India in WTC final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్.. లంక ఓటమితో టీమిండియా మార్గం సుగమం-india qualify for wtc final for 2nd successive time after new zealand beat sri lanka ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  India In Wtc Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్.. లంక ఓటమితో టీమిండియా మార్గం సుగమం

India in WTC final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత్.. లంక ఓటమితో టీమిండియా మార్గం సుగమం

Maragani Govardhan HT Telugu
Mar 13, 2023 01:57 PM IST

India in WTC final: టీమిండియా వరుసగా రెండో సారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడబోతుంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ గెలవడంతో భారత్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మార్గం సుగమమైంది. ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది.

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్
వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ (AP)

2023 మార్చి 13.. ఈ రోజు భారత్‌‌ మర్చిపోలేనిది అవుతుందేమో. ఎందుకంటే రెండు ఆస్కార్ అవార్డులు రావడమే కాకుండా టీమిండియా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్(World test championship) ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఆస్ట్రేలియాతో సిరీస్ గెలవడానికంటే ముందే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది భారత్. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే శ్రీలంక ఓడిపోవడంతో టీమిండియా సునాయసంగా డబ్ల్యూటీసీ ఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో ఆస్ట్రేలియాతో ఫైనల్లో అమీ తుమీ తేల్చుకోనుంది.

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక ఓడిపోయింది. ఐదో రోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించనప్పటికీ 285 పరుగుల లక్ష్యాన్ని కివీస్ విజయవంతంగా ఛేదించింది. 2 వికెట్ల తేడాతో ఉత్కంఠ భరిత విజయాన్ని సొంతం చేసుకుంది. కేన్ విలియమ్సన్(121) అద్భుత సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్ ఓ పక్క వరుసగా వికెట్లు కోల్పోతున్నప్పటికీ చివరి వరకు పోరాడి తన జట్టుకు గెలుపును అందించాడు.

భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుసగా రెండో అర్హత సాధించింది. 2021లో కూడా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్లో ఆడింది. అయితే న్యూజిలాండ్‌తో జరిగిన తుదిపోరులో భారత్ ఓటమి పాలైంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడంతో టీమిండియా ఈ ఏడాది రెండో ఐసీసీ ఈవెంట్‌లో భాగం కానుంది. 2023 అక్టోబరు-నవంబరులో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది.

ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా డైరెక్టుగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్తుందనుకుంటున్న తరుణంలో అంతకంటే ముందు న్యూజిలాండ్ చేతిలో లంక జట్టు ఓటమి పాలై భారత్‌కు మార్గాన్ని సుగమం చేసింది.

టాపిక్