15 Years of T20 World Cup 2007: ప్రపంచకప్ అద్భుతానికి 15 ఏళ్లు.. మరపురాని క్షణాలు.. మతిపోయే విజయాలు-fifteen years of india t20 world cup 2007 win ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  15 Years Of T20 World Cup 2007: ప్రపంచకప్ అద్భుతానికి 15 ఏళ్లు.. మరపురాని క్షణాలు.. మతిపోయే విజయాలు

15 Years of T20 World Cup 2007: ప్రపంచకప్ అద్భుతానికి 15 ఏళ్లు.. మరపురాని క్షణాలు.. మతిపోయే విజయాలు

Maragani Govardhan HT Telugu
Sep 24, 2022 11:35 AM IST

T20 World Cup 2007 Memories: పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచకప్ సమరం 2007లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్‌ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను ఓడించి భారత్ కైవసం చేసుకుంది. నేటితో ఆ అరుదైన విజయానికి 15 ఏళ్లు పూర్తయ్యాయి.

<p>టీ20 ప్రపంచకప్ 2007</p>
టీ20 ప్రపంచకప్ 2007 (HT)

15 Years of Inida T20 world cup win: 2007 టీ20 ప్రపంచకప్ గుర్తుందా? అంత సులభంగా భారత అభిమానులు మర్చిపోలేరు. ఎందుకంటే సచిన్ తెందూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు లేకుండా.. అనుభవం లేని మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో యువ భారత్ యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. అందులోనూ ప్రపంచంలో అత్యంత మేటీ జట్టయిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి మేటీ జట్లను ఓడించడమే కాకుండా ఫైనల్ చేరి చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై అదిరిపోయే విజయాన్ని అందుకుంది. పొట్టి ఫార్మాట్‌ ఆరంభ ప్రపంచకప్‌నే కైవసం చేసుకుని అదరగొట్టింది. అంతకు కొన్ని నెలల ముందే వన్డే ప్రపంచకప్‌లో గ్రూపు దశలోనే నిష్క్రమించి ఘోరంగా పరాభవాన్ని అందుకున్న టీమిండియా.. టీ20 ప్రపంచకప్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ.. విశ్వ విజేతగా నిలిచింది. నేటితో ఆ మహఘట్టానికి 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఆనాటి విశేషాల్లో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

ఆరంభమే చిరకాల ప్రత్యర్థితో..

టీ20 చరిత్రలోనే దాయాది జట్టు పాకిస్థాన్‌పై చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని సాధించింది టీమిండియా. టోర్నీ ఆరంభ మ్యాచ్ పాక్‌తో ఆడి అదిరిపోయే విజయాన్ని అందుకుంది. తొలుత బౌలింగ్ చేసిన పాక్.. గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లాంటి అగ్ర శ్రేణి ఆటగాళ్ల వికెట్లను తీసి టీమిండియాను పీకల్లోతూ కష్టాల్లో నెట్టింది. ఇలాంటి సమయంలో రాబిన్ ఊతప్ప అద్భుత అర్ధశతకంతో ఆదుకుని టీమిండియా మెరుగైన స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 141 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ కూడా అవే పరుగులు చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. ఆ తర్వాత వికెట్ బెయిల్స్ పడగొట్టే ఛాలెంజ్‌లో భారత ఆటగాళ్లు రాణించగా.. పాక్ బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా టీమిండియా ఆ మ్యాచ్‌లో విజయం సాధించింది.

యువీ ఆరు బంతులకు ఆరు సిక్సర్లు..

సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఇంగ్లాండ్‌తో టీమిండియా అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ఆరంభంలోనే సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ అదరగొట్టగా.. యువరాజ్ సింగ్ చివర్లో మెరుగైన ఫినిషింగ్ ఇచ్చాడు. ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో యువీని చూసి నోరు జారడంతో.. కోపోద్రిక్తుడైన యువీ.. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు బాదాడు. స్టేడియం నలు వైపులా సిక్సర్ల వర్షం కురిపించిన యువీ గుర్తుండి పోయే ప్రదర్శన చేశాడు. ఫ్లింటాఫ్ మాటకు యువీ బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. మధ్యలో బ్రాడ్ బలయ్యాడు. ఈ మ్యాచ్‌లో యువరాజ్ 12 బంతుల్లో అర్దశతకం పూర్తి చేసుకుని టీ20ల్లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

చిరకాల ప్రత్యర్థితో కలకాలం గుర్తుండే ఫైనల్..

దాయాది జట్టుతో టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో తడపడింది టీమిండియా. ఈ మ్యాచ్‌కు సెహ్వాగ్ దూరం కావడంతో టీమిండియాకు పెద్ద దెబ్బ తగిలింది. యూసుఫ్ పఠాన్, గంభీర్ ఓపెనింగ్ చేశారు. అయితే ఆరంభంలోనే యూసుఫ్ పఠాన్ వికెట్ కోల్పోయింది టీమిండియా. ఆ కాసేపటికే రాబిన్ ఊతప్ప కూడా ఔట్ కావడంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి సమయంలో గంభీర్ అర్ధశతకంతో అద్భుత ప్రదర్శన చేసి టీమిండియాకు మెరుగైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. రోహిత్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులతో రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది.

మలుపు తిప్పిన శ్రీశాంత్..

అనంతరం లక్ష్య ఛేదనంలో పాకిస్థాన్ తడబడింది. మహమ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ వికెట్లను ఆర్పీ సింగ్ ఆరంభంలోనే పడగొట్టి దెబ్బ కొట్టాడు. అనంతరం ఇర్ఫాన్ పఠాన్ మెరుగ్గా బౌలింగ్ చేసి దాయాది జట్టుపై ఒత్తిడి పెంచాడు. ఫలితంగా భారత్ సులభంగానే విజయం సాధించేలా కనిపించింది. అయితే పాక్ బ్యాటర్ మిస్బా ఉల్ హఖ్ అంత సులభంగా లొంగలేదు. చివరకు వరకు ఆడి పాకిస్థాన్ అభిమానుల్లో ఆశలు రేపాడు.

దాయాది జట్టు గెలవాలంటే చివరి ఓవర్‌కు 13 పరుగులు అవసరం కాగా.. జోగిందర్ శర్మకు బౌలింగ్ ఇచ్చాడు ధోనీ. అతడు వేసిన మొదటి బంతే వైడ్ కాగా.. అనంతరం డాట్ బాల్ వేశాడు. అయితే రెండో బంతిని మిస్బా నేరుగా స్టాండ్స్‌లో పంపి సిక్సర్‌గా మలిచాడు. ఫలితంగా మ్యాచ్ పాకిస్థాన్‌ వైపు మళ్లింది. దీంతో ఫలితం నాలుగు బంతుల్లో 6 పరుగులుగా మారింది. జోహన్నస్‌బర్గ్ స్డేడియంలో అంతా నిశ్శబ్దం. ఉత్కంఠతో అందరి నరాలు ఉప్పొంగుతున్నాయి. అందరి చూపు జోగింద్ర శర్మ వైపే ఉన్నాయి. అతడు మూడో బంతిని విసిరాడు.. ఆ బంతిని స్కూప్ షాట్‌గా ఆడిన మిస్బా గాల్లోకి లేపాడు. షార్ట్ ఫైన్ లెగ్‌లో ఉన్న శ్రీశాంత్ ఆ బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు. ఫలితంగా టీమిండియా ఆవరణంలో సంబురాలు మొదలయ్యాయి.

స్టేడియంలో భారత అభిమానుల కేరింతలు, గోలలు నడుమ మొదటి టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్ జరిగి నేటితో సరిగ్గా 15 ఏళ్లు పూర్తయ్యాయి. సీనియర్లు ఎవరులేని అందుబాటులో లేని ఈ మ్యాచ్‌లో యువ భారత్ అద్బుతమే చేసింది. అప్పటి వరకు ఒక్కసారి కూడా కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీని.. అందళంపై కూర్చొబెట్టింది. ఆ ఫలితమే 2011 వన్డే ప్రపంచకప్ సమరంలో మరోసారి టీమిండియాను విశ్వవిజేతను చేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం