Arshdeep Singh Trolls: అర్ష‌దీప్‌ను ట్రోల్ చేస్తోన్న పాకిస్థాన్ క్రికెట్‌ ఫ్యాన్స్ - కార‌ణం ఇదే-pakistan cricket fans troll on arshdeep singh details here ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Arshdeep Singh Trolls: అర్ష‌దీప్‌ను ట్రోల్ చేస్తోన్న పాకిస్థాన్ క్రికెట్‌ ఫ్యాన్స్ - కార‌ణం ఇదే

Arshdeep Singh Trolls: అర్ష‌దీప్‌ను ట్రోల్ చేస్తోన్న పాకిస్థాన్ క్రికెట్‌ ఫ్యాన్స్ - కార‌ణం ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Apr 02, 2023 12:41 PM IST

Arshdeep Singh Trolls: పంజాబ్ పేస‌ర్ అర్ష‌దీప్‌సింగ్‌ను సోష‌ల్ మీడియాలో పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.కాపీ క్యాట్ అంటూ విమ‌ర్శ‌లు కురిపిస్తోన్నారు.

అర్ష‌దీప్‌సింగ్‌
అర్ష‌దీప్‌సింగ్‌

Arshdeep Singh Trolls: శ‌నివారం జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై పంజాబ్ కింగ్స్ ఏడు ర‌న్స్ తేడాతో విజ‌యాన్ని సాధించింది. మ్యాచ్‌లో మ‌ధ్య‌లో వ‌ర్షం కుర‌వ‌డంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం పంజాబ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్ పేస‌ర్ అర్ష‌దీప్ సింగ్ చేసిన ఓ ప‌ని ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ మ‌ధ్య సోష‌ల్ మీడియా వార్‌కు దారితీసింది.

ఈ మ్యాచ్‌లో రెండో ఓవ‌ర్‌లో బౌలింగ్‌కు దిగాడు అర్ష‌దీప్‌సింగ్‌. తాను వేసిన తొలి బంతికే కోల్‌క‌తా ఓపెన‌ర్ మ‌ణ్‌దీప్‌సింగ్‌ను ఔట్ చేశాడు. అర్ష‌దీప్ బౌన్స‌ర్‌ను త‌ప్పుగా అంచ‌నా వేసిన మ‌ణ్‌దీప్ సామ్ క‌ర‌న్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి బంతికే వికెట్ ద‌క్క‌డంతో ఆనందంతో త‌న‌ రెండు చేతుల‌ను పైకేత్తి అర్ష‌దీప్ సంబ‌రాలు చేసుకున్నాడు. పాకిస్థాన్ పేస‌ర్ షాహిన్ అఫ్రీది స్టైల్‌లో అర్ష‌దీప్ సెల‌బ్రేష‌న్స్ ఉండ‌టంతో సోష‌ల్ మీడియాతో అత‌డిని పాక్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తోన్నారు.

షాహిన్ అఫ్రిదీని అర్ష‌దీప్ కాపీ కొట్టాడ‌ని కామెంట్ చేస్తోన్నారు. అర్ష‌దీప్‌కు షాహిన్ స్ఫూర్తి అని, అందుకే అత‌డిని ఫాలో అవుతున్నాడంటూ విమ‌ర్శిస్తోన్నారు. ఫన్నీ మీమ్స్‌తో అత‌డిని ట్రోల్ చేస్తోన్నారు. పాకిస్థాన్ ట్రోల్స్‌కు ఇండియ‌న్ క్రికెట్ ఫ్యాన్స్ ధీటుగానే బ‌దులిస్తున్నారు. జ‌హీర్‌ఖాన్ నుంచే షాహిన్ ఈ సెల‌బ్రేష‌న్స్ స్టైల్‌ను కాపీ కొట్టాడ‌ని, అస‌లైన కాపీ క్యాట్ షాహిన్ అంటూ పేర్కొంటున్నారు.

అర్ష‌దీప్‌సెల‌బ్రేష‌న్స్ విష‌యంలో ఇండియా, పాక్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియా వార్ వైర‌ల్ అవుతోంది. కాగా ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఇర‌వై ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు న‌ష్ట‌పోయి 191 ర‌న్స్ చేసింది. రాజ‌ప‌క్స 50 ర‌న్స్‌, ధావ‌న్ 40 ప‌రుగుల‌తో రాణించారు. 192 ప‌రుగుల టార్గెట్‌తో బ‌రిలో దిగిన కోల్‌క‌తా 16 ఓవ‌ర్ల‌లో 146 ప‌రుగుల‌తో ఉన్న స‌మ‌యంలో వ‌ర్షం రావ‌డంతో డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప్ర‌కారం పంజాబ్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు.

WhatsApp channel