Imran Khan Arrest: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్.. "కోర్టు నుంచి ఈడ్చుకెళ్లారు": పీటీఐ పార్టీ ఆరోపణ-former pakistan prime minister imran khan arrested ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imran Khan Arrest: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్.. "కోర్టు నుంచి ఈడ్చుకెళ్లారు": పీటీఐ పార్టీ ఆరోపణ

Imran Khan Arrest: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్.. "కోర్టు నుంచి ఈడ్చుకెళ్లారు": పీటీఐ పార్టీ ఆరోపణ

Chatakonda Krishna Prakash HT Telugu
May 09, 2023 03:23 PM IST

Imran Khan Arrested: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

Imran Khan Arrest: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్!
Imran Khan Arrest: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్! (ANI)

Imran Khan Arrested: పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (PTI) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఇస్లామాబాద్ (Islamabad) హైకోర్టు పరిసరాల్లో ఇమ్రాన్‍ను పారామిలటరీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు ఆయనను చుట్టుముట్టారు. పదుల కొద్ది పెండింగ్ కేసుల విషయంలో విచారణకు హైకోర్టుకు వచ్చిన సమయంలో ఇమ్రాన్ ఖాన్‍ను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, కోర్టు లోపలి నుంచి ఇమ్రాన్‍ను పోలీసులు బయటికి ఈడ్చుకొచ్చారని పీటీఐ పార్టీ నాయకులు ఆరోపించారు. పోలీసులు ఆయనను హింసిస్తున్నారని అంటున్నారు.

Imran Khan Arrested: తనకు చెందిన ఖాదీర్ ఖాన్ ట్రస్టుకు కోట్ల విలువైన భూములను అధికారంలో ఉన్నప్పుడు కేటాయించుకున్నారన్న ఆరోపణలతో నమోదైన ఖాదీర్ ఖాన్ ట్రస్టు కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఈ విషయాన్ని ఇస్లామాబాద్ పోలీసులు ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. 144 సెక్షన్ విధిస్తున్నామని, పీటీఐ పార్టీ మద్దతుదారులు వీధుల్లో ఆందోళనలు చేయకూడదని పోలీసులు హెచ్చరించారు.

Imran Khan Arrested: ఇమ్రాన్ ఖాన్‍ను పదుల సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి వాహనంలో ఎక్కిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. ఇమ్రాన్ ఖాన్‍ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని పీటీఐ పార్టీ కూడా ఓ వీడియోను షేర్ చేసింది. “వారు (పోలీసులు) ఇమ్రాన్ ఖాన్‍ను హింసిస్తున్నారు. ఖాన్ సాహిబ్‍ను కొడుతున్నారు” అని పీటీఐ పార్టీ నాయకుడు ముష్రత్ చీమా ట్విట్టర్‌లో ఓ వీడియో మెసేజ్ పోస్ట్ చేశారు.

Imran Khan Arrested: కొంతకాలంగా ఇమ్రాన్ ఖాన్‍ను అరెస్ట్ చేసేందుకు పాకిస్థాన్ దళాలు చాలా ప్రయత్నాలు చేశాయి. గతంలో ఆయన నివాసం వద్ద భారీ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు అప్పట్లో వెనక్కి తగ్గారు. ఇప్పుడు కోర్టు వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ఏప్రిల్‍లో ప్రధాని పదవి కోల్పోయిన నాటి నుంచి ఇమ్రాన్ ఖాన్‍పై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

Imran Khan Arrested: ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారంటూ మరో వీడియోను కూడా పీటీఐ పార్టీ పోస్ట్ చేసింది. ఇమ్రాన్ ఖాన్ లాయర్‌ను పోలీసులు తీవ్రంగా కొట్టారని ఆరోపించింది. ప్రజాస్వామ్యానికి ఇది బ్లాక్ డే అని పీటీఐ పార్టీ పేర్కొంది.

Imran Khan Arrested: ఇస్లామాబాద్ కోర్టుకు హాజరయ్యే ముందు ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో విడుదల చేశారు. గతంలో వజీరాబాద్‍లో తనపై జరిగిన హత్యాయత్నంలో ఐఎస్ఐ ఉన్నతాధికారి మేజర్ ఫైజల్ నజీర్ హస్తం ఉందని ఆరోపించారు. రెండు రోజుల క్రితం జర్నలిస్టు అర్షద్ షరీఫ్ హత్యలో కూడా నజీర్‍కు ప్రమేయం ఉందని విమర్శించారు.

IPL_Entry_Point