తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gautham Gambhir Birthday: రియల్‌ ఛాంపియన్‌ గౌతమ్‌ గంభీర్.. మాజీ క్రికెటర్‌కు శుభాకాంక్షల వెల్లువ

Gautham Gambhir Birthday: రియల్‌ ఛాంపియన్‌ గౌతమ్‌ గంభీర్.. మాజీ క్రికెటర్‌కు శుభాకాంక్షల వెల్లువ

Hari Prasad S HT Telugu

14 October 2022, 11:13 IST

google News
    • Gautham Gambhir Birthday: రియల్‌ ఛాంపియన్‌ గౌతమ్‌ గంభీర్ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం (అక్టోబర్‌ 14) గౌతీ తన 41వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు.
2011 వరల్డ్ కప్ ట్రోఫీతో గౌతమ్ గంభీర్
2011 వరల్డ్ కప్ ట్రోఫీతో గౌతమ్ గంభీర్ (Twitter)

2011 వరల్డ్ కప్ ట్రోఫీతో గౌతమ్ గంభీర్

Gautham Gambhir Birthday: టీమిండియా ఇప్పటి వరకూ మూడు వరల్డ్‌కప్‌లు గెలిచింది. రెండు వన్డే వరల్డ్‌కప్స్‌, ఒక టీ20 వరల్డ్‌కప్‌. ఈ విజయాలు సాధించి పెట్టిన కపిల్‌, ఎమ్మెస్‌ ధోనీలు అందరికీ గుర్తున్నారు. కానీ ఇండియా గెలిచిన చివరి రెండు వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌లో విజయంలో కీలకపాత్ర పోషించిన వ్యక్తి గౌతమ్‌ గంభీర్‌ అన్న విషయం ఎంతమందికి తెలుసు.

నిజమే.. 2007లో ఇండియా టీ20 వరల్డ్‌కప్‌ గెలిచినప్పుడు, 2011లో వన్డే వరల్డ్‌కప్‌ గెలిచినప్పుడు టీమ్‌లో గంభీర్‌ ఉన్నాడు. అంతేకాదు ఈ రెండు ఫైనల్స్‌లోనూ ఇండియన్‌ టీమ్‌ తరఫున అత్యధిక స్కోరు చేసిన వ్యక్తి కూడా గంభీరే. 2007 వరల్డ్‌కప్‌ ఫైనల్లో గౌతీ 75 రన్స్‌ చేయగా.. 2011 ఫైనల్లో 97 రన్స్‌ చేశాడు. ఈ రెండు విజయాల్లోనూ గంభీర్‌దే కీలకపాత్ర.

ఇండియన్‌ క్రికెట్‌లో అంతటి పాత్ర పోషించిన గౌతమ్‌ గంభీర్‌ శుక్రవారం (అక్టోబర్‌ 14) తన 41వ బర్త్‌డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతనికి మాజీ క్రికెటర్లు, అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు. ట్విటర్‌ ద్వారా యువరాజ్‌, రైనాలాంటి క్రికెటర్లు గౌతీని విష్‌ చేశారు. గంభీర్‌తో ఈ ఇద్దరు కూడా 2011 వరల్డ్‌కప్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఈ సందర్భంగా యువీ విష్‌ చేస్తూ.. "నా ప్రియమైన సోదరుడు గౌతమ్‌ గంభీర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రతి కోణంలోనూ నువ్వో ఛాంపియన్‌. నిన్ను త్వరలోనే కలవాలని అనుకుంటున్నాను" అని అన్నాడు. అటు సురేశ్‌ రైనా ట్విటర్‌ ద్వారా గౌతీకి బర్త్‌డే విషెస్‌ చెప్పాడు. "ఇవాళ బర్త్‌డే సందర్భంగా గౌతమ్‌ గంభీర్‌కు అంతే మంచే జరగాలని, విజయం సిద్ధించాలని కోరుకుంటున్నాను. నిజమైన స్నేహితుడు. గొప్ప మనిషి. హ్యాపీ బర్త్‌డే బ్రదర్" అని రైనా ట్వీట్ చేశాడు.

242 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లు, 10324 ఇంటర్నేషనల్‌ రన్స్‌.. 2007 వరల్డ్‌ టీ20 & 2011 వరల్డ్‌ కప్‌ విన్నర్‌ గౌతమ్‌ గంభీర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ అటు బీసీసీఐ కూడా ట్వీట్‌ చేయడం విశేషం.

రెండు వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ విజయాల్లో గంభీరే అత్యధిక స్కోరు సాధించినా రెండింట్లోనూ అతనికి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు మాత్రం దక్కలేదు. ఇదే విషయాన్ని అటు అభిమానులు కూడా అతని బర్త్‌డే సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇండియాకు పెద్ద మ్యాచ్‌లలో అద్భుతంగా ఆడిన ప్లేయర్‌కు అందుకు తగిన పేరు మాత్రం రాలేదని వాళ్లు వాపోయారు. అసలు నువ్వు లేకుండా ఆ వరల్డ్‌కప్స్‌ ఇండియాకు వచ్చేవే కావని కూడా వాళ్లు అనడం విశేషం.

టాపిక్

తదుపరి వ్యాసం