Shakeel World Record: పాకిస్థాన్ బ్యాటర్ సంచలన రికార్డు.. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి
Shakeel World Record: పాకిస్థాన్ బ్యాటర్ సంచలన రికార్డు క్రియేట్ చేశాడు. 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇలాంటి రికార్డు క్రియేట్ కావడం ఇదే తొలిసారి. ఇంతకీ అతడు సాధించిన ఆ రికార్డు ఏంటో తెలుసా?
Shakeel World Record: శ్రీలంకపై పాకిస్థాన్ చెలరేగిపోతోంది. తొలి టెస్ట్ గెలిచిన ఆ టీమ్.. రెండో టెస్టులోనూ గెలుపు బాటలో వెళ్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 563 పరుగులు చేసింది. ఇప్పటికే 397 పరుగుల ఆధిక్యంలో ఉంది. పాక్ తరఫున అబ్దుల్లా షఫీక్ డబుల్ సెంచరీ, సల్మాన్ అలీ ఆఘా సెంచరీ చేశారు.
అయితే తొలి టెస్ట్ డబుల్ సెంచరీ హీరో సాద్ షకీల్.. ఈ మ్యాచ్ లోనూ హాఫ్ సెంచరీతో ఓ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో అతడు 57 పరుగులు చేశాడు. 27 ఏళ్ల షకీల్.. ఇప్పటి వరకూ 7 టెస్టు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అందులో ఆరు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. దీంతో 146 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆడిన తొలి ఏడు టెస్టుల్లో ప్రతి మ్యాచ్ లోనూ ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేసిన తొలి బ్యాటర్ గా షకీల్ నిలిచాడు.
ఈ క్రమంలో అతడు సునీల్ గవాస్కర్, బేసిల్ బుచర్, సయీద్ అహ్మద్, బెర్ట్ సట్‌క్లిఫ్ లాంటి వాళ్లను అధిగమించాడు. వీళ్లంతా వాళ్లు ఆడిన తొలి ఆరు టెస్టుల్లో ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేశారు. షకీల్ ఏడో టెస్టులోనూ ఇదే రిపీట్ చేసి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. టాప్ ఫామ్ లో ఉన్న షకీల్.. తొలి టెస్టులోనూ డబుల్ సెంచరీ చేయడంతో శ్రీలంకను పాక్ చిత్తు చేసింది.
ఇక రెండో టెస్టు విషయానికి వస్తే.. పాకిస్థాన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 201, సల్మాన్ 132 పరుగులు చేశారు. షఫీక్ కు ఇదే తొలి డబుల్ సెంచరీ. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం సంపాదించిన ఆ టీమ్.. మ్యాచ్ లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక కేవలం 166 పరుగులకే కుప్పకూలింది. ఇప్పటికే డబ్ల్యూటీసీ టేబుల్లో ఇండియాను వెనక్కి నెట్టి టాప్ లో ఉన్న పాకిస్థాన్ ఈ మ్యాచ్ లోనూ గెలిస్తే తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది.
సంబంధిత కథనం