Ravi Shastri on T20 World Cup: బ్యాటర్లే గెలిపిస్తారు.. కోహ్లి, రోహిత్ రిటైరవుతారు: రవిశాస్త్రి
Ravi Shastri on T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ గురించి టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీని బ్యాటర్లే గెలిపిస్తారని, దీని తర్వాత కోహ్లి, రోహిత్ రిటైరవుతారని అనడం విశేషం.
Ravi Shastri on T20 World Cup: టీమిండియా బ్యాటింగ్ చాలా బలంగా ఉందని, ఫీల్డింగ్‌ను మెరుగుపరచుకుంటే ఈసారి టీ20 వరల్డ్‌కప్ గెలుస్తుందని మాజీ కోచ్ రవిశాస్త్రి జోస్యం చెప్పాడు. నిజానికి బ్యాటింగ్ బాగానే ఉన్నా.. కొంతకాలంగా ఫీల్డింగ్ అసలు బాగా లేదు. ఆసియాకప్‌లోనూ కీలకమైన మ్యాచ్‌లలో క్యాచ్‌లు వదిలేసి మ్యాచ్‌లు చేజార్చుకున్నారు.
ట్రెండింగ్ వార్తలు
దీనిపైనే శాస్త్రి స్పందించాడు. "గత ఏడేళ్లుగా కోచ్‌గా ఉండటంతోపాటు ఇప్పుడు బయటి నుంచి ఈ టీమ్‌ను చూస్తున్నాను. ఇప్పుడు ఉన్నది అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్. యూత్ అయినా, అనుభవజ్ఞులైనా.. ఒక్కోసారి ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమంగా ఆడుతున్నారు" అని స్పోర్ట్స్ జర్నలిస్ట్ అయాజ్ మేనన్‌తో మాట్లాడిన సందర్భంగా శాస్త్రి చెప్పాడు.
"టీ20 క్రికెట్‌లో ఇప్పటి వరకూ ఇండియాకు ఎప్పుడూ లేనంత బలమైన బ్యాటింగ్ లైనప్ ఇప్పుడు ఉంది. ముఖ్యంగా ఐదో స్థానంలో హార్దిక్, ఆరో స్థానంలో కార్తీక్ లేదా పంత్ రావడం చాలా ప్రభావం చూపనుంది. అయితే ఫీల్డింగ్‌పై మాత్రం వాళ్లు దృష్టిసారించాల్సిందే" అని శాస్త్రి స్పష్టం చేశాడు. ఫీల్డింగ్‌లో 15-20 రన్స్ ఆపగలిగితే మ్యాచ్ ఫలితం మరోలా ఉంటుందని, లేదంటే ప్రతిసారీ ఆ రన్స్ బ్యాటర్లు చేయాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌లాంటి టీమ్స్ ఫీల్డింగ్‌లో చేసేది అదే అని అన్నాడు.
శాస్త్రి కోచ్‌గా ఉన్న సమయంలో ఇండియా ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచినా ఎప్పుడూ ఐసీసీ ఈవెంట్ గెలవలేదు. అయితే అప్పుడు మిడిలార్డర్ బలహీనంగా ఉందని, ఇప్పుడు 4, 5, 6 స్థానాల్లో సూర్య, హార్దిక్, కార్తీక్ లేదా పంత్‌లతో మిడిలార్డర్ బలంగా ఉండటం వల్ల టాప్ 3 బ్యాటర్లు రోహిత్, రాహుల్, కోహ్లి స్వేచ్ఛగా ఆడే వీలుందని రవిశాస్త్రి చెప్పాడు. ఇక ఆస్ట్రేలియా కండిషన్స్ ఇండియన్ బ్యాటర్లకు బాగా కలిసొస్తాయని కూడా అన్నాడు.
ఆ ముగ్గురూ రిటైర్ కావచ్చు
ఇక రవిశాస్త్రి మరో ముఖ్యమైన విషయాన్ని కూడా ప్రస్తావించాడు. ప్రస్తుతం టీమ్‌లో ఉన్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్‌లకు ఇదే చివరి టీ20 వరల్డ్‌కప్ కావచ్చని, దీని తర్వాత వాళ్లు ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెబుతారని అనడం గమనార్హం.
"ఈ వరల్డ్‌కప్ తర్వాత ఇండియా కొత్త టీమ్‌ను చూస్తుందని నేను అనుకుంటున్నాను. 2007లో జరిగినట్లే ఇప్పుడూ జరగొచ్చు. అప్పుడు సచిన్, ద్రవిడ్, గంగూలీ లేకుండా టీ20 టీమ్ ఏర్పడింది. ధోనీ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడూ అదే జరుగుతుంది. కోహ్లి, రోహిత్ బాగా ఆడలేరని కాదు కానీ వాళ్లు ఇతర రెండు ఫార్మాట్లకు కావాలి. ముఖ్యంగా వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్ జరగనుంది. అందువల్ల వాళ్లపై భారం మోపకూడదు" అని రవిశాస్త్రి చెప్పాడు.
వరుస గాయాలపై..
టీమ్‌లో ప్లేయర్స్ వరుసగా గాయాల బారిన పడుతుండటంపై కూడా రవిశాస్త్రి స్పందించాడు. ఈ గాయాల విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఇంగ్లండ్‌కు, న్యూజిలాండ్‌కు రెండేసిసార్లు టూర్‌కు వెళ్లినప్పుడు బుమ్రా గాయపడ్డాడని, ఏడాది కాలంగా గాయం కారణంగా బుమ్రా కేవలం ఐదు మ్యాచ్‌లే ఆడినట్లు శాస్త్రి తెలిపాడు. దీపక్ చహర్ పరిస్థితీ అలాగే ఉందని, ఈ గాయాలు ఎందుకు అవుతున్నాయన్న విషయంపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
పంత్, కార్తీక్‌లలో ఎవరు?
"ఇది ఆడబోయే టీమ్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే ఆస్ట్రేలియా పిచ్‌లపై గతంలో పంత్ ఆడిన తీరును గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అయితే కార్తీక్ కూడా మంచి క్రికెట్ ఆడుతున్నాడు. ఇది నిజంగా కఠినమైన నిర్ణయమే. దీనిపై ఎప్పుడో నిర్ణయం తీసుకోవాల్సింది. వాళ్లు కార్తీక్‌తో వెళ్లాలని అనుకున్నారు. కాబట్టి అతడే ఉంటాడు. అయితే ఆస్ట్రేలియాలో పంత్ మెరుపులను మాత్రం మరచిపోకూడదు" అని రవిశాస్త్రి అన్నాడు.