Suresh Raina Retirement: థ్యాంక్యూ మిస్టర్ ఐపీఎల్.. రైనాకు చెన్నై ట్రిబ్యూట్
Suresh Raina Retirement: థ్యాంక్యూ మిస్టర్ ఐపీఎల్ అంటూ రైనాకు ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ రిటైర్మెంట్ సందేశం పంపించింది. ఐపీఎల్‌లో చెన్నై టీమ్‌తో రైనాకు విడదీయలేని బంధం ఉన్న విషయం తెలిసిందే.
Suresh Raina Retirement: ఐపీఎల్ అంటే రైనా.. రైనా అంటే ఐపీఎల్ అనేంతలా ఈ మెగా లీగ్‌తో సురేశ్ రైనాకు అనుబంధం ఉంది. టీమిండియాకు ఎన్నో ఏళ్లు ఆడినా, ఎన్నో విజయాలు సాధించి పెట్టినా.. అతనికి ఇప్పటికీ మిస్టర్ ఐపీఎల్‌గానే పేరుంది. 2020, 2022లలో తప్ప 2008 నుంచి ప్రతి సీజన్‌లో ఐపీఎల్ ఆడుతూ వచ్చిన రైనా.. కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు.
ఇప్పుడు 35 ఏళ్ల వయసులో మొత్తంగా క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు మంగళవారం (సెప్టెంబర్ 6) ట్విటర్ ద్వారా ప్రకటించాడు. డొమెస్టిక్‌తోపాటు ఐపీఎల్‌లోనూ రైనా ఇక కనిపించడు. రెండేళ్ల కిందటే ధోనీతో కలిసి ఒకే సారి (ఆగస్ట్ 15) ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన రైనా ఇప్పుడు మిగతా అన్ని రకాల క్రికెట్ నుంచి కూడా తప్పుకోనున్నట్లు చెప్పాడు.
ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ తమ అభిమాన క్రికెటర్‌కు తమదైన రీతిలో విషెస్ చెప్పింది. తమ అధికారిక ట్విటర్‌లో రైనా రిటైర్మెంట్‌పై స్పందిస్తూ..
"చరిత్రలో గొప్ప విజయాలు సాధించినప్పుడు ఉన్నవాడు. ఆ విజయాలు సాధ్యం చేసినవాడు. అన్నింటికీ థ్యాంక్యూ, చిన్న తల" అంటూ థ్యాంక్యూ మిస్టర్ ఐపీఎల్ అని రాసి ఉన్న ఫొటోను చెన్నై ట్విటర్‌లో పోస్ట్ చేసింది.
ఐపీఎల్.. అందులోనూ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌తో రైనాది విడదీయరాని బంధం. ధోనీని తల (లీడర్) అంటూ అక్కడి ఫ్యాన్స్ ఎలా ఆరాధిస్తారో.. రైనాను చిన్న తలగా పిలుచుకుంటారు. ఇప్పటికీ చెన్నై టీమ్ తరఫున ఐపీఎల్‌లో అత్యధిక రన్స్ రికార్డు రైనా పేరిటే ఉంది. ఆ టీమ్ తరఫున 176 మ్యాచ్‌లు ఆడిన రైనా 4687 రన్స్ చేశాడు. 2008 నుంచి 2021 మధ్య చెన్నై టీమ్‌కు రైనా ఆడాడు.
మధ్యలో ఆ టీమ్‌పై నిషేధం ఉన్న 2016, 17 సీజన్‌లలో మాత్రం అప్పటి గుజరాత్ లయన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే 2022 సీజన్‌కు ముందు రైనాను చెన్నై రిటేన్ చేసుకోలేదు. ఆ తర్వాత మెగా వేలంలోనూ అతన్ని తీసుకోలేదు. దీంతో ఈ సీజన్ అతడు ఆడలేకపోయాడు. అంతకుముందు 2020లో కరోనా భయంతో టోర్నీ ప్రారంభానికి ముందు తప్పుకున్నాడు. సురేశ్ రైనా చెన్నై టీమ్ తరఫున 1 సెంచరీ, 33 హాఫ్ సెంచరీలు చేశాడు. చెన్నై టైటిల్ గెలిచిన నాలుగుసార్లూ రైనా టీమ్‌తోనే ఉన్నాడు.