Dhoni Surgery: ధోనీకి మోకాలి సర్జరీ సక్సెస్
Dhoni Surgery: ధోనీకి మోకాలి సర్జరీ సక్సెస్ అయింది. ఐపీఎల్లో ఆడుతూ ధోనీ గాయానికి గురైన విషయం తెలిసిందే. గాయంతోనే అతడు ఈ సీజన్ మొత్తం ఆడుతూ వచ్చాడు.
Dhoni Surgery: టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ తన ఎడమ మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఐదో టైటిల్ సాధించి పెట్టిన ధోనీ.. అహ్మదాబాద్ నుంచి నేరుగా ముంబై వెళ్లాడు. అక్కడ ప్రముఖ స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ సర్జన్, బీసీసీఐ మెడికల్ ప్యానెల్లో ఉన్న డాక్టర్ దిన్షా పర్దీవాలాను సంప్రదించాడు.
ఆయన ధోనీ మోకాలికి సర్జరీ నిర్వహించాడు. ఈ డాక్టరే గతంలో రిషబ్ పంత్ తోపాటు ఎంతో మంది ఇండియన్ క్రికెటర్లకు సర్జరీలు నిర్వహించాడు. "అవును, ధోనీకి గురువారం (జూన్ 1) ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో మోకాలి సర్జరీ జరిగింది. అతడు బాగానే ఉన్నాడు. ఒకటి, రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత రీహ్యాబిలిటేషన్ ప్రారంభిస్తాడు. వచ్చే ఐపీఎల్ సమయానికి అతడు పూర్తి ఫిట్ గా ఉంటాడు" అని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ పీటీఐతో చెప్పింది.
ఐపీఎల్ సీజన్ మొత్తం అతడు తన మోకాలికి బ్యాండేజ్ తో ఆడాడు. వికెట్ కీపింగ్ సమయంలో అతడు పెద్దగా ఇబ్బంది పడలేదు. అయితే బ్యాటింగ్ సమయంలోనే వికెట్ల మధ్య పరుగు తీయడానికి ఇబ్బంది పడ్డాడు. చాలా వరకూ లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగాడు. నిజానికి ధోనీకి ఇంత త్వరగా సర్జరీ జరుగుతుందని ఎవరూ అనుకోలేదు.
మోకాలికి సర్జరీ చేయించుకోవాలా వద్దా అన్నది పూర్తిగా ధోనీ వ్యక్తిగత నిర్ణయమని బుధవారం (మే 31) సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ అన్నారు. అయితే ఆ మరుసటి రోజే ధోనీ సర్జరీ కూడా చేయించేసుకున్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడతానా లేదా అన్నది తన శరీరం నిర్ణయిస్తుందని ఫైనల్ తర్వాత ధోనీ అన్న విషయం తెలిసిందే.
సంబంధిత కథనం