Hyderabad News : క్రికెట్ ఆడుతుండగా హార్ట్ ఎటాక్, ఏపీ యువకుడు మృతి!
Hyderabad News : రంగారెడ్డి జిల్లా ఘట్టుపల్లిలో విషాద ఘటన జరిగింది. క్రికెట్ ఆడుతుండగా ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.
Hyderabad News : కరోనా తర్వాత గుండె సమస్యలు ఎక్కువయ్యాయని వైద్యులు అంటున్నారు. ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణాలు కూడా పెరుగుతున్నాయి. క్షణకాలంలోనే గుండె స్పందన ఆగిపోతుంది. వయసుతో సంబంధంలేకుండా హార్ట్ ఎటాక్ తో చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువౌతుంది. ఆకస్మాత్తుగా గుండెపోటుతో మరణం సంభవించిన ఘటనే మరొకటి చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై సాఫ్ట్ వేర్ ఉద్యోగి మరణించాడు. వారాంతంలో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఘట్టుపల్లిలో శనివారం చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
ఏపీలోని ప్రకాశం జిల్లా మల్లవరం గ్రామానికి చెందిన మణికంఠ(26) అనే యువకుడు హైదరాబద్ కె.పి.హెచ్.బిలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి స్థానిక స్టేడియంలో క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లారు. శనివారం ఉదయం ఘట్టుపల్లి శివారులోని స్టేడియంలో క్రికెట్ ఆడుతుండగా... మణికంఠ ముందు బ్యాటింగ్ చేశాడు. అనంతరం ఒక ఓవర్ బౌలింగ్ వేసి వెన్నునొప్పి వస్తుందని కారులో పడుకున్నాడు. కారులో పడుకున్నాడని స్నేహితులు భావించారు. కాసేపటి తర్వాత మణికంఠను పిలిచినా పలకకపోవడంతో స్నేహితులు అతడిని మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మణికంఠ మృతి చెందాడని మణికంఠ సోదరుడు వెంకటేష్ తెలిపారు. మణికంఠ సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మణికంఠ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఇటీవల సిద్దిపేట జిల్లాలో
ఇటీవల క్రికెట్ ఆడుతున్న ఓ యువకుడి గుండె ఆగిపోయింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. చిగురుమామిడి మండలం సుందరగిరికి చెందిన శనిగరం ఆంజనేయులు(37) హుస్నాబాద్‌లో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొన్నాడు. బౌలింగ్ చేస్తున్న సమయంలో ఛాతీలో ఒక్కసారిగా నొప్పిరావడంతో ఆంజనేయుకు కుప్పకూలిపోయాడు. ఆంజనేయులు గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని గ్రహించిన స్నేహితులు సీపీఆర్ చేశారు. సీపీఆర్ చేస్తూ దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. అప్పటి వరకు ఎంతో సరదాగా తమతో క్రికెట్ ఆడిన స్నేహితుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందడాన్ని ఆంజనేయులు స్నేహితులు తట్టుకోలేకపోయారు.
పెరిగిపోతున్న గుండెపోటు మరణాలు
ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు బారినపడి చనిపోతున్నారు. డ్యాన్స్ చేస్తూ, కాలేజీలో స్నేహితులతో ఆడుకుంటూ, పాఠాలు చెబుతూ, టెన్నిస్ ఆడుతూ.. ఇలా అక్కడికక్కడే కుప్పకూలిపోయిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు యాభై ఏళ్లు దాటిన వారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చేయి. కరోనా తర్వాత యువత కూడా గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఇటీవల ఏపీలో పేపర్ వాల్యూయేషన్ చేస్తూ ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుకు గురై చనిపోయారు. బాపట్ల జిల్లా మున్సిపల్ స్కూల్ లో ఇటీవల పదోతరగతి జవాబు మూల్యాంకనం చేసేందుకు వచ్చిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు(48) గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందారు.