Imran Khan - Pakistan: రగులుతున్న పాకిస్థాన్: ఆందోళనలు తీవ్రం: 'పీటీఐ' పిలుపుతో ఉత్కంఠ.. సోషల్ మీడియా బంద్-social media platforms down in pakistan after imran khan arrest protest continues ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imran Khan - Pakistan: రగులుతున్న పాకిస్థాన్: ఆందోళనలు తీవ్రం: 'పీటీఐ' పిలుపుతో ఉత్కంఠ.. సోషల్ మీడియా బంద్

Imran Khan - Pakistan: రగులుతున్న పాకిస్థాన్: ఆందోళనలు తీవ్రం: 'పీటీఐ' పిలుపుతో ఉత్కంఠ.. సోషల్ మీడియా బంద్

Chatakonda Krishna Prakash HT Telugu
May 10, 2023 08:22 AM IST

Imran Khan Arrest - Pakistan: ఇమ్రాన్ ఖాన్ అరెస్టును ఖండిస్తూ పాకిస్థాన్‍లో నిరసనలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఆందోళనలు హింసాత్మకమయ్యాయి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ సేవలను పాక్ ప్రభుత్వం నిలిపివేసింది.

ఆందోళనకారులపై పాక్ భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న దృశ్యం
ఆందోళనకారులపై పాక్ భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్న దృశ్యం (AP)

Imran Khan Arrest - Pakistan: మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) అరెస్టు తర్వాత పాకిస్థాన్‍లో ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. ఇమ్రాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (PTI) పార్టీ కార్యకర్తలు, ఇమ్రాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. వేలాదిగా రహదారులపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. అవినీతి కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద ఇమ్రాన్ ఖాన్ (Islamabad High Court)ను పారామిలటరీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి పాక్‍లో నిరసనలు జరుగుతున్నాయి. బుధవారం కూడా కొనసాగుతున్నాయి. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులంతా ఇస్లామాబాద్‍లోని జ్యుడిషియల్ కాంప్లెక్స్‌కు బుధవారం ఉదయం రావాలని పీటీఐ పార్టీ పిలుపునివ్వటంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

ఇమ్రాన్‍ను విడుదల చేసే వరకు!

Imran Khan Arrest - Pakistan: “తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులు.. ఇస్లామాబాద్‍లోని జ్యుడిషియల్ కాంప్లెక్స్‌కు ఉదయం 8 గంటలకు చేరుకుంటారు. దేశవ్యాప్తంగా దీక్షలు, ఆందోళనలు కొనసాగుతాయి. ఇమ్రాన్ ఖాన్‍ను విడుదల చేసేంత వరకు నిరసనలు జరుగుతాయి” అని ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ట్వీట్ చేసింది. ఈ పిలుపుతో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనన్న టెన్షన్ నెలకొంది.

సుప్రీం కోర్టుకు..

Imran Khan Arrest - Pakistan: ఇమ్రాన్ ఖాన్ అరెస్టు చట్టబద్ధమేనని ఇస్లామాబాద్ హైకోర్టు చెప్పింది. దీంతో సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు పీటీఐ పార్టీ సిద్ధమైంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టును నిలుపుదల చేసి ఆయనను విడుదల చేయాలని కోరుతూ బుధవారం ఉదయం సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తామని పీటీఐ పార్టీ ఉపాధ్యక్షుడు ఫావద్ చౌదరి వెల్లడించారు.

Imran Khan Arrest - Pakistan: ఆల్ ఖాదీర్ ట్రస్టు కేసులో నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో (NAB) వారెంట్‍తో ఇమ్రాన్ ఖాన్‍ను పారామిలటరీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను పోలీసులు హింసిస్తున్నారని పీటీఐ పార్టీ ఆరోపిస్తోంది.

సోషల్ మీడియా బంద్

Imran Khan Arrest - Pakistan: ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత ఆందోళనలు తీవ్రంగా జరుగుతుంటంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో ట్విట్టర్, ఫేస్‍బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍లను పాకిస్థాన్ ప్రభుత్వం బ్లాక్ చేసింది. చాలా చోట్ల ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది. సోషల్ మీడియాలో ఆందోళనలకు సంబంధించిన విషయాలు వ్యాప్తి కాకుండా ఈ చర్యలు తీసుకుంది. పాకిస్థాన్‍లో యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్‍బుక్ పనిచేయడం లేదని వేలాది మంది యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారని ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‍సైట్ డౌన్‍డిటెక్టర్ వెల్లడించింది.

ఆర్మీ హెడ్‍క్వార్టర్లలోకి ఆందోళనకారులు

Imran Khan Arrest - Pakistan: ఇమ్రాన్ ఖాన్ అరెస్టును ఖండిస్తూ జరుగుతున్న ఆందోళనలు పాక్ ఆర్మీ హెడ్‍క్వార్టర్లకు చేరాయి. రావల్పిండిలోని హెడ్‍క్వార్టర్స్‌లో వందలాది మంది ప్రవేశించారు. రావల్పిండి, లాహోర్‌ల్లో ఉన్న ఆర్మీ కమాండర్ల ఇళ్ల కాంపౌండ్లను దాటుకొని వెళ్లి.. ఆందోళన చేస్తున్నారు ఇమ్రాన్ మద్దతుదారులు. ఇందుకు సంబంధించి కొన్ని వీడియోలు కూడా బయటికి వచ్చాయి.

IPL_Entry_Point