India vs WI 3rd ODI Highlights: చివరి వన్డేలో దుమ్ము రేపిన టీమిండియా.. వరల్డ్ రికార్డు విజయం
02 August 2023, 7:30 IST
- India vs WI 3rd ODI Highlights: చివరి వన్డేలో దుమ్ము రేపింది టీమిండియా. వరల్డ్ రికార్డు విజయం సాధించింది. వెస్టిండీస్ ను మూడో వన్డేలో ఏకంగా 200 పరుగులతో చిత్తు చేసి సిరీస్ ఎగరేసుకుపోయింది.
వన్డే ట్రోఫీతో టీమిండియా సంబరాలు
India vs WI 3rd ODI Highlights: ప్రయోగాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇండియన్ క్రికెట్ టీమ్.. అదే ప్రయోగాలతో వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో దుమ్ము రేపింది. కోహ్లి, రోహిత్ లాంటి స్టార్ బ్యాటర్లు లేకపోయినా బ్యాటింగ్ లో సత్తా చాటి వెస్టిండీస్ ను ఏకంగా 200 పరుగులతో ఓడించింది. మూడు వన్డేల సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది.
వెస్టిండీస్ పై ఇండియాకు ఇది వరుసగా 13వ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. ఓ ప్రత్యర్థిపై వరుసగా ఓ టీమ్ సాధించిన అత్యధిక సిరీస్ విజయాల రికార్డు ఇది. నిజానికి రెండోస్థానంలో ఉన్న పాకిస్థాన్ (జింబాబ్వేపై 11 సిరీస్ విజయాలు) రికార్డును గతంలోనే బ్రేక్ చేయగా.. ఇప్పుడా వరల్డ్ రికార్డును మరింత మెరుగుపరచుకుంది. 2007 నుంచి వెస్టిండీస్ చేతుల్లో ఒక్క వన్డే సిరీస్ లోనూ ఇండియా ఓడలేదు.
బ్యాటింగ్, బౌలింగ్.. బాదుడే బాదుడు
తీవ్ర విమర్శల మధ్య మూడో వన్డేలోనూ కోహ్లి, రోహిత్ లేకుండానే కసిగా బరిలోకి దిగిన యంగ్ ఇండియన్ టీమ్ చెలరేగిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్లకు 351 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (77) శుభ్‌మన్ గిల్ (85), సంజూ శాంసన్ (51), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (70) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
ఈ వన్డే ఓడితే 2006 తర్వాత తొలిసారి విండీస్ చేతుల్లో సిరీస్ ఓటమి ఎదురవుతుందని తెలిసినా ఇందులోనూ ప్రయోగాల నుంచి వెనక్కి తగ్గలేదు. అయితే చివరికి అది సానుకూల ఫలితమే ఇచ్చింది. ఈ సిరీస్ లో మూడు వన్డేల్లోనూ హాఫ్ సెంచరీలు చేసిన ఇషాన్ కిషన్.. ఈ ఘతన సాధించిన ఆరో ఇండియన్ ప్లేయర్ అయ్యాడు. మొదట 1982లో శ్రీలంకపై క్రిష్ణమాచారి శ్రీకాంత్ ఈ ఘనత సాధించగా.. చివరిగా శ్రేయస్ అయ్యర్ 2020లో న్యూజిలాండ్ పై ఇలా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు.
1985లో వెంగ్‌సర్కార్, 1993లో మహ్మద్ అజారుద్దీన్, 2019లో ధోనీ కూడా ఇలా మూడు వన్డేల సిరీస్ లో ప్రతి మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీలు బాదారు. ఈ క్రమంలో ఇండియా.. వెస్టిండీస్ గడ్డపై వన్డేల్లో తన అత్యధిక స్కోరు కూడా సాధించింది. 2009లో 339 పరుగులు చేయగా.. ఇప్పుడా రికార్డు బ్రేకయింది. చేజింగ్ లో వెస్టిండీస్ కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. శార్దూల్ 4, ముకేష్ 3 వికెట్లు తీసుకున్నారు. వన్డేల్లో వెస్టిండీస్ పై పరుగుల పరంగా ఇది రెండో అతి పెద్ద విజయం కావడం విశేషం. కొత్త బంతితో చెలరేగిన ముకేష్ 3 వికెట్లు తీయడంతో విండీస్ కోలుకోలేకపోయింది.