Gautham Gambhir as Global Mentor: గంభీర్ ఇప్పుడు సూపర్ జెయింట్స్ గ్లోబల్ మెంటార్
Gautham Gambhir as Global Mentor: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ గ్లోబల్ మెంటార్ అయ్యాడు. ఈ విషయాన్ని శుక్రవారం (అక్టోబర్ 7) ఆర్పీఎస్ గ్రూప్ వెల్లడించింది.
Gautham Gambhir as Global Mentor: ఐపీఎల్ ఫ్రాంఛైజీలు ఇప్పుడు గ్లోబల్ లెవల్‌కు వెళ్లాయి. ఇక్కడి ఫ్రాంఛైజీలే సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్‌లోనూ టీమ్స్‌ను కొనుగోలు చేయడంతో ఇక్కడి టీమ్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్న సపోర్ట్ స్టాఫ్‌కే గ్లోబల్ లెవల్లో బాధ్యతలు అప్పగిస్తున్నాయి. ఆ మధ్య ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ జహీర్‌ఖాన్, జయవర్దనెలకు సౌతాఫ్రికా, యూఏఈ లీగ్స్‌లోని టీమ్స్ బాధ్యతలు కూడా అప్పగించిన విషయం తెలుసు కదా.
ఇక ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఓనర్ అయిన ఆర్పీఎస్ గ్రూప్ కూడా అదే పని చేసింది. 2022 సీజన్‌తోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టిన ఈ టీమ్‌కు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మెంటార్‌గా ఉన్నాడు. దీంతో అతనినే ఇప్పుడు గ్లోబల్ మెంటార్‌గా ప్రమోట్ చేసింది. తొలి సీజన్‌లో లక్నో టీమ్ ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే.
ఆర్పీఎస్ గ్రూప్ ఈ మధ్య సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసింది. ఈ టీమ్‌కు డర్బన్ సూపర్ జెయింట్స్ అని పేరు పెట్టారు. దీంతో గంభీర్ ఇప్పుడు లక్నోతోపాటు డర్బన్ టీమ్ బాధ్యతలు కూడా తీసుకోనున్నాడు. గంభీర్ ఇండియన్ టీమ్‌కు ఎన్నో ఏళ్ల పాటు సేవలందించాడు. 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే వరల్డ్‌కప్ విజయాల్లో గంభీర్ కీలకపాత్ర పోషించాడు.
2011 వరల్డ్‌కప్ ఫైనల్లో 97 రన్స్‌తో అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్ గంభీరే. ఇక మెంటార్‌గా కూడా తొలి సీజన్‌లోనే లక్నో టీమ్‌ను విజయవంతంగా నడిపించాడు. దీంతో అతన్నే గ్లోబల్ మెంటార్‌గా నియమించాలని ఆర్పీఎస్ గ్రూప్ నిర్ణయించింది. ఈ కొత్త రోల్‌పై గంభీర్ స్పందిస్తూ.. ఓ అధికారిక ప్రకటన విడుదల చేశాడు.
"ఓ టీమ్ స్పోర్ట్‌లో ఇలాంటి హోదాలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఓ టీమ్ విజయం సాధించే ప్రక్రియలో వాళ్లు పాలుపంచుకుంటారు. గ్లోబల్ మెంటార్‌గా సూపర్ జెయింట్స్‌లో అదనపు బాధ్యత నాకు అప్పగించారు. గెలవాలన్న నా కోరిక, ప్యాషన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్‌కు చేరాయి" అని గంభీర్ అన్నాడు. సూపర్ జెయింట్స్ కుటుంబం గ్లోబల్ స్థాయికి చేరడం చాలా గర్వంగా ఉందని చెప్పాడు. తనపై నమ్మకం ఉంచిన సూపర్ జెయింట్స్‌కు థ్యాంక్స్ చెప్పాడు. ఈ అదనపు బాధ్యత మరికొన్ని నిద్రలేని రాత్రులకు దారి తీస్తుందని అన్నాడు.
టాపిక్