Ravishastri on Bumrah Replacement: టీ20 వరల్డ్‌కప్ నుంచి టీమిండియా స్టార్ ప్లేయర్స్ జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా దూరం కావడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. వాళ్లు లేకపోవడం పెద్ద లోటే అయినా.. మరో ఛాంపియన్‌ను కనుగొనడానికి ఇదే సరైన సమయం అని శాస్త్రి అన్నాడు. మొదట మోకాలి గాయంతో జడేజా, తర్వాత వెన్ను గాయంతో బుమ్రా ఈ మెగా టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే.
ఈ ఇద్దరూ లేకపోవడం కచ్చితంగా ఇండియా అవకాశాలను ప్రభావితం చేయనుంది. రవిశాస్త్రి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. చెన్నైలో టీమిండియా మాజీ బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్‌లతో కలిసి తాను మొదలుపెట్టిన కోచింగ్ బియాండ్ లాంచ్ వేడుకలో రవిశాస్త్రి మాట్లాడాడు. గురువారం (అక్టోబర్ 6) ఈ అకాడెమీని శాస్త్రి ప్రారంభించాడు.
ఈ సందర్భంగా బుమ్రా, జడేజా గాయాలపై స్పందిస్తూ.. "ఇది దురదృష్టకరం. ఈ మధ్య కాలంలో చాలా క్రికెట్ ఆడుతున్నారు. దీంతో ప్లేయర్స్ గాయపడుతున్నారు. బుమ్రా గాయపడ్డాడు. అయితే మరో ప్లేయర్‌కు మంచి అవకాశం. గాయాలతో మనం చేయగలిగేది ఏమీ లేదు. మన దగ్గర తగినంత బలం ఉంది. మనది మంచి టీమ్. సెమీఫైనల్ వరకూ వెళ్తే టోర్నీ గెలిచే ఛాన్స్ ఉంటుందని నేను చెప్పే వాడిని. టోర్నీని ఘనంగా ప్రారంభించి, సెమీఫైనల్ వరకూ వెళ్తే వరల్డ్ కప్ గెలిచే అవకాశం ఉంటుంది. బుమ్రా లేడు. జడేజా లేడు. ఇది కచ్చితంగా టీమ్‌ను దెబ్బ తీస్తుంది. అయితే ఓ కొత్త ఛాంపియన్‌ను కనుగొనడానికి ఇదో మంచి అవకాశం" అని అన్నాడు.
ఇక బుమ్రా స్థానంలో షమి వచ్చే ఛాన్స్ ఉందన్న వార్తలపై కూడా రవిశాస్త్రి స్పందించాడు. నిజానికి అతడే బెస్ట్ ఛాయిస్ అని కూడా అతడు అభిప్రాయపడ్డాడు. "అతని అనుభవం బాగా పనికొస్తుంది. గత ఆరేళ్లలో ఇండియా చాలాసార్లు ఆస్ట్రేలియా వెళ్లింది. అన్ని టూర్లలోనూ షమి ఉన్నాడు. అందువల్ల అతని అనుభవం టీమ్‌కు ఉపయోగపడుతుంది" అని రవిశాస్త్రి అన్నాడు.
ప్రస్తుతానికి బుమ్రా లేకుండానే టీమిండియా.. ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే. అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలన్నదానిపై రానున్న రోజుల్లో మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకోనుంది. షమి పూర్తిగా కోలుకుంటే అతన్నే తీసుకునే అవకాశం ఉందని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే హింట్ కూడా ఇచ్చాడు.