్రైలర్ విడుదల కాబోతుంది. మెగా బ్లాక్‌బాస్టర్" అంటూ రోహిత్ శర్మ తన పోస్టులో పేర్కొన్నాడు.
ఈ వార్త గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కానీ ఒక్కసారిగా ట్రైలర్ అంటున్నే సరికి సోషల్ మీడియాలో ఈ పోస్టుపై విస్తృతంగా చర్చ ప్రారంభించారు నెటిజన్లు. ఇప్పటికే 4.5 లక్షల మంది ఈ పోస్టును లైక్ చేశారు. ఈ సంఖ్య ఇంకా రెట్టింపయ్యేలా ఉంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
బుదవారం నాడు హాంకాంగ్‌తో జరిగిన ఆసియా కప్ టీ20 మ్యాచ్‌లో భారత్ 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత రెండో సారథిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 30 విజయాలతో ఉన్న కోహ్లీని అధిగమించి రెండో స్థానానికి ఎగబాకాడు. అగ్రస్థానంలో ధోనీ 41 విజయాలతో ముందున్నాడు.
బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 2 వికెట్ల నష్టానికి 192 పరుగుల భారీ లక్ష్యాన్ని హాంకాంగ్ ముందుంచింది. సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 68 పరుగులు, విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 59 పరుగులతో అద్భుత అర్ధశతకాలు చేయడంతో హాంకాంగ్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనంలో హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 152 పరుగులకే పరిమితమైంది. బాబర్ హయత్ ఒక్కడే 41 పరుగులతో ప్రత్యర్థి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
సంబంధిత కథనం