Gambhir to Rohit and Rahul: పాకిస్థాన్‌పై గెలవాలంటే ఇలా చేయండి.. రోహిత్, రాహుల్‌లకు గంభీర్ సూచన
Gambhir to Rohit and Rahul: పాకిస్థాన్‌పై గెలవాలంటే వాళ్ల ప్రధాన బౌలర్ షహీన్ అఫ్రిదిని టార్గెట్ చేయాలని టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, రాహుల్‌లకు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ సూచిస్తున్నాడు.
Gambhir to Rohit and Rahul: వరల్డ్‌కప్‌లలో ఇండియాపై పాకిస్థాన్ ఒకే ఒక్కసారి మాత్రమే గెలిచింది. అది కూడా గతేడాది టీ20 వరల్డ్‌కప్‌లోనే. దీనికి కారణం వాళ్ల మెయిన్ పేస్ బౌలర్ షహీన్ అఫ్రిది. అతడు తన తొలి రెండు ఓవర్లలోనే ఇండియన్ ఓపెనర్లు రోహిత్, రాహుల్‌లను ఔట్ చేసి గట్టి దెబ్బ కొట్టాడు. ఇక స్లాగ్ ఓవర్లలో కోహ్లిని ఔట్ చేసి మరింత దెబ్బ తీశాడు.
అతని కారణంగా ఆ మ్యాచ్‌లో ఇండియా 151 రన్స్‌కే పరిమితమైంది. ఈ మధ్య ఆసియా కప్‌లో అఫ్రిది లేకుండా పాక్ బరిలోకి దిగింది. దీంతో తొలి మ్యాచ్‌లో ఆ టీమ్‌పై ఇండియా గెలిచింది. అయితే వరల్డ్‌కప్‌కు మాత్రం అఫ్రిది తిరిగొచ్చాడు. ఇప్పుడీ మెగా టోర్నీలో పాక్‌తోనే ఇండియా తన తొలి మ్యాచ్ ఆడబోతోంది. దీంతో మరోసారి అందరి కళ్లూ అఫ్రిదిపైనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతన్నే టార్గెట్ చేయాలంటూ రోహిత్, రాహుల్‌కు సూచిస్తున్నాడు ఇండియన్ టీమ్ మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.
"షహీన్ అఫ్రిది బౌలింగ్ చేసే సమయంలో వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నించొద్దు. అతని బౌలింగ్‌లో రన్స్ చేయండి. ఎందుకంటే వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నించినప్పుడే సమస్య మొదలవుతుంది. అది మీ ఫుట్‌వర్క్ కావచ్చు మరొకటి కావచ్చు. అయినా టీ20 క్రికెట్‌లో వికెట్ కాపాడుకుపోవడానికి ప్రయత్నించొద్దు. అతడు కొత్త బంతితో ప్రమాదకర బౌలర్ అని తెలుసు. అయినా సరే అతని బౌలింగ్‌లో రన్స్ చేయడానికి ప్రయత్నించాలి. బంతిని బలంగా బాదడం కంటే సరైన పొజిషన్‌లో నిల్చొని టైమింగ్ సరిగా ఉండాలి. నిజానికి అఫ్రిదిని టార్గెట్ చేసేలా ఇండియన్ టీమ్‌లో టాప్ 3 లేదా 4 బ్యాటర్లు ఉన్నారు" అని గంభీర్ అన్నాడు.
గతేడాది వరల్డ్‌కప్ తర్వాత ఇప్పటి వరకూ ఈ రెండు టీమ్స్ రెండుసార్లు తలపడగా.. చెరొక మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఆసియాకప్‌లోనే ఈ రెండు టీమ్స్ ఆ రెండు మ్యాచ్‌లను ఆడిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో ఓటమి తర్వాత సొంతగడ్డపై ఇండియా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలపై సిరీస్‌లు గెలిచి కాన్ఫిడెంట్‌గా ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ అతిపెద్ద బలంగా మారాడు. ఈ నేపథ్యంలో గంభీర్ చెప్పినట్లు పాకిస్థాన్‌పై ఇండియన్ ఓపెనర్లు అలా చేయగలిగితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.