India vs West Indies 3rd ODI: మళ్లీ కోహ్లి, రోహిత్ లేకుండానే టీమిండియా.. ఆ ఇద్దరూ ఔట్
India vs West Indies 3rd ODI: మళ్లీ కోహ్లి, రోహిత్ లేకుండానే టీమిండియా బరిలోకి దిగింది. వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో రెండు మార్పులు చేసినా.. ఆ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ మాత్రం డ్రెస్సింగ్ రూమ్ కే పరిమితమయ్యారు.
India vs West Indies 3rd ODI: వెస్టిండీస్ తో రెండో వన్డే ఓడిపోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా.. మూడో వన్డేను కూడా స్టార్ ప్లేయర్స్ రోహిత్, కోహ్లి లేకుండానే ఆడుతోంది. ఈ మ్యాచ్ ఓడిపోతే సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉన్నా కూడా ఇండియన్ టీమ్ ప్రయోగాలను వీడలేదు. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
అయితే రెండో వన్డే ఆడిన టీమ్ లో ఇండియా రెండు మార్పులు చేసింది. ఉమ్రాన్ మాలిక్, అక్షర్ పటేల్ స్థానాల్లో జైదేవ్ ఉనద్కట్, రుతురాజ్ గైక్వాడ్ జట్టులోకి వచ్చారు. దీంతో రుతురాజ్ ఓపెనింగ్ చేస్తాడా అన్న సందేహాలు కూడా ఉన్నాయి. జైదేవ్ పదేళ్ల తర్వాత మళ్లీ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. చివరిసారి 2013లో వెస్టిండీస్ పైనే అతడు తన చివరి వన్డే ఆడాడు.
మూడో వన్డేకు సంజూ శాంసన్, సూర్యకుమార్ మరోసారి అవకాశం దక్కించుకోవడం విశేషం. మరోవైపు వెస్టిండీస్ మాత్రం తమ విన్నింగ్ కాంబినేషన్ కొనసాగించింది. రెండో వన్డే ఆడిన జట్టే మూడో వన్డే ఆడుతోంది. ఇండియా ఇలాంటి ప్రయోగాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
కోహ్లి, రోహిత్ లకు రెస్ట్ ఇవ్వడంలో అసలు అర్థమే లేదని క్రికెట్ పండితులు, అభిమానులు విమర్శిస్తున్నారు. అయినా టీమ్ వెనక్కి తగ్గలేదు. వరల్డ్ కప్ కు కేవలం రెండు నెలలు ఉన్న సమయంలో ఇలాంటి ప్రయోగాల వల్ల టీమిండియా దెబ్బ తింటుందని, మరీ అతిగా ప్రయోగాలు చేయడం వల్లే ఐసీసీ టోర్నీల్లో బోల్తా పడుతోందని ఓ అభిమాని ట్వీట్ చేయడం విశేషం.