Stokes on India: ఇండియాకు బజ్‌బాల్ వార్నింగ్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్-cricket news stokes says time will tell on bazball against india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Stokes On India: ఇండియాకు బజ్‌బాల్ వార్నింగ్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్

Stokes on India: ఇండియాకు బజ్‌బాల్ వార్నింగ్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్

Hari Prasad S HT Telugu
Aug 01, 2023 05:16 PM IST

Stokes on India: ఇండియాకు పరోక్షంగా బజ్‌బాల్ వార్నింగ్ ఇచ్చాడు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. అయితే ఈ స్టైల్ క్రికెట్ తో తాము అన్నిసార్లూ విజయం సాధించలేకపోయామని కూడా స్టోక్స్ చెప్పడం విశేషం.

యాషెస్ చివరి టెస్టు గెలిచిన తర్వాత బెన్ స్టోక్స్ సంబరాలు
యాషెస్ చివరి టెస్టు గెలిచిన తర్వాత బెన్ స్టోక్స్ సంబరాలు (Action Images via Reuters)

Stokes on India: సొంతగడ్డపై యాషెస్ గెలవాలన్న ఇంగ్లండ్ ఆశ నెరవేరలేదు. వరుసగా మూడోసారి కూడా ఆస్ట్రేలియా దగ్గరే యాషెస్ అర్న్ ఉండిపోయింది. టెస్ట్ క్రికెట్ కు బజ్‌బాల్ అంటూ ఓ కొత్త స్టైల్ అలవాటు చేసిన ఇంగ్లండ్.. దానితోనే ఆస్ట్రేలియాను కొడుతుందని అందరూ భావించారు. కానీ కంగారూలపై ఆ పప్పులుడకలేదు.

చివరికి సిరీస్ ను 2-2తో మాత్రం డ్రా చేయగలిగింది. కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కెప్టెన్ స్టోక్స్ ఆధ్వర్యంలో ఇంగ్లండ్ టీమ్ చివరి 18 టెస్టుల్లో 14 గెలిచింది. దీంతో బజ్‌బాల్ స్టైల్ ను మిగతా జట్లు కూడా ఆసక్తిగా గమనించాయి. అయితే తాజాగా ఆస్ట్రేలియాపై యాషెస్ సిరీస్ లో ఈ స్టైల్ వర్కౌట్ కాని నేపథ్యంలో వచ్చే ఏడాది ఇండియాకు ఐదు టెస్టుల సిరీస్ కోసం రానున్న ఇంగ్లండ్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

దీనిపై యాషెస్ ముగిసిన తర్వాత కెప్టెన్ స్టోక్స్ స్పందించాడు. తమ బజ్‌బాల్ కొన్ని చోట్ల వర్కౌట్ కాలేదని, ఇండియాలో ఏం జరుగుతుందో కాలమే చెబుతుందని నిజాయతీగా చెప్పడం విశేషం. "న్యూజిలాండ్ ను మేము 3-0తో ఓడించినప్పుడు.. అది సౌతాఫ్రికాపై, పాకిస్థాన్ పై, ఆస్ట్రేలియాపై ఎందుకు చేయలేకపోయామని ప్రశ్నించారు. అందువల్ల ఇండియాపైనా అది చేస్తామా లేదా అన్నది ఎవరికీ తెలియదు. కాలమే దానికి సమాధానం చెప్పాలి" అని స్టోక్స్ అన్నాడు.

యాషెస్ సిరీస్ తొలి రెండు టెస్టుల్లో ఈ బజ్‌బాల్ స్టైల్ తో వెళ్లినా ఆ రెండు మ్యాచ్ లలోనూ ఇంగ్లండ్ ఓడిపోయింది. అయితే తర్వాతి మూడింట్లో రెండు గెలిచి సిరీస్ ను డ్రా చేయగలిగింది. ఇప్పుడు ఇండియాలో స్పిన్ కు అనుకూలించే పిచ్ లపై ఇంగ్లండ్ బజ్ బాల్ స్టైల్లో ఆడటం సాధ్యం కాకపోవచ్చని క్రికెట్ పండితులు స్పష్టం చేస్తున్నారు.

వచ్చే ఏడాది జనవరిలో ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇండియాకు రానుంది ఇంగ్లండ్ టీమ్. హైదరాబాద్, విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలల్లో ఐదు టెస్టులు జరగనున్నాయి. వీటిలో ధర్మశాల తప్ప మిగతా పిచ్ లన్నీ స్పిన్ కే అనుకూలిస్తాయి. అయితే ఇండియాపైనా బజ్‌బాల్ స్టైల్లోనే ఆడతామన్న నమ్మకంతో స్టోక్స్ ఉన్నాడు.

Whats_app_banner