IND Vs WI 2nd ODI : రెండో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ విజయం
IND Vs WI 2nd ODI : టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఈ టూర్ లో భారత్ కు మెుదటి ఎదురుదెబ్బ తగిలింది. రెండో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ విజయం సాధించింది.
రెండో వన్డేలో విండీస్ జట్టు.. టీమిండియా(Team India)పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియాకు వెస్టిండీస్ పర్యటనలో మెుదటి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది. మెుదట టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. 181 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ 55, శుభ్ మన్ గిల్ 34 రాణించారు.
181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్(West Indies) బాగా ఆడింది. 36.4 ఓవర్లలోనే గెలిచింది. విండీస్ బ్యాట్స్ మెన్ షైహోప్ 63, కార్టీ 48 నాటౌట్ గా నిలిచారు. కైల్ మేయర్స్ 36 పరుగులు చేశాడు. తక్కువ స్కోరు లక్ష్యంగా వెస్టిండీస్ బరిలోకి దిగింది. ఓపెనర్స్ బ్రెండ్ కింగ్ 15, కైల్ మేయర్స్ మంచి ఆరంభం అందించారు. బ్రెండన్ నెమ్మదిగా ఆడాడు. కానీ కైల్ మేయర్స్ దూకుడు ప్రదర్శన చేశాడు. ముకేశ్ కుమార్ రెండో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు కైల్ మేయర్స్. మేయర్స్ ఆటకు శార్దూల్ ఠాకూర్ బ్రేక్ వేశాడు. అతడు వేసిన తొమ్మిదో ఓవర్ తొలి బంతిని సిక్స్ కొట్టి.. తర్వాతి బంతికే ఉమ్రాన్ మాలిక్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అదే ఓవర్లో బ్రెండన్ ను శార్దూల్ ఔట్ చేశాడు. మరికొద్దిసేపటికే అథనేజ్ కూడా శార్దూల్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
అనంతరం హెట్ మయర్ క్రీజులోకి వచ్చాడు. 9 పరుగులు చేసిన అతడిని కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఆట టీమిండియా చేతిలోకి వస్తుందని అంతా అనుకున్నారు. కానీ క్రీజులో ఉన్న షై హోప్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. కార్టీతో కలిసి స్కోరు బోర్డును పరుగుల పెట్టించాడు. హోప్ 70 బంతుల్లో హాఫ్ సెంచరీ బాధాడు. హార్దిక్ బౌలింగ్లో కార్టీ రెండు ఫోర్లు కొట్టి.. విండీస్ కు విజయాన్ని ఇచ్చాడు. భారత్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీసుకున్నారు.
అంతకు ముందు టాస్ ఓటి బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు ఇషాన్ కిషన్(Ishan Kishan), శుభ్ మన్ గిల్.. మంచి ఆరంభం అందించారు. నిలకడగా ఆడి 90 పరుగులు చేశారు. అప్పటి వరకూ వికెట్ పడలేదు. తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి. ఓపెనర్లు ఇషాన్ కిషన్ 55, శుభ్ మన్ గిల్ 34 రాణించారు. అక్షర్ పటేల్ 1, సంజు శాంసన్ 9, హార్దిక్ పాండ్య 7 పరుగులు చేశారు. 113 పరుగులకు ఇండియా 5 వికెట్లు కోల్పోయింది.
తర్వాత వర్షం అంతరాయం కలిగించింది. దీంతో ఆటను నిలిపేశారు. వర్షం తగ్గి మ్యాచ్ ప్రారంభమైన తర్వాత.. కూడా వికెట్లు పడ్డాయి. సీనియర్ ఆటగాళ్లు సైతం త్వరగానే ఔటయ్యారు. జడేజా(Jadeja) 10, సూర్యకుమార్(Surya Kumar) కూడా ఔట్ కావడంత భారత్ కష్టాల్లో పడింది. శార్దూల్ ఠాకూర్ కూడా ఎక్కువసేపు క్రీజులో లేడు. 16 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఉమ్రాన్ మాలిక్ 0, ముకేశ్ కుమార్ 6 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెఫర్డ్ 3, మోతీ 3, జోసెఫ్ 2, సీల్స్, కరియా ఒక్కో వికెట్ తీశారు. నిర్ణయాత్కమ మూడో వన్డే ఆగస్టు 1న జరగనుంది.