Rishabh Pant : అండర్-16 ఆటగాళ్లతో రిషబ్ పంత్
Rishabh Pant : అండర్-19 ఆటగాళ్ల యువ క్రికెటర్ రిషబ్ పంత్ మాట్లాడాడు. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది.

భారత యువ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ రిషబ్ పంత్(Rishabh Pant) కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. డిసెంబర్ 30, 2022న జరిగిన ఘోర కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ ఏడాది మొత్తం క్రికెట్‌కు దూరంగా ఉండనున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL), ఢిల్లీ క్యాపిటల్స్‌కు పంత్ గైర్హాజరీతో ఎదురుదెబ్బ తగిలినట్టైంది. అంతేకాదు ఈ ఏడాది టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ODI ప్రపంచకప్ వంటి ముఖ్యమైన మ్యాచ్‌లకు కూడా పంత్ దూరంగానే ఉంటాడు.
గతంలో కంటే.. పంత్ ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగుంది. ఇటీవలే పంత్ సోషల్ మీడియా(Social Media)లో పెట్టిన పోస్ట్ ను బట్టి ఎలాంటి ఊతకర్ర సహాయం లేకుండా నడుస్తున్నాడని అర్థమవుతోంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టు మ్యాచ్ సందర్భంగా న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియాన్ని సందర్శించాడు. తాజాగా అండర్ 19 ఆడగాళ్లను కలిశాడు.
బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో అండర్-16 ఆటగాళ్లతో పంత్ మాట్లాడుతున్న ఫొటోలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పంచుకుంది. పంత్ యువ ఆటగాళ్లతో సంభాషిస్తున్న చిత్రాలను షేర్ చేసింది. తన అనుభావాల గురించి పంత్ చెప్పాడు.
'బెంగుళూరులోని NCAలో జరిగిన U-16 శిబిరంలో ఉన్న అబ్బాయిలు రిషబ్ పంత్‌తో సంభాషించే అవకాశాన్ని పొందారు. క్రికెట్, లైఫ్ స్టైల్, హార్డ్ వర్క్, మరెన్నో విషయాలపై యువ ఆటగాళ్లు పంత్‌తో సంభాషించారు. పంత్ తన విలువైన సమయాన్ని ఇచ్చాడు.' అని బీసీసీఐ తన ట్వీట్‌లో పేర్కొంది.
గతంలో ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. డెహ్రాడూన్‌లో ప్రాథమిక చికిత్స పొందిన అనంతరం ప్రత్యేక చికిత్స కోసం ముంబైకి తరలించారు. ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు పంత్ దూరంగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు కూడా దూరమయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో పంత్ బాగా రాణిస్తున్నాడు. ముఖ్యంగా టెస్టు మ్యాచ్‌లలో బాగా ఆడుతున్నాడు. పంత్ 33 మ్యాచ్‌ల్లో ఐదు సెంచరీలు, 11 అర్ధసెంచరీలతో 43.67 సగటుతో 2271 పరుగులు చేశాడు. మరోవైపు వన్డేల్లో సెంచరీ కూడా చేశాడు. 30 మ్యాచ్‌ల్లో 34.60 సగటుతో 865 పరుగులు చేశాడు. అయితే ప్రమాదానికి ముందు టీ20ల్లో పంత్ క్రీజులో విఫలమయ్యాడు. ఆడిన 66 మ్యాచ్‌ల్లో 22.43 సగటుతో 987 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ 126.37 మాత్రమే. ఐపీఎల్‌లో 147.97 స్ట్రైక్ రేట్, 34.61 సగటుతో 2838 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 15 అర్ధసెంచరీలు కూడా ఉన్నాయి.