Gambhir Vs Kohli : చెన్నైని విష్ చేస్తూ.. కోహ్లీకి కౌంటర్ వేసిన గంభీర్
IPL 2023 Final : ఐపీఎల్ 2023 కప్ ను చెన్నై సూపర్ కింగ్స్ గెలిచింది. దోనీ సేనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే లక్నో కోచ్ గంభీర్ కూడా విష్ చేశాడు. ఈ సందర్భంగా కోహ్లీకి కౌంటర్ వేశాడు.
మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్(IPL Final) జరిగింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్(CSK Vs GT) 5 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయంతో ఐదోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆదివారమే జరగాల్సిన మ్యాచ్ వర్షం అంతరాయం కారణంగా సోమవారం రిజర్వ్ డేకి వాయిదా పడింది. అయితే తొలి ఇన్నింగ్స్ ముగిసి రెండో ఇన్నింగ్స్ ప్రారంభం కాగానే మళ్లీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా మ్యాచ్‌ని డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ఆడారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్‌కు 215 పరుగుల విజయలక్ష్యాన్ని అందించింది.
వర్షం కారణంగా మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించడంతో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) 15 ఓవర్లలో 171 పరుగులు చేయాల్సి ఉంది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన చెన్నై సూపర్ కింగ్స్ 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ముంబై ఇండియన్స్(Mumbai Indians) తర్వాత ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు సృష్టించింది. పలువురు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కోచ్‌గా ఉన్న గౌతం గంభీర్ కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపాడు.
'అభినందనలు చెన్నై సూపర్ కింగ్స్. ఒక ట్రోఫీ గెలవడం కష్టం. ఐదు ట్రోఫీలు గెలవడం నమ్మశక్యం కాదు.' అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన గంభీర్.. ఏకంగా ఐదు కప్పులు గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్‌కు కప్ గెలవడం కష్టమేనంటూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టును ట్రోల్ చేశాడని తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు.
గంభీర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. గతంలో ధోనీపై విరుచుకుపడిన గంభీర్.. ఇప్పుడు కోహ్లీ(Kohli) టీమ్‌ని ట్రోల్ చేసేందుకే ధోనీ టీమ్‌కి సపోర్ట్ చేస్తున్నాడని పలువురు విమర్శిస్తు్న్నారు.