Gambhir on Dhoni: ధోనీని అనవసరంగా హీరోని చేశారు.. యువరాజ్ వల్లే ఆ రెండు వరల్డ్‌కప్స్ గెలిచాం: గంభీర్
12 June 2023, 14:32 IST
- Gambhir on Dhoni: ధోనీని అనవసరంగా హీరోని చేశారు.. యువరాజ్ వల్లే ఆ వరల్డ్‌కప్స్ గెలిచాం అని గంభీర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అటు హర్భజన్ సింగ్ కూడా ఇలాంటిదే వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేశాడు.
గౌతమ్ గంభీర్
Gambhir on Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీపై మరోసారి విరుచుకుపడ్డాడు గౌతమ్ గంభీర్. 2007, 2011 విజయాలు కేవలం ధోనీ వల్లే సాధ్యమైనట్లుగా అతడి పీఆర్ టీమ్ ప్రచారం చేసిందని, నిజానికి ఆ రెండింట్లోనూ యువరాజ్ దే కీలకపాత్ర అని గంభీర్ అనడం గమనార్హం. అటు ఓ అభిమాని చేసిన ట్వీట్ పై హర్భజన్ సింగ్ కూడా ఇలాగే వ్యంగ్యంగా స్పందించాడు.
గంభీర్ న్యూస్18తో మాట్లాడుతూ.. ఈ కామెంట్స్ చేశాడు. "అతడు (ధోనీ) ఎప్పుడూ నేనే వరల్డ్ కప్ గెలిపించానని చెప్పుకుంటాడు. కానీ 2011, 2007లలో టీమ్ ను ఫైనల్స్ కు తీసుకెళ్లిన ప్లేయర్ యువరాజ్ సింగ్. నాకు తెలిసి రెండు టోర్నమెంట్లలోనూ అతడే మ్యాన్ ఆఫ్ ద సిరీస్" అని గంభీర్ అన్నాడు. నిజానికి 2011లో యువీయే మ్యాన్ ఆఫ్ ద టోర్నీ అయినా.. 2007లో మాత్రం అఫ్రిదికి ఇచ్చారు. దీనిపై కూడా గంభీర్ స్పందించాడు.
"నాకు కచ్చితంగా తెలియదు. కానీ 2007, 2011 వరల్డ్ కప్ ల గురించి మాట్లాడినప్పుడు దురద్రుష్టవశాత్తూ మనం యువరాజ్ పేరు మరచిపోతాం. ఇది కేవలం అంటే కేవలం మార్కెటింగ్, పీఆర్ టీమ్ మాత్రమే ఒక వ్యక్తిని మిగతా అందరి కంటే చాలా ఎక్కువగా చేసి చూపిస్తోంది.
ఎవరూ తక్కువ కాదు. ఇదంతా పీఆర్, మార్కెటింగ్ మాయ. మనకు ఎవరు 2007, 2011 వరల్డ్ కప్ లు సాధించి పెట్టారో చెబుతూ వస్తున్నారు. కానీ అది ఆ ఒక్కడు కాదు మొత్తం టీమ్ వల్ల. ఏ ఒక్కరో అంత పెద్ద టోర్నీ గెలవలేరు. అలా అయితే ఇండియా ఇప్పటికే 5-10 వరల్డ్ కప్ లు గెలిచేది" అని గంభీర్ అన్నాడు.
ఇండియా వ్యక్తిపూజ చేసే దేశమని, అందుకే చాలా రోజులుగా ఐసీసీ ట్రోఫీ గెలవడం లేదని కూడా గంభీర్ అనడం గమనార్హం. "చాలా మంది ఈ విషయం చెప్పరు కానీ ఇది నిజం. మన దేశంలో టీమ్ గురించి పట్టించుకోరు. ఓ వ్యక్తి పూజకే పరిమితమవుతారు. వ్యక్తులను జట్టు కంటే ఎక్కువగా భావిస్తారు.
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో వ్యక్తి కంటే జట్లే గొప్పవి. మన దేశంలో బ్రాడ్‌కాస్టర్, మీడియా, అందరూ ఓ పీఆర్ ఏజెన్సీ స్థాయికి దిగజారారు. బ్రాడ్‌కాస్టర్లు క్రెడిట్ ఇవ్వకపోతే చిన్నచూపుకు గురవుతారు. ఇదే నిజం" అని గంభీర్ స్పష్టం చేశాడు.
ఇలా వ్యక్తి పూజలు 1983 వరల్డ్ కప్ గెలిచినప్పుటి నుంచే ప్రారంభమైందని కూడా గంభీర్ అనడం విశేషం. ఎంతమంది మొహిందర్ అమర్‌నాథ్ గురించి మాట్లాడుతారని కూడా ఈ సందర్భంగా అతడు ప్రశ్నించాడు. "వరల్డ్ కప్ లో అమర్ నాథ్ ప్రదర్శన ఎలా ఉంది? మీరు కేవలం కపిల్ దేవ్ ట్రోఫీ పట్టుకోవడమే చూశారు కదా?
కానీ సెమీఫైనల్, ఫైనల్లో అమర్‌నాథ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చింది. ఫైనల్లో అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వచ్చిందని మీకు తెలుసా? ఇదే సమస్య. ఇప్పటి వరకూ కేవలం 1983 వరల్డ్ కప్ ను కపిల్ దేవ్ పట్టుకోవడమే చూపించారు. కానీ మొహిందర్ అమర్‌నాథ్ ను కూడా అప్పుడప్పుడూ చూపించండి" అని గంభీర్ అన్నాడు.